
జోలపాట యాదిలేదా..
గోరుముద్దలు గుర్తు లేవా?
బరువు మోసి బతుకునిచ్చిన..
భుజాలకెత్తి బతుకు చూపిన..
గుర్తులసలే గుర్తులేవా?
వేలు పట్టి నడక నేర్పితే..
చెమటకోర్చి దారిచూపితే
..పరుగు నేర్చి పారిపోతావా?
కన్నోళ్లెందుకు బరువయ్యారు..
కన్నీళ్లెందుకు కరువయ్యాయి..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా తాటిపాక గ్రామం.. కాకి అదే పనిగా అరిచి విసిగిస్తుండటంతో ఓ షాపు యజమాని దాన్ని పట్టుకుని కట్టేశాడు. అది గమనించిన మిగతా కాకులు ఒక్కసారిగా అక్కడికొచ్చి గోలగోల చేశాయి. అతడిపై దాడి చేసినంత పని చేసి ఆ కాకిని విడిపించుకుని వెళ్లిపోయాయి. అలాగే తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో.. కోతులు ఓ ఇంట్లోకి దూరడంతో లోపలున్నవారు భయంతో బయటకు పరుగుతీశారు. అవి కాస్తా లోపలి నుంచి గడియపెట్టుకుని బయటకు రాలేక అరవడం మొదలెట్టాయి. అంతే.. ఆ ఊర్లో ఉన్న కోతులన్నీ ఆ ఇంటిమీదకు వచ్చి చేరాయి. చుట్టుపక్కలవారిని ఇంటి వద్దకు రానీయకుండా చాలాసేపు రచ్చ చేశాయి. ఆఖరికి గ్రామస్తులు అతికష్టం మీద కిటికీని తొలగించగా బయటకు వచ్చి గుంపులో కలిసి పరుగుతీశాయి. ఈ మధ్యే జరిగిన ఈ రెండు ఘటనల్లో కాకులు, కోతులు ఆపత్కాలంలో తమకుతాము తోడుగా నిలిచాయి. తామంతా ఒక్కటని చాటుకున్నాయి. మరి కాకిగోల.. కోతిచేష్టలంటూ వాటిని నిందించే మనిషి ఏం చేస్తున్నాడు..? కన్న తల్లిదండ్రులను డబ్బు ఇచ్చే యంత్రాలుగానే చూస్తున్నాడు. పాలు ఇవ్వని ఆవును కబేళాకి తరిమేసినట్టు.. డబ్బు లేకపోతే తల్లిదండ్రులను నడిరోడ్డుపై వదిలేసి వెళ్తున్నారు. పట్టెడన్నం పెట్టించండని ఓ తల్లి వేడుకోలు అధికారులను సైతం కన్నీళ్లు పెట్టించింది. సమాజం అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్నా.. ఇంకా ఇలాంటి సంఘటనలు మనల్ని వేలెత్తి ప్రశ్నిస్తున్నానే ఉన్నాయి.. ఓ మనిషీ నువ్వెక్కడ? నీలో మానవత్వం అడుగంటిపోయిందా? లేక డబ్బు పొరల్లో మాయమైందా? కన్నబిడ్డల వేధింపులకు బలవుతున్న తల్లిదండ్రులపై ‘దిశ’ ప్రత్యేక కథనం. -రవి రామిడి
16 ఎకరాలు ఇచ్చినా.. ఇంట్లోంచి గెంటేశారు!
నలుగురు కొడుకులు ఉన్నా అన్నం పెట్టే దిక్కులేరని, పెన్షన్ కోసం ఇంటి నుంచి గెంటేశారని 89 ఏండ్ల వయస్సున్న పిల్లల నారాయణ రోడ్డెక్కాడు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన పిల్లల నారాయణ (89) ప్రజావాణిలో కలెక్టర్ ముందు తన గోడు వెళ్లబోసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. కొడుకులకు 16 ఎకరాల ఆస్తి పంచి ఇచ్చినా తనను పట్టించుకోవడం లేదన్నాడు. నారాయణ విశ్రాంత ఉపాధ్యాయుడు. ఆయనకి నలుగురు కుమారులు వీరిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు.. ఒకరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. మరొకరు గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే నారాయణ తన 16 ఎకరాల భూమిని అందరికీ సమానంగా పంచి ఇచ్చి, తనకు వచ్చే పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఉద్యోగాలు చేసుకుంటున్న ముగ్గురు కొడుకులు పింఛన్ డబ్బుల కోసం వేధిస్తూ ఇంటికి తాళం వేసి తనను బయటకు గెంటేశారని నారాయణ ప్రజావాణిలో గోడు వెళ్లబోసుకున్నాడు. నడవడం చేతగాక చక్రాల కుర్చీలో ఉంటూ జీవనం సాగిస్తున్నానని.. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానని, కుమారులు ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను వేడుకున్నాడు.
