Disha Special Edition: హోలీ.. సంతోషాల కేళి!
విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశపుడిని చంపడం వల్ల హోలీ పండగ వచ్చిందని అంటారు.

విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశపుడిని చంపడం వల్ల హోలీ పండగ వచ్చిందని అంటారు. అంతటి విశిష్టత ఉన్న ఈ పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా జరుపుకుంటారు. హోలీ అంటే ఉల్లాసం.. ఉత్సాహం. పిల్లలకు.. పెద్దలకు అందరికీ నచ్చుతుంది. ఆద్యంతం కలర్‌ఫుల్‌గా సాగే హోలీ తమ జీవితాలను మరింత రంగులమయంగా మారుస్తుందనే నమ్మకం అందరిదీ.
మోదుగపూల హోలీ..
వసంతం వచ్చిందంటే చెట్ల ఆకులన్నీ రాలిపోయి మోడువారినట్టు కనిపిస్తాయి. ఆకురాలుతున్న వేళ మోదుగ చెట్లు మాత్రం పూలతో విరబూసుకుంటాయి. గుత్తులు గుత్తులుగా వేలాడుతూ గుభాలిస్తాయి. ఒకప్పుడు హోలీ అంటే ఇవే మరి. పండగ రెండు మూడు రోజులు ఉందనగా మోదుగపూలు కోసుకొచ్చేవాళ్లు. పూలన్నింటినీ తెంపి పొయ్యిమీద ఉడకబెట్టేవాళ్లు. పూల నుంచి రంగు వేరై నీళ్లన్నీ ఎర్రగా మారిపోతాయి. అదే హోలీ పండగ రంగు. దానిని డబ్బాల్లో పోసుకొని హోలీనాడు చల్లుకొని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేవాళ్లు. ఇంకా గులాల్ చల్లుకొని హోలీ ఆడేవారు.
ఇప్పుడంతా కోడిగుడ్లే
మోదుగపూల సోయగంతో మొదలైన హోలీ ఇప్పుడు కోడిగుడ్లతో కొట్టుకునే దాక వచ్చింది. గులాల్ లేవు ఏం లేవు. హోలీరోజు ఏ వాడ చూసినా.. ఏ గల్లీ చూసినా కోడిగుడ్ల కంపే. ఎక్కడ్నుంచి వచ్చిందో ఏమెగానీ దీన్నొక కల్చర్‌గా ఫీలవుతోంది యువత. గుడ్డు కొట్టకపోతే హోలీయే కాదన్నట్టు ఫీలవుతున్నారు. ఇంకా.. సాంపి కలర్ చల్లుకోవడం.. వేస్ట్ ఆయిల్ పూసుకోవడం.. మురికి కుంటలో తోసుకోవడం.. పెండ రుద్దుకోవడం ప్యాషనైపోయింది. అంతా అయిపోయే సరికి ఒక్కరి ఒంటిమీద కూడా అంగీ ప్యాంటులుండవు. ఇదేం పద్ధతిరా అని ఎవరైనా అడిగితే ‘ఇట్లుంటది మనతోని ముచ్చట’ అని డైలాగులు మీదికెల్లి.
చితా భస్మంతో..
వారణాసిలో హోలీ వింతగా ఉంటుంది. హరిశ్చంద్ర ఘాట్‌లో మహా స్మశాన్ హారతితో హోలీ సెలబ్రేట్ చేస్తారు. దీనిని మసాన్‌కీ హోలీ అంటారు. చితి కాలిన తర్వాత వచ్చిన బూడిదను ఒకరిమీద ఒకరు చల్లుకొని హోలీ సెలబ్రేషన్స్ జరుపుతారు. ఆ సమయంలో మణికర్ణిక ఘాట్ హరిహర మహాదేవ్ స్మరణతో మార్మోగుతుంది. చితి బూడిదతో హోలీ ఆడటం శివుడికి ఆనందం.. భక్తులకు ముక్తికరం అని వాళ్ల నమ్మకం. వారణాసి ప్రజలకు మసాన్ హోలీ సాంస్కృతిక గుర్తింపుతో పాటు ఆధ్యాత్మిక స్వభావాన్ని చూపిస్తుంది. చితి బూడిదను చల్లుకున్న తర్వాతే కాశీలో హోలీ మొదలువుతంది.
