Balochistan: మరణం.. రక్తం.. ఉన్మాదం.. తిరుగుబాటు.. అసలు పాకిస్థాన్‌లో ఏం జరుగుతోంది?
దిశ, డైనమిక్ బ్యూరో: పొరుగుదేశం పాకిస్తాన్ సమీప భవిష్యత్తులో రెండు దేశాలుగా విడిపోనుందా?

-ఇప్పటికే తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో దాయాది దేశం
-తాజాగా బలూచ్ ఆర్మీ భారీ చర్య
-ఏకంగా ప్రయాణికుల రైలు హైజాక్
-1947లో మొదలైన బలూచిస్తాన్ స్వాతంత్య్ర పోరాటం
-అప్పటినుంచీ ఎడతెగని సమరం
దిశ, డైనమిక్ బ్యూరో: పొరుగుదేశం పాకిస్తాన్ సమీప భవిష్యత్తులో రెండు దేశాలుగా విడిపోనుందా? ఇప్పటికే తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆ దేశాన్ని తాజాగా జరిగిన రైలు హైజాక్ కుదిపేస్తున్నదా? 1947లో ఇండియా, పాకిస్తాన్‌లు విడిపోయినప్పటి నుంచీ ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న బలూచీవాసులు చివరకు దేశాన్ని చీల్చేదాకా శాంతించరా? ఇప్పటికే బలూచ్ ప్రాంతంలోని సింహభాగం రెబల్ ఆర్మీ చేతుల్లోనే ఉందా? గతంలో ఐదుమార్లు భారీ స్థాయిలో తిరుగుబాటు చేసిన బలూచీ దళాలు.. అంతిమ సమరానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయా? అంటే నిజమేనంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. పట్టపగలే ముందు బాంబులతో పట్టాలు పేల్చి, తర్వాత ప్రయాణికుల ట్రైన్‌ను హైజాక్ చేయడం చూస్తుంటే అలా భావించకతప్పడం లేదంటున్నారు. ప్రభుత్వం, పాక్ సైన్యం అంతర్గత సంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో దాడులను తీవ్రస్థాయిలో కొనసాగించాలని బీఎల్ఏ భావించివుంటుందంటున్నారు.
సుమారు 400 మంది ప్రయాణికులున్న ట్రైన్‌ను బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)కి చెందిన గెరిల్లాలు మంగళవారం హైజాక్ చేసిన విషయం తెలసిందే. జైళ్లలోని తమ నేతలను, కమాండర్లను విడుదల చేయకుంటే బందీలను చంపేస్తామనే డిమాండుతో వారు ఈ చర్యకు పూనుకున్నారు. దరిమిలా, పాక్ సైన్యం జోక్యం చేసుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. ఈ చర్యలో 346మంది బందీలను విడిపించామని, 33మంది టెర్రరిస్టులను హతమార్చామని సైనికవర్గాలు బుధవారం తెలిపాయి. నలుగురు సైనికులు చనిపోయారని వివరించాయి. కాగా, 30మంది సైనికులను తాము చంపివేసినట్టు బీఎల్ఏ తెలిపింది.
అసలు ఎక్కడిదీ బలూచిస్తాన్? ఎందుకు ప్రత్యేకదేశం?
విస్తీర్ణం పరంగా చూసినట్లయితే బెలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ భూభాగంలో 44శాతం ఉంటుంది. అంటే దాదాపు సగం అన్నమాట. ఈ ప్రాంతంలో సహజవాయువు, బొగ్గు, ఖనిజ సంపద కూడా పుష్కలంగా ఉన్నాయి. చైనా అభివ్రుద్ధి చేసిన గద్వార్ ఓడరేవు ఈ ప్రాంతంలోనే ఉంది. అయితే చైనా చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంత వాసులకు పోయిందేమీ లేదు. పాకిస్తాన్ లోని పంజాబ్ వంటి ఇతర ప్రాంతాల వాళ్లే లబ్ధి పొందారు. బెలూచిస్తాన్ వాసులపై పాకిస్తాన్ సైన్యం చేసిన అరాచకాలకు కొదవేం లేదు. అందుకే బెలూచిస్తాన్ వాసులు కూడా వెనక్కి తగ్గకుండా గతంలో ఐదుమార్లు భారీస్థాయిలో పోరాటాన్ని చేశారు. 2000వ సంవత్సరం నుంచి బెలూచిస్తాన్ మలిదశ పోరాటం షురూ అయ్యిందని చెప్పవచ్చు.
ఒకవేళ పరిస్థితులన్నీ అనుకూలించినట్లయితే బయటి నుంచి సహాయం అందినట్లయితే బలూచిస్తాన్ స్వాతంత్య్రం సంపాదించుకుంటే అది పాకిస్తాన్ మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే బలూచిస్తాన్ విడిపోయినట్లయితే విస్తీర్ణపరంగా అతిపెద్ద భూభాగాన్ని మాత్రమే కాదు.. సహజ వనరులపై ఆధిపత్యాన్ని కూడా పాకిస్తాన్ కోల్పోతుంది. అదే సమయంలో పీఓకే తిరిగి భారత్ లో అంతర్భాగం అయ్యే ఛాన్స్ ఉంటుంది. పాకిస్తాన్ తీరప్రాంతం కూడా తగ్గుతుంది. అప్పుడు ప్రపంచ పటంలో పాకిస్తాన్ మ్యాప్ చిన్నగా మారుతుంది. ప్రపంచ రాజకీయాల్లో పాక్ పాత్ర అంతకంటే చిన్నగా మారుతుంది. అంతర్గత కుమ్ములాటలు, టెర్రరిస్టుల దెబ్బతో అసలు పాకిస్తానే అనే దేశమే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ లోని పష్తూన్ తెగ కూడా అదనుకోసం ఎదురు చూస్తోంది.
