భారత రెజ్లర్లు చేపట్టిన దీక్షలో కీలక పరిణామం
భారత్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత అగ్రశ్రేణి రెజ్లర్లు చేపట్టిన దీక్షలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత అగ్రశ్రేణి రెజ్లర్లు చేపట్టిన దీక్షలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో దీక్షకు మద్దతుగా వచ్చిన రాజకీయ పార్టీలను తిరస్కరించిన రెజ్లర్లు.. ఈసారి తమ మనసు మార్చుకున్నారు. తమ ఆందోళనకు మద్దతిచ్చే పార్టీలను ఆహ్వానించారు.
ఎవరైనా తమతో పాటు ధర్నాలో కూర్చోవచ్చని చెప్పారు. పార్టీలకు అతీతంగా తమకు మద్దతు తెలపవచ్చని అయితే తమ దీక్షకు మాత్రం ఏ పార్టీతో సంబంధం లేదని తెలిపారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విషయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బజ్ రంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేశ్ పోగాట్ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు సోమవారం కూడా తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పునియా మాట్లాడుతూ బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేసేంత వరకు తమ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.