కొడుకులు పట్టించుకుంటలేరు..
ఆలనాపాలనా చూడాల్సిన కొడుకులు పట్టించుకోకపోవడంతో ఆ వృద్ధ దంపతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌కు చెందిన దేశి కొమురయ్య, శివలక్ష్మిలకు సత్యనారాయణ, కాశీనాథం ఇద్దరు కుమారులు. ఒకరు హైదరాబాద్‌లో నివాసం ఉంటుండగా మరొకరు వెల్దుర్తిలోనే వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఇద్దరూ తల్లిదండ్రుల బాగోగులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇవాళ ఆ వృద్ధ దంపతులు ప్రజావాణిలో మెదక్ జిల్లా కలెక్టర్ వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. ఇద్దరు కొడుకులు తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ‘మాకు పట్టెడన్నం పెట్టించండి సారూ’.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై..
ఒకప్పుడు కుటుంబం అంటే అమ్మనాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న, పిన్ని, బాబాయి, నానమ్మ, తాతయ్యతోపాటు ఇంటినిండా పిల్లలతో సందడిగా ఉండేది. కష్టసుఖాల్లోనూ కలిసే ఉండేవారు. అయితే కాలక్రమంలో చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయాయి. వ్యక్తిగత అవసరాలు, మారిన పరిస్థితుల కారణంగా చెట్టుకొకరు పుట్టకొకరుగా బతుకుతున్న పరిస్థితి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు గ్రామాల్లో ఉండిపోతే.. కొడుకులు, బిడ్డలు చదువులనో ఉద్యోగాలనో క్రమంగా పట్టణాల్లోకి వచ్చేశారు. పెద్దలు ఉద్యోగ, వ్యాపారాల్లో మునిగిపోతే, పిల్లలు మోయలేని బ్యాగులతో, వయసుకు మించిన చదువులతో కుస్తీ పడుతున్నారు. ఇలాంటి బిజీ జీవనంలో ఏ పండుగలకో, పబ్బాలకో గాని అంతా ఒక్కదగ్గర కలవడం కుదరడం లేదు. సమయం దొరికినా ఫ్యామిలీతో ఏ సినిమాకో, షికారుకో వెళ్తున్నారే తప్పితే మరో ఊసు లేదు. దీంతో సహజంగానే కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు సన్నగిల్లాయి. క్రమంగా ‘మనం’ అన్న మాట మాయమై ‘నేను, నా’ అన్న స్వార్థం పెరుగుతూ పోతున్నది.
చట్టాలు ఉన్నా.. తప్పని మనోవేదన
అరవైఏళ్లు దాటిన వయో వృద్ధుల రక్షణ కోసం సీనియర్ సిటిజన్ యాక్ట్ -2007 అండగా నిలుస్తున్నది. ఈ చట్టం ప్రకారం తమ పిల్లలు(కొడుకు, కూతురు, మనవడు, మనవరాలు) తమ పోషణను పట్టించుకోకపోతే ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా పరిహారాన్ని పొందవచ్చు. అంతేకాదు చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం తాము పిల్లలకు రాసి ఇచ్చిన ఆస్తులను సైతం తిరిగి పొందే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ చట్టం-2011 కూడా వృద్ధులకు రక్షణ కల్పిస్తోంది. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా గిఫ్ట్‌గా రాసిచ్చిన ఆస్తులు మాత్రమే కాక రిజిస్ట్రేషన్ చేసినవాటిని కూడా వెనక్కి తీసుకునేలా చట్టంలో పొందుపరిచారు. అయితే చట్టాలు అండగా నిలుస్తున్నప్పటికీ సీనియర్ సిటిజన్లకు చాలావరకు వృద్ధాశ్రమాలే దిక్కవుతున్నాయి. కళ్లముందు తమ మనవళ్లు, మనవరాళ్లను చూసుకుంటూ నిశ్చింతగా గడపాల్సిన సమయంలో ఎంతోమంది తీవ్ర మనోవేదనతో ఒంటరిగానే జీవితాన్ని ముగిస్తున్నారు.
