ఒలింపిక్స్‌లో తృటిలో పతకాలు కోల్పోయిన భారత అథ్లెట్లు వీళ్లే..

పారిస్ ఒలింపిక్స్‌లో కనీసం 10 పతకాలు లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ ఆరు పతకాలతో సరిపెట్టింది.

Update: 2024-08-12 19:41 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో కనీసం 10 పతకాలు లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ ఆరు పతకాలతో సరిపెట్టింది. దీంతో రెండెంకెల పతకాల కల ఈ సారి కూడా నెరవేరలేదు. 117 మంది అథ్లెట్లు 16 క్రీడాంశాల్లో పోటీపడితే.. పతకాలు వచ్చింది మాత్రం నాలుగు క్రీడల్లోనే. షూటింగ్, రెజ్లింగ్, హాకీ, అథ్లెటిక్స్‌లో పతకాలు దక్కాయి. అయితే, పలువురు అథ్లెట్లు తృటిలో పతకాలను కోల్పోవడం గమనార్హం. ఒకటో రెండో కాదు.. ఆరు పతకాలు అందినట్టే అంది చేజారాయి. ఆ పతకాలు వచ్చి ఉంటే భారత్ రెండెంకల పతకాల కల పారిస్‌లో నెరవేరేది.

మీరా.. ఒక్క కిలోతో

టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరబాయిచాను ఈ సారి కూడా పతకం తెస్తుందనుకున్నారు. కానీ, ఆమె ఒక్క కిలో తేడాతో వరుస ఒలింపిక్స్‌ల్లో పతకాన్ని గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. 49 కేజీల కేటగిరీలో పోటీపడిన ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో మొత్తం ఆమె 199 కేజీలు ఎత్తింది. అయితే, థాయిలాండ్ అథ్లెట్ సురద్బోచన ఖంబావో 200 కిలోల బరువులు ఎత్తి కాంస్యాన్ని దక్కించుకుంది. ఒక్క కిలో తక్కువగా ఎత్తిన మీరా నాలుగో స్థానంతో సరిపెట్టింది.

మను హ్యాట్రిక్ మెడల్ మిస్

ఈ విశ్వక్రీడల్లో షూటర్ మను బాకర్ రెండు పతకాలను సాధించిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్యం నెగ్గిన ఆమె.. అదే విభాగంలో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మరో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. అయితే, ఒకే ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ మెడల్ సాధించిన ఏకైక భారత్ అథ్లెట్‌గా నిలిచే ఘనతను మను తృటిలో కోల్పోయింది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లోనూ పాల్గొన్న ఆమె 4వ స్థానంతో సరిపెట్టి మూడో కాంస్య పతకానికి దూరమైంది. ఫైనల్‌లో 8 సిరీస్‌లు ముగిసే సరికి 28 స్కోరుతో మను.. హంగేరికి చెందిన మేజర్ వెరోనికాతో కలిసి సమంగా నిలిచింది. అయితే, షూటౌట్‌లో హంగేరి షూటర్ పైచేయి సాధించి బ్రాంజ్ మెడల్ గెలుచుకోగా.. మను 4వ స్థానంతో ముగించింది.

పతకాన్ని దూరం చేసిన ఒక్క పాయింట్

షూటింగ్‌లో ఒక్క పాయింట్ భారత్‌కు దక్కాల్సిన పతకాన్ని దూరం చేసింది. స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మహేశ్వరి చౌహాన్-అనంత్ జీత్ సింగ్ జోడీ తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. బ్రాంజ్ మెడల్ మ్యా్చ్‌లో భారత జంట 43-44 తేడాతో చైనాకు చెందిన జియాంగ్ యిటింగ్-జియాన్లిన్ జోడీ చేతిలో ఓడిపోయింది. మరో భారత షూటర్ అర్జున్ బబుతా కూడా తృటిలో పతకాన్ని కోల్పోయాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అతను 208.4 స్కోరుతో 4వ స్థానంలో నిలిచాడు. ఒక దశలో 146.9 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి పతక ఆశలు రేపిన అర్జున్ చివరికి 4వ స్థానంతో సరిపెట్టాడు.

లక్ష్యసేన్ చేజేతులా..

బ్యాడ్మింటన్‌లో ఈ సారి ఒక్క పతకమూ దక్కలేదు. అయితే, పతకం తెచ్చేందుకు లక్ష్యసేన్ గట్టిగానే పోరాడాడు. భారీ అంచనాలు ఉన్న సింధు, సాత్విక్-చిరాగ్ జోడీ అనూహ్యంగా ఓటమి పాలైన పరిస్థితుల్లో.. సంచలన ప్రదర్శనతో లక్ష్యసేన్ పతక ఆశలు రేపాడు. అయితే, సెమీస్‌లో అక్సెల్సెన్(డెన్మార్క్) చేతిలో ఓటమితో అతని ఫైనల్ దారులు మూసుకపోగా.. కాంస్యమైనా గెలుస్తాడని అంతా భావించారు. అయితే, లక్ష్యసేన్ గెలిచే మ్యాచ్‌ను చేజాతులా కోల్పోయాడు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో లీ జీ జియా(మలేషియా) 13-21, 21-16, 21-11 తేడాతో పరాజయం పొందాడు. తొలి గేమ్‌ నెగ్గిన అతను.. రెండో గేమ్‌లో ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయాడు.

100 గ్రాముల బరువుతో వినేశ్

భారత్‌కు బిగ్ షాక్ అంటే అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగట్ విషయంలోనే. మిగతా అథ్లెట్లు ఓడిపోయో, ఒత్తిడిని అధిగమించలేకనో పతకాన్ని చేజార్చుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, వినేశ్ పరిస్థితి వేరు. 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు చేరిన ఆమె దేశానికి స్వర్ణం అందించేలా కనిపించింది. కానీ, కనీసం రజతం కూడా దక్కలేదు. నిర్దిష్ట బరువు కంటే 100 గ్రాములు అదనంగా ఉండటమే కారణం. ఆమెపై నిర్వాహకులు అనర్హత వేటు వేయడంతో పతకం దూరమైంది. ఫైనల్‌లో పాల్గొని ఓడినా కనీసం రజతం దక్కేది.

Tags:    

Similar News