లాఠ్ మార్ హోలీ
యూపీలోని బార్సానాలో హోలీ పండుగ రోజున బావ.. మరిది వరసయ్యే వాళ్లను లాఠీతో కొడతారట పెండ్లయిన ఆడవాళ్లు. శ్రీకృష్ణుడు రాధ కోసం బార్సానా వెళ్లేవాడట. రాధ స్నేహితులను ఆటపట్టిస్తూ కొంటె పనులు చేసేవాడట. ఒకసారి గ్రామంలోని మహిళలు సరదాగా కర్రలతో కొడుతూ తరిమేశారట.. ఆ సంఘటనకు గుర్తింపుగా లాఠ్ మార్ హోలీ వచ్చిందని చెప్తుంటారు. కొడుకులను బలంగా కొట్టడానికి అత్తలు నెల రోజుల్నుంచే కోడళ్లకు బలిష్టమైన ఆహారం పెడతారట. లాఠ్ మార్ హోలీ లెక్కనే కరోర్ మార్ హోలీ జరుపుతారు హర్యానాలో. వదిన మరదళ్లు.. బావ బావమరుదులను కర్రలతో కొడతారు.
గాడిదపై అల్లుడి ఊరేగింపు
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా విడా గ్రామం హోలీకి చాలా ప్రత్యేకమైనది. కొత్త అల్లుడిని గాడిదపై కూర్చోబెట్టి హోలీ రోజున ఊరేగించే సంప్రదాయం ఉందక్కడ. ఆ ఊరిలో ఒకప్పుడు దేశ్‌ముఖ్‌లు ఉండేవాళ్లు. హోలీ రోజున అల్లుడు.. కూతురు ఇంటికి వచ్చారట. ఐతే.. హోలీ ఆడటానికి అల్లుడు నిరాకరించాడట. ఎంత చెప్పినా వినకపోవడంతో గాడిదపై కూర్చోబెట్టి ఊరంతా తిప్పుతూ రంగులు చల్లాడట మామ ఆనందరావ్ దేశ్‌ముఖ్. ఊరేగింపు అయిపోయాక విలువైన బహుమతులు.. కొత్త బట్టలు పెట్టి గౌరవిస్తారట. ఇక అప్పటి నుంచి ఇది ఆ ఊరి ఆచారంగా కొనసాగుతూ వస్తోంది.
మేనమామల హోలీ
తెలంగాణ బార్డర్‌లోని కంగ్టి.. పిట్లం.. కర్ణాటకలోని బీదర్లో హోలీని ఇంకా ప్రత్యేకంగా జరుపుకుంటారు. హోలీ పండుగ రోజున మేన మామలు.. మేనల్లు్ళ్లకు.. మేన కోడళ్లకు చెక్కర మాలలు.. కూడక కర్జూర మాలలు బహుమతిగా ఇస్తుంటారు. చాలా సంవత్సరాల నుంచి ఇదొక ఆనవాయితీగా వస్తోంది. కాముడి దహనం అనంతరం శుభసూచకంగా వీటిని ఇస్తారట. చక్కెర మాలలు తీయదనానికి.. మధుర జీవనానికి ప్రతీకగా నిలుస్తాయి. కూడక కర్జూరాలు ఆరోగ్య పరిరక్షణ.. దుష్టశక్తుల నివారణ.. మంగళకరమైన జీవితానికి సంకేతంగా ఇస్తుంటారని చెప్తున్నారు.
విదేశాల్లో హోలీ
- నేపాల్‌లో హోలీని ఫాగు పౌర్ణమి అని అంటారు. ఖాట్మాండు.. పోఖరా వంటి పెద్ద నగరాల్లో హోలీ రోజున వీధులు రంగు రంగుల లైట్లతో కాంతివంతంగా కనిపిస్తాయి. రంగులు.. గులాల్.. నీటి బుడగలు చల్లుకొని ప్రజలు హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు.
- మారిషస్‌లో యూపీ.. బీహార్లో జరిగే హోలీ పండగలా సెలబ్రేట్ చేస్తారు. భజన కీర్తనలు.. హోలిక దహనం.. రంగులు చల్లుకొని హోలీని జరుపుకుంటారు.
