వైద్య సిబ్బందికి ప్రత్యేక హెల్ప్‌లైన్: కేంద్రం

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి జాతీయ స్థాయిలో ఒక హెల్ప్‌లైన్ నెంబర్‌ను నెలకొల్పనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 500 ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు, అనుమానితులకు చికిత్స చేస్తున్న క్రమంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ నెంబర్‌కు ఫోన్ చేసి తెలియజేవచ్చునంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. యునైటెడ్ నర్సెస్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగిన సందర్భంగా […]

Update: 2020-04-15 09:16 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి జాతీయ స్థాయిలో ఒక హెల్ప్‌లైన్ నెంబర్‌ను నెలకొల్పనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 500 ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు, అనుమానితులకు చికిత్స చేస్తున్న క్రమంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ నెంబర్‌కు ఫోన్ చేసి తెలియజేవచ్చునంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. యునైటెడ్ నర్సెస్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగిన సందర్భంగా సొలిసిటర్ జనరల్ ఈ హామీ ఇచ్చారు. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కౌల్, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్భంగా డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను పిటిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. కరోనా పేషెంట్లకు, అనుమానితులకు చికిత్స అందిస్తున్న క్రమంలో తొలుత వైరస్ బారిన పడేది వైద్య సిబ్బందేనని, దాన్నుంచి రక్షణ పొందడానికి అవసరమైన తీరులో పీపీఈ కిట్లు, మాస్కులు, ఇతర సౌకర్యాలు లేవని, కొన్ని సందర్భాల్లో వారిపై దాడులు కూడా జరుగుతున్నాయని న్యాయవాది వివరించారు.

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుభాష్ చంద్రన్ వాదిస్తూ, వైద్య చికిత్స చేస్తున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం లేదా ఆసుపత్రి యాజమాన్యం కనీస సౌకర్యాలను కూడా కల్పించలేకపోతోందని, రిస్కు మధ్యనే పనిచేయాల్సి వస్తోందని వివరించారు. చికిత్స చేసిన తర్వాత ఇళ్ళకు వెళ్ళాల్సి వస్తోందని, కుటుంబ సభ్యులకు వైరస్ అంటుకుంటుందేమోననే భయం వైద్య సిబ్బంది అందరిలోనూ ఒక్కో స్థాయిలో ఉందని వివరించారు. దేశం మొత్తం మీద సుమారు 200 మంది వైద్య సిబ్బందికి వైరస్ ఇన్‌ఫెక్షన్ సోకిందని, సుమారు 700 మంది క్వారంటైన్‌లోనే ఉన్నారని, చికిత్స క్రమంలో వారికి ఉన్న రిస్కు తీవ్రతకు ఈ పరిస్థితులు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. ముంబయిలోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో పదిమంది నర్సులకు కరోనా వైరస్ సోకిందని, సుమారు 265 మంది అబ్జర్వేషన్‌లో ఉన్నారని న్యాయవాది ప్రస్తావించారు. ఈ పిటిషన్ విచారణకు హాజరైన మరో న్యాయవాది పి.రామన్ వాదిస్తూ, దురదృష్టవశాత్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కరోనా చికిత్స కోసం ఉమ్మడి ప్రోటోకాల్‌ను రూపొందించలేకపోయిందని, వైద్య సిబ్బంది రిస్కుకు తగిన తీరులో సౌకర్యాలను ఏర్పాటు చేయలేకపోయిందని, పేషెంట్లకు చికిత్స చేయడానికి అనువైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడంలో సన్నద్ధత లోపించిందని వివరించారు. ఇక అద్దె ఇళ్ళల్లో ఉంటున్నవారిని ఖాళీ చేయాల్సిందిగా ఇంటి యజమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న నర్సులకు సగం జీతం మాత్రమే వచ్చిందని, కొన్ని చోట్ల గడచిన నెల జీతంతోపాటు అంతకుముందు నెల జీతం కూడా పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ జోక్యం చేసుకుని, దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వానికి సైతం విజ్ఞాపనలు అందుతున్నాయని, ఎప్పటికప్పుడు వారి అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉందని, ఎప్పటికప్పుడు సౌకర్యాల లేమిని పరిష్కరించడానికి చొరవ తీసుకుంటూ ఉన్నదని పేర్కొన్నారు. కరోనాపై యుద్ధం చేయడంలో వైద్య సిబ్బంది ‘ఫ్రంట్‌లైన్ వారియర్స్’గా ప్రభుత్వం గుర్తించిందని ప్రస్తావించారు. ఇకపైన వారి సమస్యలను, ఇబ్బందులను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక హెల్ప్‌లైన్ నెంబర్‌ను నెలకొల్పుతామని, ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. సొలిసిటర్ జనరల్ ప్రస్తావించిన అంశాలను రికార్డు చేసిన ధర్మాసనం వీలైనంత త్వరగా హెల్ప్‌లైన్ నెంబర్ వివరాలను వైద్య సిబ్బందికి తెలియజేసే విధంగా ప్రచారం చేయాలని సూచిస్తూ ఈ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.

Tags: Supreme Court, Judges, Corona, Doctors, Nurses, Medical Staff, Petition, Hearing, Helpline Number

Tags:    

Similar News