గురుకుల విద్యార్థులకు ఫైన్ ఆర్ట్స్ శిక్షణ

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని చిన్నతనంలోనే గుర్తించి ప్రోత్సహిస్తే.. ఆ రంగానికి ఎనలేని సేవ చేసినవారిమి అవుతాము. అందుకే చిన్న పిల్లలకు కళలను పరిచయం చేయాలి.

Update: 2025-03-25 06:15 GMT
గురుకుల విద్యార్థులకు ఫైన్ ఆర్ట్స్ శిక్షణ
  • whatsapp icon

దిశ, ఫీచర్స్: ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దానిని చిన్నతనంలోనే గుర్తించి ప్రోత్సహిస్తే.. ఆ రంగానికి ఎనలేని సేవ చేసినవారిమి అవుతాము. అందుకే చిన్న పిల్లలకు కళలను పరిచయం చేయాలి. వారి శరీర నిర్మాణానికి అనుగుణంగా ఉండే రంగాన్ని వారే ఎంచుకుని.. తమ అభిరుచికి అనుగుణంగా మెళకువలు నేర్చుకుంటారు. కానీ, కళలు నేర్పించడం అంటే ఈ రోజుల్లో సామాన్యమైన విషయం కాదు. అందుకు వేలకు వేలు ఫీజులు కట్టాలి. అందుకు అవసరమైన సామగ్రి కూడా ఖరీదైన వ్యవహారం కావడంతో తల్లిదండ్రులు పిల్లలకు ఆయా రంగాలపై ఆసక్తి ఉన్నా కూడా ఆర్థిక పరిమితులతో ప్రోత్సహించరు. కానీ, ప్రభుత్వం ఈ తరహా పరిస్థితులను అర్థం చేసుకుని.. పిల్లలకు ఉచితంగా ప్రత్యేక ఫైన్ ఆర్ట్స్ నేర్పించేందుకు రంగంలోకి దిగింది.

ఘట్ కేసర్ మండలం ఏదులాబాద్ లో ఏర్పాటుచేసిన గురుకులంలో విద్యతోపాటు 12 రకాల కోర్సులు నేర్పిస్తారు. ఆ కళలు ఖరీదైనవే కాక అరుదైనవి కూడా కావడంతో విద్యార్థులకు అయాచిత వరంలా మారాయి. మరోవైపు గురుకులంలో ఉచిత విద్యతోపాటు నచ్చిన కళలు కూడా నేర్పుతుండటం గొప్ప విషయం. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు క్రాఫ్ట్స్ నేర్పి.. తెలుగు యూనివర్సిటీ నుంచి డిప్లొమా కోర్సు పరీక్ష రాసేందుకు అనుమతి లభిస్తుంది. ఆ పరీక్షలో పాసయితే యూనివర్సిటీ సర్టిఫికెట్ అందుకోవచ్చు. ఆపై ఫైన్ ఆర్ట్స్‌లో ముందు చదువులకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఎదులాబాద్‌లో ఫైన్ ఆర్ట్స్ క్లాసులపై ‘దిశ’ ప్రత్యేక కథనం

విద్యార్థులకు చదువు ఒక్కటే కాదు వారిలో ఉన్న ప్రతిభను, సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. గురుకులాల విద్యార్థులకు ఫైన్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చి వారిలోని ప్రతిభ వెలికితీస్తున్నారు. గురుకులాల్లో ఏర్పాటు చేసిన ఫైన్ ఆర్ట్స్ స్కూల్ మంచి ఫలితాలు ఇస్తుంది. దీనికి అత్యధికంగా పోటీ ఉంది. రాష్ట్రంలో గురుకుల విద్యార్ధులకు ఫైన్ ఆర్ట్స్ స్కూల్ ఉంది. ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్‌లో దీనిని 2016లో ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థులకు చదువుతో పాటుగా వివిధ రకాల సాంస్కృతిక విద్యను నేర్పిస్తారు. మొత్తం 12 రకాల ఫైన్ ఆర్ట్స్ నేర్పిస్తున్నారు. 6వ నుంచి 9వ తరగతి వరకు వారికి వారానికి మూడు నుంచి నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తారు.

