జేఈఈ, నీట్ నిర్వహణపై రగడ
న్యూఢిల్లీ: కరోనా కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని జేఈఈ (మెయిన్), నీట్ పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా, కేంద్రం మాత్రం షెడ్యూల్ ప్రకారమే(వచ్చే నెలలో) నిర్వహించి తీరుతామని స్పష్టం చేసింది. విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టలేమని పేర్కొంటూ సెప్టెంబర్‌లోనే నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సర్వంసిద్ధం చేస్తున్నది. కానీ, బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు రాస్తూ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ […]
న్యూఢిల్లీ: కరోనా కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని జేఈఈ (మెయిన్), నీట్ పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా, కేంద్రం మాత్రం షెడ్యూల్ ప్రకారమే(వచ్చే నెలలో) నిర్వహించి తీరుతామని స్పష్టం చేసింది. విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టలేమని పేర్కొంటూ సెప్టెంబర్‌లోనే నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సర్వంసిద్ధం చేస్తున్నది. కానీ, బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు రాస్తూ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రెండు సార్లు లేఖ రాశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఇదే డిమాండ్‌ను కేంద్రం ముందుంచారు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏడుగురు సీఎంలతో నేడు వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నది. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గడ్ సీఎం భుపేష్ భగేల్‌లతోపాటు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పుదుచ్చేరి సీఎం వి నారాయనసామిలతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జేఈఈ(మెయిన్), నీట్‌లతోపాటు జీఎస్టీ వసూళ్లు, కేటాయింపులపైనా చర్చించనున్నారు. సుప్రీంకోర్టు, కేంద్రం ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) వచ్చే నెలలో జేఈఈ(మెయిన్), నీట్ పరీక్షలను నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తున్నది. షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్‌లను నిర్వహిచబోతున్నట్టు ఎన్‌టీఏ మంగళవారం ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరీక్షా కేంద్రాలు, అడ్మిట్ కార్డుల గురించిన వివరాలనూ అందులో పొందుపరిచారు.
విద్యార్థుల పక్షాన గ్రెటా థన్‌బెర్గ్
కరోనా మహమ్మారి కోరలు చాచిన కాలంలో లక్షలాది మంది వరదలతో ప్రభావితమైన నేపథ్యంలో పరీక్షలు కచ్చితంగా రాయాల్సిందేనని భారత ప్రభుత్వం విద్యార్థులను కోరడం సమంజసం కాదని పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ ట్వీట్ చేశారు. జేఈఈ, నీట్‌లను వాయిదా వేయాలనే విద్యార్థులు డిమాండ్‌లకే తాను మద్దతునిస్తున్నట్టు ప్రకటించారు.