- ఫిజీలో హోలీని బహుళ వర్ణ పండుగ అంటారు. ఇక్కడ కూడ యూపీ.. బీహార్ నుంచి వెళ్లినవారు ఎక్కువగా ఉంటారు. సాంప్రదాయక నృత్యాలు.. సంగీతాల మధ్యన రంగులు చల్లుకొని సందడి చేస్తారు.
- పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్.. కరాచీ.. లాహోర్ వంటి ప్రాంతాల్లో హోలీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. హిందూ దేవాలయాల.. కమ్యునిటీ కేంద్రాలు రంగులమయం అవుతారు హోలీ రోజున.
- బంగ్లాదేశ్‌లోని ఢాకా.. చిట్టగాంగ్,, సిల్హెట్ వంటి ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా హోలీని జరుపుతారు. ఇక్కడ హోలీని డోల్ పౌర్ణిమ లేదా బసంత ఉత్సవం అని అంటారు.
పండుగ వృత్తాంతం..
- హోలీ పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. మండుతున్న హోలీ మంటలనే హోళీక అంటారు.
- హోలీ సంబరాల్లో ఇది ప్రధాన ఘట్టం.
- హిందూ పురాణాల ప్రకారం ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుడు చెల్లెలైన హోళిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా ఈ హోలీ మంటలు వేస్తారని చెప్తుంటారు.
- రాక్షసుల పరాక్రమం హోళిక దహనంతో అంతమైందని అందుకు ప్రతీకగానే కామ దహనం చేస్తారని అంటారు.
ఆ ఊళ్లో పండుగకు మగాళ్లు దూరం
రంగుల పండుగ హోలీని దేశమంతటా ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా నార్త్‌లో సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. ఫ్యామిలీ గ్యాదరింగ్స్, పిండి వంటలు, రంగులు చల్లుకుంటూ డ్యాన్సులతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. మార్కెట్లు, ఇల్లు కలర్‌ఫుల్ గా మారిపోతాయి. కానీ రాజస్థాన్ టోంక్ జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో ఆసక్తికరమైన ఆచారాన్ని 500 ఏళ్లుగా కొనసాగిస్తోంది. టోంక్ జిల్లాలోని నాగర్ గ్రామం ప్రత్యేక సంప్రదాయానికి ప్రసిద్ధి. ఇక్కడ పురుషులు హోలీ రోజున రంగులకు పూర్తిగా దూరంగా ఉంటారు. మహిళలు మాత్రమే పండుగ జరుపుకునే నిబంధనలను పాటిస్తారు. అంతేకాదు స్త్రీలు రంగులో మునిగితేలియాడటాన్ని చూసే అనుమతి కూడా వారికి లేదు. ఆ రోజు ఉదయం 10 గంటలు కాగానే.. నాగర్ పురుషులు గ్రామం నుంచి వెళ్లి ఆ ఊరి శివార్లలోని చాముండా మాత ఆలయానికి చేరుకుంటారు. అక్కడ జరిగే జాతరలో భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. భజనలు చేస్తూ రోజంతా గడుపుతారు.
మహిళలదే ఊరు
పురుషులు ఊరికి దూరంగా వెళ్లడంతో నాగర్ మహిళలు ఆడిపాడుతారు. గ్రామాన్ని రంగులతో నింపేస్తారు. సొసైటీ పారామీటర్స్ నుంచి ఆరోజుకు విముక్తి పొంది.. ఒకరినొకరు రంగులతో ముంచెత్తుతూ ఆనందిస్తారు. ఈ ప్రత్యేకమైన ఆచారం స్త్రీలు ఉత్సాహంతో హోలీని జరుపుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఐదు శతాబ్దాలుగా పాటిస్తున్న ఈ అసాధారణ ఆచారాన్ని గ్రామస్తులు అందరూ సమర్థిస్తారు. ఒకవేళ ఈ పురాతన సంప్రదాయాన్ని ధిక్కరించడానికి ఏ పురుషుడైనా ప్రయత్నిస్తే మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కొంటారు. వెంటనే గ్రామం నుంచి బహిష్కరించబడుతారు. కాగా మగాళ్లు ఆ మరుసటి రోజు హోలీ వేడుకల్లో పాల్గొనడం విశేషం.
