విద్యా సంస్కరణలతో మేలు జరిగేనా..
విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో సరికొత్త విధానాలపై నిపుణులతో కమిటీలు వేసి, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నాయి. విద్యా సంస్కరణలకు నాంది పలికింది ఢిల్లీ ప్రభుత్వం. ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రమైనా విద్యా రంగంలో సంస్కరణలు తేవాలంటే ఢిల్లీలో అధ్యయనం చేసేలా చర్యలు తీసుకుంది. అయితే ఈ చర్యల్లో కొన్నింటిపై అభ్యంతరాలు వినిపిస్తున్నాయి. […]
విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో సరికొత్త విధానాలపై నిపుణులతో కమిటీలు వేసి, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నాయి. విద్యా సంస్కరణలకు నాంది పలికింది ఢిల్లీ ప్రభుత్వం. ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రమైనా విద్యా రంగంలో సంస్కరణలు తేవాలంటే ఢిల్లీలో అధ్యయనం చేసేలా చర్యలు తీసుకుంది. అయితే ఈ చర్యల్లో కొన్నింటిపై అభ్యంతరాలు వినిపిస్తున్నాయి.
కంటెంట్‌ను తగ్గించి, సరళంగా చేయడం ద్వారా నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రగతి సిరీస్-అనుబంధ పుస్తకాలతో అభ్యసనా ప్రమాణాలు తగ్గిపోతున్నాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2015లో ఆప్ అధికారంలోకి రాగానే సీఎం కేజ్రీవాల్ విద్యకు మొదటి ప్రాముఖ్యతనిచ్చారు. అందులో భాగంగానే 2016 వేసవి సెలవుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రధమ్ సభ్యులు, ఎన్జీవోలతో కలిసి చర్చించి ఢిల్లీ పాఠశాలల్లో ప్రగతి సిరీస్ అనుబంధ పుస్తకాలను ప్రవేశపెట్టారు. అయితే ప్రగతి సిరీస్ పుస్తకాలు..‘కంటెంట్‌ను తగ్గించడం’తో, విషయంపై పూర్తి అవగాహన ఇవ్వకుండా బోధనను సలహాల వరకే పరిమితం చేస్తోందని’ విద్యావేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ పుస్తకాలు విద్యార్థుల సామాజిక ఆర్థిక నేపథ్యానికి సరిపోతాయని, సందర్భానుసారంగా వారిలో అభ్యసనా స్థాయిలను పెంచేందుకు ఉపయోగపడతాయని సదరు పుస్తకాలను రూపొందించిన నిపుణులు సమర్థించుకుంటున్నారు.ఈ ప్రగతి సిరీస్ పుస్తకాల గురించి ఇరువర్గాల వాదనలను ఒకసారి పరిశీలించినట్టయితే..
ప్రగతి సిరీస్ పుస్తకాలు..
1000 ప్రభుత్వ పాఠశాలల్లో 2016లో ప్రభుత్వం వర్క్‌షాప్ నిర్వహించి, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివేందుకు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని గుర్తించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర సంస్థల సహకారంతో విద్యార్థుల సామాజిక ఆర్థిక నేపథ్యాలను పరిగణలోకి తీసుకుని ప్రగతి సిరీస్ పుస్తకాలను రూపొందించారు. వాటిని ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలకు అనుబంధంగా ప్రవేశపెట్టారు.
కాన్సెప్ట్‌లపై పట్టు సాధించేందుకు..
పిల్లలు పాఠ్య పుస్తకాల్లో ఉన్నవిషయాన్నే సులభమైన భాష, సరైన ఉదాహరణల ద్వారా తమ పరిస్థితులకు అన్వయించుకుని అర్ధం చేసుకోవడమే ఈ పుస్తకాల ప్రధాన ఉద్దేశం. ఉపాధ్యాయుల నుంచి ఫీడ్‌బ్యాక్ తర్వాత ఆ పుస్తకాలను అప్‌డేట్ చేస్తూ వచ్చారు. చివరకు 2020-21లో ఏడోసారి అప్‌డేట్ చేయనున్నారు. అంతేకాక వీటిని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగానే అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం.. మెరుగుపడాల్సిన విద్యార్థుల కోసం ‘నిష్ట’ మరియు ప్రతిభ కనబరిచే విద్యార్థుల కోసం ‘ప్రతిభ’ అంటూ రెండు కేటగిరీలను ప్రవేశపెట్టింది. అయితే ఈ చర్యలు విద్యార్థుల్లో వివక్షతకు కారణమవుతోందని విమర్శిస్తూ..ఢిల్లీ హైకోర్టులో దావా దాఖలైంది.
కాగా మళ్లీ అధికారంలోకి వస్తే.. వీడియో సిరీస్‌లతో విద్య, అభ్యసనను మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తామని ఆప్ ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చాలా పాఠశాలల్లో జియాన్, డిజిటల్ లెర్నింగ్ ప్రవేశపెడుతుండటంతో ఆ దిశగా ఆప్ అడుగులు వేయాలనుకుంటోంది.
నాణ్యతపై రాజీనా..?
ఇలాంటి పుస్తకాలతో విద్యార్థులకు స్పూన్ ఫీడింగ్ చేయడం వల్ల వారిలో విశ్లేషణా సామర్థ్యం, ఊహాశక్తితో పాటు ఆలోచనా శక్తి సైతం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. చాలా వరకు చరిత్ర పాఠ్యాంశాలను ఈ పుస్తకాలు సరిగా ప్రజెంట్ చేయలేదని పలువురు ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. విషయాన్ని సరళరతరం చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉపయోగపడుతుందనేది నిజం కాదని పలువురు విశ్లేషిస్తున్నారు.
అయితే ఎన్జీవోలు అందించిన ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను సామాజిక ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చిన కొందరు విద్యార్థులు చదవలేరని అనుకుంటే.. పుస్తకాలను సరళతరం చేయకుండా తరగతి గదిలోనే అటువంటి పరిస్థితులను ఎదుర్కొని బోధించగల నిపుణులైన ఉపాధ్యాయులు మనకు కావలసి ఉంటుంది. ఒకవేళ అనుబంధంగా ఇతర మద్దతు అవసరమైనా.. అది కిందికి లాగేలా ఉండకూడదు.