ఆ మూడు విషయాల గురించే సెలెక్టర్ల డిస్కషన్?.. నేడు భారత జట్టు ప్రకటన?
ఇంగ్లాండ్‌తో మిగతా సిరీస్‌కు భారత జట్టు ఎంపికలో మూడు ప్రధాన అంశాలపై సెలెక్షన్ కమిటీ చర్చించినట్టు తెలుస్తోంది.
దిశ, స్పోర్ట్స్ : ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు 1-1తో సమవుజ్జీలుగా నిలిచాయి. ఈ నెల 15 నుంచి 19 వరకు రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల కోసం మాత్రమే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. మిగతా సిరీస్‌కు జట్టును ప్రకటించాల్సి ఉంది. కీలక ప్లేయర్లు అందుబాటులో ఉండటంపై సందిగ్ధం నెలకొనడంతో జట్టు ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే జట్టు ఎంపికపై కసరత్తు మొదలుపెట్టిన సెలెక్షన్ కమిటీ శుక్రవారం టీమ్‌ను వెల్లడించే అవకాశం ఉంది. అయితే, మూడు ప్రధాన అంశాలపై సెలెక్టర్లు డిస్కషన్ చేసినట్టు తెలుస్తోంది.
కోహ్లీ దూరం.. చాన్స్ ఎవరికి?
వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ మిగతా సిరీస్‌కు అందబాటులో ఉండడని తెలుస్తోంది. అతని భార్య అనుష్క శర్మ ప్రెగ్నెంట్ కావడంతో విరాట్ కుటుంబంతో గడపాలనుకుంటున్నట్టు సమాచారం. అయితే, అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనేది దానిపై సెలెక్టర్లు తీవ్రంగా చర్చించినట్టు తెలుస్తోంది. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన రజత్ పాటిదార్ పెద్దగా ఆకట్టుకోలేదు. రెండో టెస్టుతో అరంగేట్రం చేసిన అతను 32, 9 పరుగులు మాత్రమే చేశాడు. మరోసారి సెలెక్టర్లు అతనికి అవకాశం ఇస్తారో లేదో చూడాలి. రెండో టెస్టుతో తొలి సారి పిలుపు అందుకున్న సర్ఫరాజ్ ఖాన్‌నూ ఎంపిక చేయొచ్చు. మరోవైపు, సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను ఎంపిక చేయాలన్న డిమాండ్ ఉన్నా.. సెలెక్టర్లు యువకుల వైపే మొగ్గుచూపుతుండటంతో అతనికి చోటు దక్కడంపై అనుమానాలు ఉన్నాయి. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ నిరాశపరుస్తున్న నేపథ్యంలో పుజారా అవకాశాలనూ కొట్టిపారేయలేం.
జడేజా, కేఎల్ రాహుల్ తిరిగొస్తారా?
తొలి టెస్టులో రాణించిన స్టార్ ఆటగాళ్లు జడేజా, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యారు. వీరి లోటు రెండో టెస్టులో స్పష్టం కనిపించింది. వీరు మిగతా సిరీస్‌కు అందుబాటులో ఉంటారా?లేదా? అన్న చర్చ జరుగుతుంది. వీరిద్దరూ తిరిగి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాహుల్ పూర్తిగా కోలుకున్నాడని, జడేజాకు కాస్త సమయం పడుతుందని తెలుస్తోంది. రాజ్‌కోట్ టెస్టుకు ఇంకా వారం సమయం ఉంది. రాహుల్ తిరిగి రావడం ఖాయంగానే కనిపిస్తుంది. మరోవైపు, జడేజా పూర్తిగా కోలుకోకపోతే మూడో టెస్టుకు అందుబాటులో లేకపోయినా చివరి రెండు టెస్టులకు తిరిగొస్తాడని తెలుస్తోంది.
బుమ్రాకు విశ్రాంతి.. సిరాజ్‌కు చోటు?
మూడో టెస్టుకు స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినివ్వాలనే విషయంపై సెలెక్టర్లు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌తోపాటు టీ20 వరల్డ్ కప్‌కు జట్టును తాజాగా, గాయాలు లేకుండా ఉంచాలనే ఉద్దేశంతో సెలెక్షన్ కమిటీ ఆ దిశగా ఆలోచిస్తున్నది. ఒకవేళ బుమ్రాకు రెస్ట్ ఇస్తే.. రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న సిరాజ్ తిరిగి జట్టులోకి రావడం ఖాయమే. రెండు టెస్టుల్లో బౌలింగ్ దళాన్ని సమర్థవంతంగా నడిపించిన బుమ్రా గైర్హాజరు భారత్‌కు భారీ లోటే. షమీ కూడా అందుబాటులో లేడు. సిరాజ్‌తోపాటు ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్ పేసర్లుగా ఎంపికయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే పేస్ దళానికి సిరాజ్ నాయకత్వం వహించనున్నాడు. మరి, బుమ్రా స్థానాన్ని సిరాజ్ ఏ మేరకు భర్తీ చేస్తాడన్నది చూడాలి.