ఇంటి రంగులే ఒంటికి మంచిది
హోలీ.. అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది రంగులు. ఈనెల 14న రానున్న ఈ ఫెస్టివల్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆ రోజు ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుంటూ మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇక ఆ రోజు ఏ ఇంట్లో చూసినా డీజే డ్యాన్సులతో మోత మోగుతుంది. అన్ని సిటీలు, గ్రామాల్లోని రోడ్లు, గల్లీలు మొత్తం రంగుల మయం అవుతాయి. కానీ ఇక్కడే జర జాగ్రత్త అంటున్నారు నిపుణులు. ఎందుకంటే హోలీ రోజు మనం చల్లుకునే రంగుల్లో హానికారక రసాయనాలు ఉంటాయి. కొందరికి అస్సలు పడవు. దీంతో చర్మంపై, కళ్లపై ప్రభావం దద్దుర్లు ఏర్పడి ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు.
బయట మార్కెట్లో రసాయనాలు కలిసిన రంగులు కొని చల్లడం కంటే ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సేంద్రీయ లేదా మోదుగుపూలు వంటి మూలికా రంగులతో హోలీ ఆడటం సురక్షితమని చెబుతున్నారు. అయితే అటువంటి సహజమైన, సురక్షితమైన రంగులను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
పసుపు
పసుపు, శనిగ పిండిని 1:2 నిష్పత్తిలో తీసుకోవాలి. వాటిని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని సమానంగా కలపడానికి ముందు, రెండు మూడు సార్లు జల్లెడ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అది గాఢమైన రంగులోకి మారుతుంది. అయితే మనం వాడే పసుపు పొడి సహజ స్వభావం కలిగి ఉండాలి. అప్పుడే ఈ రంగు ఆరోగ్యానికి మంచిది.
ఎరుపు
హోలీ రోజు రసాయనాలు లేని ఎరుపు రంగును తయారు చేసుకోవాలనుకుంటే.. ముందుగానే ఎర్రటి మందార పువ్వులను ఆరబెట్టుకోవాలి. అవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత వాటిని మెత్తటి పొడిలా చేసుకోవాలి. తర్వాత వాటిలో శనిగపిండి అలాగే ఎరుపు కుంకుమ పువ్వు పొడి కూడా కలుపుకోవాలి. ఇలా చేయడంవల్ల చక్కటి ఎరుపు రంగు రావడమే కాకుండా.. శనిగపిండి, కుంకుమ పువ్వు కారణంగా ముఖ సౌందర్యం కూడా వస్తుంది. మోదుగు పూలను కూడా హోలీ రంగుల తయారీలో ఉపయోగించవచ్చు.
మెజెంటా
ఆర్గానిక్ వెట్ మెజెంటా రంగును తయారు చేయడానికి బీట్‌రూట్‌ను నీటిలో ఉడకబెట్టుకోవాలి. ఆ నీటిని రంగుగా ఉపయోగించవచ్చు. బీట్ రూట్‌లో కాల్షియంతో పాటు మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికే కాదు, చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడటంలో సహాయపడతాయి. కాబట్టి బీట్ రూట్ కలర్ తయారు చేసుకోవడం బెటర్.
ఆకుపచ్చ
ముదురు ఆకుపచ్చ కలర్ సొంతంగా తయారు చేసుకొని వాడొచ్చు. అందుకోసం బియ్యపు పిండిలో గోరింటాకు పొడిని కలిపితే చాలు. తడి ఆకుపచ్చ రంగును తయారు చేయడానికి నీటిలో హెన్నా పొడిని (హోమ్ మేడ్) కలపవచ్చు. అయితే హెన్నా మరకలు చర్మం, బట్టలపై కొన్ని రోజుల పాటు అలాగే ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
బ్రౌన్ కలర్
అందాన్ని పెంచే చిట్కాలలో కాఫీ పౌడర్ కూడా ఒకటి. ముఖంపై టాన్, నల్లటి మచ్చలు పోవడానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. అయితే.. తడి బ్రౌన్ కలర్ పొందడానికి కాఫీ పౌడర్‌ని నీటిలో వేసి కాసేపు మరిగించాలి. అయితే కాఫీ మరకలు కూడా బట్టలు, చర్మంపై కొన్ని రోజుల పాటు అలాగే ఉంటాయి. ఇలా ఇంట్లో తయారు చేసుకునే రంగుల వల్ల మీ హోలీ ఆనందాల కేళిగా మారుతుంది. ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు.