ఒలంపిక్స్ లక్ష్యంగా.. వారికోసం అన్వేషణ

దిశ, స్పోర్ట్స్: ఇండియాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు కొదువ లేదు. జాతీయ స్థాయిలో ఎంతో మంది పలు రకాల క్రీడల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. కానీ అంతర్జాతీయ వేదికలపై మాత్రం విఫలమవుతున్నారు. బాక్సింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కబడ్డీ వంటి క్రీడల్లో తప్ప మిగతా వాటిపై చాలా మంది దృష్టి పెట్టడం లేదు. దీంతో ఒలంపిక్స్ వంటి ఈవెంట్లలో భారతీయ క్రీడాకారులు చతికిలబడుతున్నారు. అంతర్జాతీయ స్థాయి శిక్షణ, అందుకు తగిన సౌకర్యలు అందుబాటులో లేకపోవడం కూడా క్రీడాకారులు తమ […]

Update: 2020-11-07 09:33 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండియాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు కొదువ లేదు. జాతీయ స్థాయిలో ఎంతో మంది పలు రకాల క్రీడల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. కానీ అంతర్జాతీయ వేదికలపై మాత్రం విఫలమవుతున్నారు. బాక్సింగ్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కబడ్డీ వంటి క్రీడల్లో తప్ప మిగతా వాటిపై చాలా మంది దృష్టి పెట్టడం లేదు. దీంతో ఒలంపిక్స్ వంటి ఈవెంట్లలో భారతీయ క్రీడాకారులు చతికిలబడుతున్నారు. అంతర్జాతీయ స్థాయి శిక్షణ, అందుకు తగిన సౌకర్యలు అందుబాటులో లేకపోవడం కూడా క్రీడాకారులు తమ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి అడ్డంకిగా మారింది. ఈ విషయాలపై పలు క్రీడా ఆసోసియేషన్లు కేంద్రం దృష్టికి తీసుకొని వెళ్లారు. దీంతో ఖేలో ఇండియా పేరుతో ప్రారంభించిన కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని కేంద్రం భావిస్తున్నది. రాబోయే పారీస్ 2024, లాస్ఏంజెలెస్ 2028 ఒలంపిక్స్ లక్ష్యంగా ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయడానికి వ్యూహం రచిస్తున్నది.

ఖేలో ఇండియా సెంటర్లు బలోపేతం..

2028లో లాస్ఏంజెలెస్‌లో జరిగే ఒలంపిక్స్‌లో ఇండియా టాప్-10 పతకాల దేశాల సరసన ఉండాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా క్రీడా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు. ప్రతీ రాష్ట్రంలో ఖేలో ఇండియా స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ పేరుతో అత్యాధునికి సౌకర్యలు అందుబాటులోకి తెస్తున్నారు. దేశంలోని ప్రతీ జిల్లా కేంద్రంలో ఒక ఖేలో ఇండియా సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లు తమ జిల్లా పరిధిలో ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేస్తాయి. 10 నుంచి 15 ఏళ్ల వయసుగల క్రీడాకారులను గుర్తించి వారికి ఉత్తమ శిక్షణ ఇస్తారు. వీరిలో అత్యుత్తమ క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలోని ఖేలో ఇండియా స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌కు పంపించి అక్కడ అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇస్తారు. అలా రాబోయే 7 ఏళ్లలో ఒలంపిక్స్ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ కేవలం ప్రతిభే కొలమానంగా తీసుకోవాలని ఎలాంటి వివక్షలు చూపకూడదని ఇప్పటికే కేంద్రం కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.

భారీగా నిధులు..

ఇండియా నుంచి అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. 2028 ఒలంపిక్స్ లక్ష్యంగా ఈ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ప్రతీ రాష్ట్ర ఖేలో ఇండియా స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు నిధులు అందిస్తున్నారు. గతంలో పలు రాష్ట్ర సెంటర్లకు కోట్లాది రూపాయలు వెచ్చించారు. తాజాగా మరో ఆరు సెంటర్లకు రూ. 67.32 కోట్లు విడుదల చేశారు. అస్సాంకు 7.96 కోట్లు, మేఘాలయకు రూ. 8.39 కోట్లు, డామన్, డయ్యూకు 8.05 కోట్లు, మహారాష్ట్ర పూణేలోని శ్రీ శివ్‌చత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు రూ.16 కోట్లు, గ్యాంగ్‌టక్‌లోని పల్జోర్ స్టేడియంకు రూ.7.91 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో బాక్సింగ్, అథ్లెటిక్స్ వంటి క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు.

Tags:    

Similar News