వీరి శిక్షణ కోసం నిష్ణాతులైన వారిని ఎంపిక చేసి వారి చేత శిక్షణ ఇప్పిస్తున్నారు. విద్యార్థులకు ఉన్న నైపుణ్యాన్ని బట్టి ఏ కోర్సులో అయితే బాగుంటారో తెలుసుకొని ఆ కోర్సుకు ఎంపిక చేస్తారు. నాలుగు సంవత్సరాల పాటు శిక్షణ పూర్తి చేసిన అనంతరం తెలుగు యూనివర్సిటిలో డిప్లొమా కోర్సు పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు. ఈ పరీక్షకు అవసరమైన ఫీజును కూడా గురుకుల సొసైటీ నుంచే చెల్లింపులు చేస్తున్నారు. ఈ పరీక్షకు హాజరైన వారందరు పాసవుతున్నట్లుగా గురుకుల విద్యాసంస్థ ప్రకటించింది. ఇక్కడ చదివిన వారు జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతులు మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు.

పిల్లలతో ఆర్ట్ ఎగ్జిబిషన్లు

ఇక్కడ నిర్వహించే కోర్సులు బహిరంగ మార్కెట్లో వేలల్లో ఫీజులు ఉంటాయి. ఎక్కువగా వేసవి సెలవుల్లో పిల్లలు నేర్చుకుంటారు. రోజుకు ఒక గంట చొప్పున నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి వేల రూపాయల ఫీజులను వసూలు చేస్తారు. కానీ ఇక్కడి ఫైన్ ఆర్ట్స్ స్కూల్‌లో మాత్రం నాలుగు సంవత్సరాల పాటు వారానికి మూడు నుంచి నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇవ్వడమే కాదు నేర్చుకోవడానికి అవసరమైన పరికరాలను, డ్రెస్సులను, మెటీరియల్‌ను గురుకుల సొసైటీ ఉచితంగా అందిస్తుంది. పరికరాల నిర్వహణకు కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ నగరంలో జరిగే ప్రముఖ, అధికారిక కార్యక్రమాలకు ఇక్కడి విద్యార్థులను తీసుకువెళ్లి ఆర్ట్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు వారి ప్రతిభను బయటి ప్రపంచానికి చూపించడానికి అస్కారం ఏర్పడుతుంది. గురుకులాల్లో విద్యార్థులకు ఎలాంటి భారం లేకుండానే శిక్షణలు పూర్తి అవుతున్నాయి. పదో తరగతిలో విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉన్నందున వారిని పూర్తి చదవుపైనే దృష్టి కేంద్రీకరించే విధంగా ఈ కోర్సు నుంచి మినహాయింపు ఇస్తున్నారు. దీంతో 9వ తరగతి వరకు శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ చదివిన మనోజ్ఞ, పి.శృతి, అభిషేక్ లాంటి విద్యార్థులు ఎంతో మంది జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటారు.

డిప్లొమా సర్టిఫికెట్

విద్యార్థులు నాలుగు సంవత్సరాల పాటు ఒక కోర్సుకు అలవాటు పడి, దాదాపుగా పూర్తిస్థాయిలో నేర్చుకుంటున్నారు. ఆయా కోర్సులపై పూర్తిస్థాయిలో పట్టు సాధిస్తున్నారు. ఈ కోర్సు పూర్తి అయ్యాక వారు ఉన్నత చదువులు, ఉద్యోగం చేరిన తరువాత ఆ కోర్సును కొనసాగించే అవకాశం ఏర్పడుతుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత పని ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి, ప్రదర్శనలు ఇవ్వడానికి పునాదులు ఇక్కడే పడుతున్నాయి. ఫైన్ ఆర్ట్స్ గురుకులంలో 75 శాతం ఎస్సీలు ఉండగా మిగిలిన వారు ఇతర సామాజిక వర్గాల వారు ఉన్నారు. వీరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండటంతో ఆ విద్యార్థులు తమకు లభ్యమైన అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. పేద తల్లిదండ్రులు పిల్లలు అంత మొత్తం వెచ్చించి నేర్చుకునే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ మాత్రం 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు నాలుగు సంవత్సరాల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం తెలుగు యూనివర్సిటిలో డిప్లొమా పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు. పరీక్ష రాసి పాసైన వారికి డిప్లొమా సర్టిఫికెట్ అందిస్తారు.