పట్టించుకోకుంటే.. ఆస్తి రివర్స్
ఆస్తిని పంచుకున్న పిల్లలు తమను పట్టించుకోకపోవడంతో వృద్ధులు న్యాయం కోసం అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫిర్యాదులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే మెదక్ జిల్లాలో కుమారుడికి రాసిచ్చిన భూమిని తండ్రి తిరిగి పొందిన ఘటన ఇటీవల సంచలనంగా మారింది. రేగోడ్ మండల కేంద్రానికి చెందిన ఎన్కతల సంగారెడ్డి(77) కొడుకు తన బాగోగులు చూడటంలేదంటూ కలెక్టర్ ఎదుట తన గోడును వెల్లబోసుకున్నాడు. కుమారుడి పేరు మీద ఉన్న తన భూమిని తిరిగి ఇప్పించాలని కోరుతూ ఫిర్యాదు చేశాడు. విచారణ చేసిన అధికారులు కలెక్టర్ ఆదేశాలతో అతడి కొడుకు పేరు మీద ఉన్న 1.03 ఎకరాల భూమిని తండ్రి పేరిట పట్టా చేసి ధ్రువీకరణ పత్రాలను సంగారెడ్డికి అందజేశారు.
రెండేళ్లలో 3308 ఫిర్యాదులు
ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో 3,308కు పైగా ఫిర్యాదులు దాఖలయ్యాయి. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఓలతో ట్రిబ్యునల్ ఏర్పాటుచేసింది. వృద్ధులపై కుటుంబ సభ్యుల వేధింపులను సీరియస్ గా తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను ప్రయోజకులను చేస్తే.. వృద్ధాప్యంలో వారి ఆలనాపాలన వదిలి రోడ్డున పడేస్తున్నారు. మరికొందరు ఆస్తి తమ పేరిట రాయాలని వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే తోడబుట్టినవారిని మోసం చేయడంతోపాటు హత్యలకూ వెనుకాడటంలేదు. మరోవైపు తమను ఇంతలా రాచిరంపాన పెడుతున్న పిల్లలపై చర్యలకు తల్లిదండ్రులు ఒప్పుకోవడంలేదు. మరికొంతమంది తమ పిల్లలకు చెడ్డపేరు రావొద్దని ఫిర్యాదులకు వెనుకంజ వేస్తున్నా.. వేధింపులు భరించలేనంతగా మారినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు, ట్రిబ్యునళ్లను ఆశ్రయిస్తున్నారు.
ట్రిబ్యునల్-అప్పిలేట్ల ఏర్పాటు
వృద్ధుల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఓల ఆధ్వర్యంలో ట్రిబ్యునళ్లు, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అప్పీలేట్ అధికారులను నియమించింది. వృద్ధుల సంరక్షణను నిర్ధారించడమే కాకుండా, చట్టవిరుద్ధమైన ఆస్తి బదిలీలను రద్దు చేయడం మరియు పిల్లలు ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించడం కూడా ఈ ట్రిబ్యునళ్ల లక్ష్యం. సీనియర్ సిటిజన్లకు సహాయం చేయడానికి, సంక్షేమ శాఖ tgseniorcitizens.cgg.gov.inను కూడా ప్రారంభించింది. ఇక్కడ ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవా కేంద్రాలలో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి శుక్రవారం, సంక్షేమ అధికారులు వివాదాలను పరిష్కరించడానికి కౌన్సెలింగ్ సెషన్‌లను నిర్వహిస్తున్నారు. సమస్యలు కొనసాగితే, అధికారికంగా కేసు నమోదు చేస్తారు. ప్రస్తుతం కరీంనగర్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులను నివేదిస్తుండడం విశేషం.
