కరోనా కట్టడికి స్వరాల ఉద్యమం
దిశ, హైదరాబాద్ : పాట ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తది. అనేక పోరాటాలకు దారులు వేస్తది. మన కండ్ల ముందే మహాత్తరంగా సాగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి పాట అగ్రభాగాన నిలిచిన సంగతి తెలిసిందే. సంగీతానికి రాళ్లైనా కరుగుతాయని అంటారు. అనేక మానసిక రుగ్మతలను కూడా సంగీతం ద్వారా పరిష్కారం అవుతాయని సంగీత ప్రియులు అంటుంటారు. సంగీతం వ్యక్తి మానసికోల్లాసానికి ఎంతో దోహదపడుతోంది. ప్రస్తుతం యావత్తు ప్రపంచాన్ని కరోనా వైరస్ (కోవిడ్ 19) గజగజ వణికిస్తోంది. […]
దిశ, హైదరాబాద్ : పాట ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తది. అనేక పోరాటాలకు దారులు వేస్తది. మన కండ్ల ముందే మహాత్తరంగా సాగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి పాట అగ్రభాగాన నిలిచిన సంగతి తెలిసిందే. సంగీతానికి రాళ్లైనా కరుగుతాయని అంటారు. అనేక మానసిక రుగ్మతలను కూడా సంగీతం ద్వారా పరిష్కారం అవుతాయని సంగీత ప్రియులు అంటుంటారు. సంగీతం వ్యక్తి మానసికోల్లాసానికి ఎంతో దోహదపడుతోంది. ప్రస్తుతం యావత్తు ప్రపంచాన్ని కరోనా వైరస్ (కోవిడ్ 19) గజగజ వణికిస్తోంది. దాదాపు 200 దేశాలు ఈ మహమ్మారి కారణంగా అల్లకల్లోలం అవుతున్నాయి.
ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికా సైతం కరోనా దెబ్బకు విలవిలలాడుతోంది. మన దేశంలోనూ వేలాదిమందిని బాధితులను చేసింది. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచడానికి కవితలు రాయాలనీ స్వయంగా సీఎం కేసీఆరే కవులకు పిలుపునిచ్చారు.
యావత్తు ప్రపంచంతోపాటు తెలంగాణ సమాజాన్ని కమ్ముకుంటున్న కరోనాకు ఎలాంటి మెడిసిన్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అంటువ్యాధి కావడం, రోజురోజుకూ పాజిటివ్ కేసులు నమోదు పెరగడం, మరణాలు సైతం సంభవించడంతో కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు, జాగ్రత్తలు పాటించేలా కవితలు రాయాలని ముఖ్యమంత్రి కోరారు. సీఎం పిలుపును బాధ్యతగా భావించిన అనేకమంది ప్రముఖ కవులు, కళాకారులు కరోనా వైరస్ మహమ్మారి మన దరికి చేరకుండా ఉండేందుకు మ్యూజిక్ కంపోజింగ్‌తో సహా అనేక పాటలను తెలుగులో రూపొందించారు.
ప్రస్తుతం ఈ పాటలు యూ ట్యూబ్ లో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిని కొన్ని వేల మంది ప్రజలు తమ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకుని వింటున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికే కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అన్నిసెల్ ఫోన్లకు రింగ్ టోన్ వచ్చేలా చేస్తోంది. వీటికి తోడు ప్రస్తుతం యూ ట్యూబ్‌లో వైరల్ అవుతోన్న యాంటీ కరోనా సాంగ్స్ ప్రజలను నిజంగా చైతన్యం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
చేయి చేయి కలపకురా..
కరోనా నివారణకు కేవలం జాగ్రత్తలు మాత్రమే మేలుగా భావిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనే విషయాలను ఈ పాటల్లో వివరిస్తున్నారు. ఆయుధాలు లేకుండానే యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా.. కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా… అంటూ చౌరస్తా బ్యాండ్ గ్రూప్ రామ్ రచించి, పాడిన పాట ప్రజల మనసును హత్తుకుంటుంది. నీ చేతల్లోనే కదా.. భవిత. నీ వైపు కంటూ రాదే నలత అంటూ ప్రముఖ సంగీత దర్శకులు కోటి వెస్ట్రన్ స్టైయిల్లో పాడిన పాట, స్టూడెంట్ నంబర్ వన్ సినిమాలోని పాట ట్యూన్ లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.. ఇక్కడే చేరింది మహమ్మారి ఒకటి అంటూ మరో సంగీత దర్శకులు కీరవాణి పాటను విడుదల చేశారు.
కకక రోరోరో నానానా (కలసి మెలసి తిరగకండి నాలుగు వారాల పాటు) అంటూ వందేమాతరం శ్రీనివాస్ పాడారు. వివాదాస్పద డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాం గోపాల్ వర్మ కనిపించని పురుగు అంటూ కరోనాపై పాటను రాసి, పాడారు. ఈ పాట మరింత వ్యంగ్యంగా ఉండటంతో విన్నవారంతా పగలబడి నవ్వుకుంటున్నారు. అంతే కాకుండా, అనేక మంది జానపద, సంగీత కళాకారులు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని పాటలు పాడి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. అయితే, ఈ పాటలతో కరోనా పట్ల మరింత జాగ్రత్తలు తీసుకుంటారని, కరోనా అడ్డుకట్టకు పూనుకుంటారని భావిద్దాం.
Tags: Anti Corona Songs, Corona Effect, Hyderabad, Chowrasta Band, Keeravani, Koti, Vandemataram