బలూచి ప్రజలు స్వేఛ్చను ఎందుకు కోరుకుంటున్నారు?
పాకిస్తాన్ లోని అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ ఎప్పుడూ స్వతంత్రంగా ఉండాలనే కోరుకుంది. రష్యా వంటి విస్తరణ శక్తుల నుంచి తమ వలస ప్రయోజనాలను కాపాడుకునేందుకు బ్రిటీష్ వారు ఈ ప్రాంతాన్ని ఒక స్ధావంగా ఉపయోగించుకున్నారు. కానీ ప్రతిఘటనను ఎదుర్కున్నందున బ్రిటీష్ వారు 19వ శాతాబ్దంతో జోక్యం చేసుకునే విధానాన్ని అవలంభించారని బెలూచిస్తాన్ విశ్వవిద్యాలయం పరిశోధనా పత్రిక తెలిపింది. కానీ భారతదేశ విభజన తర్వాత బెలూచిస్తాన్ నాయకులు తమతో విలీనం చేయాలని పాకిస్తాన్ ఒత్తిడి చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇది అక్కడి స్థానికులకు ఏమాత్రం నచ్చలేదు. స్వతంత్ర బెలూచిస్తాన్ కలను సాకారం చేసుకునేందుకు ఉద్యమాన్ని షురూ చేసింది.
జిన్నా చేసిన మోసం..
బెలూచిస్తాన్ ను భారతదేశం, పాకిస్తాన్ లతోపాటు స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించారు. ఈ ప్రాంతంలో నాలుగు పూర్వ రాచరిక రాష్ట్రాలు ఉన్నాయి. ఖరన్, మకరన్, లాస్ బేలా, కలాట్. విభజనకు ముందు, రాచరిక రాష్ట్రాలకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. భారతదేశంలో లేదా పాకిస్తాన్‌లో చేరడం లేదా స్వతంత్రంగా ఉండటం. ఖాన్ మీర్ అహ్మద్ యార్ ఖాన్, ఖాన్ ఆఫ్ కలాత్ , చివరి చివరి ఆప్షన్ ఎంచుకున్నారు. మొదటి మూడు పాకిస్తాన్‌తో వెళ్ళాయి.చరిత్రకారుడు దుష్కా హెచ్ సయ్యద్ తెలిపిన వివరాల ప్రకారం.. కలాత్ భారత ఉపఖండం అంచున ఉండటం వల్ల కాశ్మీర్ లేదా హైదరాబాద్‌కు ఉన్నంత ప్రాముఖ్యత ఎప్పుడూ లేదు.
అందుకే విభజన సమయంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య రాచరిక రాష్ట్రాల విలీన పోటీలో ఇది పెద్దగా కనిపించలేదు.జిన్నా కూడా మొదట్లో కలత్ స్వాతంత్ర్యాన్ని అంగీకరించాడు. ఖాన్ జిన్నాను నమ్మాడు. దీంతో కలత్ ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. కానీ విస్తరణవాద పాలనల ముప్పు కారణంగా కలత్ స్వతంత్రంగా ఉండటానికి అనుమతించడం చాలా ప్రమాదకరమని బ్రిటిష్ వారు భయపడ్డారు. కలత్‌ను తమ నియంత్రణలోకి తీసుకురావాలని పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చింది. ఆ సయమంలోనే జిన్నా యూ-టర్న్ తీసుకున్నాడు. అక్టోబర్ 1947లో, పాకిస్తాన్‌లో విలీనాన్ని వేగవంతం చేయాలని జిన్నా ఖాన్‌కు సలహా ఇచ్చాడు. దానికి అతను నిరాకరించాడు.
మార్చి 18, 1948న, జిన్నా ఖరన్, మకరన్, లాస్ బేలా విలీనాన్ని ప్రకటించాడు. దీని వలన కలాత్ భూభాగం పూర్తిగా నిర్బంధించి.. దాని భూభాగంలో సగం కంటే తక్కువ మాత్రమే మిగిలిపోయింది. ఖాన్ భారత ఆధిపత్యంలో చేరాలనుకుంటున్నాడనే తప్పుడు వార్తలు పాకిస్తాన్‌ను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో బలూచిస్తాన్ కు అంతర్జాతీయ దేశాల నుంచి మద్దతు లేకుపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్ లో చేరాల్సి వచ్చింది.
పాకిస్తాన్ ఆర్థికంగా మరింత దిగజారుతుండటంతో పాటు అంతర్జాతీయ పరిస్థితులు కూడా కలిసివస్తే బలూచిస్తాన్ విముక్తి సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే పాకిస్తాన్ అనే దేశం మనుగడ అసాధ్యమేనని విశ్లేషకులు సైతం అంటున్నారు. మరోవైపు, బెలూచిస్తాన్ విడిపోయే పరిస్థితిని తప్పించడం కోసం చైనా ముందు మోకరిల్లయినా సరే సాటి ఇస్లామిక్ దేశాలైన అరబ్ దేశాలను బతిమాలుకుని అయినా సరే తనకు అండగా నిలవాలని పాకిస్తాన్ కోరే అవకాశమూ లేకపోలేదు. ఇక తప్పదు అనుకుంటే బలూచిస్తాన్ కు అటానమస్ హోదా ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం కూడా చేయవచ్చు.