అహ్లాద వాతావరణంలో..

తమ పిల్లలు గీసిన చిత్రాలు నిజమైనవి కావంటే చాలామంది తల్లిదండ్రులు నమ్మలేని స్థితిలో ఉంటున్నారంటే వారిని ఎలా నిష్ణాతులుగా మార్చారో అర్థం అవుతుంది. నారింజ, వృద్ధుడి చిత్రాలు ఎంత ఒరిజినల్ గా ఉంటాయంటే.. అవి ఫొటోలు కాదు.. చిన్నారుల కుంచె నుంచి జాలువారిన చిత్రాలు అంటే ఎవరైనా నమ్మడం కష్టం. ఆ చిత్రాలతోపాటు నాట్యం, వయోలిన్, గిటార్ సహా ఫ్లూట్, మృదంగం, తబలా వాయిద్యాలపై చిన్నారుల ప్రతిభ విస్మయాన్ని కలిగిస్తున్నది. అక్కడి వాతావరణం చూస్తే అబ్బురపడే విధంగా ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో, విశాలమైన ప్రాంగణంలో ఫైన్ ఆర్ట్స్ స్కూల్ ఉంది. విద్యార్థులకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా, కాలుష్యానికి దూరంగా దీనిని ఏర్పాటు చేయడం విశేషం.

కోర్సులు ఇవే : కీబోర్డు, కర్ణాటిక్ వయోలిన్, కూచిపూడి, కథక్, తబలా, గిటార్, ఫ్లూట్, మృదంగం, పెయింటింగ్ డ్రాయింగ్, కర్ణాటిక్ ఓకల్, హిందుస్థానీ వోకల్.

ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేస్తా

మాది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్. నేను 5వ తరగతి అడ్మిషన్ కు గురుకులాల్లో టెస్ట్ రాయడంతో హుస్నాబాద్ లో సీటు వచ్చింది. అక్కడ నేను బాగా పెయింటింగ్ వేస్తున్నానని గుర్తించిన మా సార్, ఇక్కడ ఫైన్ ఆర్ట్స్‌కు పరీక్ష రాయమని ప్రోత్సహించారు. నేను పరీక్ష రాసి ఇక్కడికి ఎంపికయ్యాను. నాకు ఇష్టమైన పెయింటింగ్ నేర్చుకున్నాను. చాలా పేయింటింగ్లు వేశాను. నేను ఢిల్లీలో జరిగిన కళా ఉత్సవ్‌లో పాల్గొన్నాను. అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చేతులు మీదుగా సర్టిఫికెట్ అందుకున్నాను. నాకు ఇష్టమైన పెయింటింగ్ పోట్రేట్. నాకు మంచి అవకాశం లభించింది. మసాబ్ ట్యాంక్‌లోని బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేయాలనుకుంటున్నాను. - అభిషేక్, 9వ తరగతి

సృజనాత్మక శక్తిని గుర్తించాలి..

గురుకులాల్లో చదివే విద్యార్థులకు చదువుతో పాటుగా వారిలోని సృజనాత్మక శక్తిని బయటికి తీయడానికి ఇలాంటి ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ కోర్సులు తీసుకొన్న విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇక్కడి విద్యార్థులు ప్రతిభను చూపారు. ఈ కోర్సులకు డిమాండ్ బాగుందని గుర్తించాం. మరో నాలుగు ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. 2025‌–26 విద్యా సంవత్సరంలో వీటిని హైదరాబాద్ పరిసరాల్లోని గురుకులాల్లో అదనంగా ఏర్పాటు చేస్తాం. ఒక్కో పాఠశాలకు 80 మంది చొప్పున ఆరో తరగతిలో అడ్మిషన్ ఇస్తాం.:– అలుగు వర్షిణి, కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలు

Similar News