జీవన ప్రమాణాల్లో చివరి స్థానం
వృద్ధుల జీవన నాణ్యత సూచికలో తెలంగాణ చివరి స్థానంలో నిలిచింది. వృద్ధుల జనాభా 50లక్షలు ఉన్న రాష్ట్రాలు దేశంలో 10 ఉంటే అందులో జీవన ప్రమాణాల్లో మన రాష్ట్రం అట్టడుగున ఉన్నది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ డాక్టర్ బిబెక్ దేబ్రాయ్ వృద్ధుల జీవన నాణ్యత సూచికను విడుదల చేశారు. ఈఏసీ-పీఎం అభ్యర్థన మేరకు ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ ఈ సూచికను రూపొందించింది. ఇది వృద్ధులు తరచుగా ప్రస్తావించని సమస్యలపై దృష్టి పెడుతుంది. ఈ సూచి ప్రకారం.. 10వ స్థానంలో ఉన్న తెలంగాణ 38.19 స్కోరును సాధించగా, రాజస్థాన్ 54.61 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ నివేదిక ఆయా రాష్ట్రాల్లో వృద్ధుల జీవన ప్రమాణాల స్థాయులను లెక్కిస్తుంది.
సమాజం.. పట్టాలు తప్పింది
రైలు పట్టాలపై వెళ్తేనే లోపల ఉన్నవారికి, బయట ఉన్న జనాలకు సేఫ్టీ. పట్టాలు తప్పిందో అందరికీ ప్రమాదమే. అలాగే సమాజానికి కూడా పట్టాలు ఉంటాయి. అవే సామాజిక విలువలు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో పెద్దలు ఇతహాస కథలు, చందమామ, బాలమిత్ర, అక్బర్-బీర్బల్ కథలు ఇలా ఇంకా అనేక మార్గాల ద్వారా భాషతోపాటే బయట ఎలా మెలగాలో నేర్పించేవారు. దీన్నే సంస్కృతి స్వీకరణ అంటారు. కానీ కాలక్రమంలో అది కనుమరుగైపోయింది. దీంతోపాటు నేడు విద్యావ్యవస్థ అంటే ఆరో తరగతి నుంచే పిల్లల్ని మార్కులు, ర్యాంకుల వెంట పరుగెత్తించడం, ఐఐటీ సీటు సంపాదించడం అన్నట్టుగా మారిపోయింది. అలాగే మనిషి మెదడు లోపలికి ఇన్ పుట్ ఏదైతే వెళ్తుందో, ఔట్ పుట్ కూడా అదే వస్తుంది. ఇవాళ స్మార్ట్ ఫోన్లు, టీవీల కాలంలో సినిమాలు, వెబ్ సిరీస్‌ల ద్వారా పిల్లలతోపాటు పెద్దల బుర్రల్లోకి జుగుప్సాకరమైన అంశాలను ఎక్కిస్తున్నాం. దీంతో చాలామంది డబ్బుంటే చాలు ఏదైనా చెయ్యొచ్చనే భావనకు వచ్చేస్తున్నారు. మొత్తంగా సామాజిక విలువలు క్షీణించి నేటి సమాజం పట్టాలు తప్పింది.
- వాసిరెడ్డి అమర్‌నాథ్, విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు
దయనీయస్థితిలో అవ్వ
కొడుకులు ఇంట్లోనుంచి గెంటేయడంతో ఓ వృద్ధురాలు రోడ్డుపాలైన ఘటన గుంటూరు జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. శంకర్ విలాస్ సెంటర్ డివైడర్ వద్ద పాలు కాచుకుంటుండగా.. ఓ బాటసారి ఆమెతో మాట్లాడారు. ఇక్కడ ఎందుకు ఉన్నావమ్మా అని అడగ్గా.. పిల్లలు ఇంట్లోనుంచి గెంటేశారని ఇక్కడే కొద్దిరోజులనుంచి ఉంటున్నానని చెప్పింది. ఓ షాపు అతను పాలు ఇస్తే ఓ గిన్నెలో వేడిచేసుకుంటున్నానని చెప్పడంతో ఆ బాటసారి కలత చెందుతూ వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఆమె పేరు, ఇతర వివరాలు ఏమీ ఇవ్వకపోయినా.. ఆమె పరిస్థితి చూసి నెటిజన్లందరూ బాధపడుతూ మెసేజులు పెడుతున్నారు.