సింగరేణి గృహాలు కబ్జా.. సైలంట్‌గా విక్రయం
దిశ, బెల్లంపల్లి: సింగరేణి యాజమాన్యం కార్మికుల కోసం బెల్లంపల్లి పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు 5 వేలకు పైగా గృహాలు నిర్మించింది. సంస్కరణల నేపథ్యంలో 2005లో బెల్లంపల్లి డివిజన్‌లో పదుల సంఖ్యలో గనులు మూసివేయడంతో కార్మికులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. దీంతో కొంత మంది కార్మికులు వారి పిల్లల భవిష్యతు కోసం, విద్యా వైద్య అవసరాల నిమిత్తం ఇక్కడే ఉండగా, మరి కొంత మంది తప్పనిసరి పరిస్థితులలో ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. 2017-18వ సంవత్సరంలో […]
దిశ, బెల్లంపల్లి: సింగరేణి యాజమాన్యం కార్మికుల కోసం బెల్లంపల్లి పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు 5 వేలకు పైగా గృహాలు నిర్మించింది. సంస్కరణల నేపథ్యంలో 2005లో బెల్లంపల్లి డివిజన్‌లో పదుల సంఖ్యలో గనులు మూసివేయడంతో కార్మికులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. దీంతో కొంత మంది కార్మికులు వారి పిల్లల భవిష్యతు కోసం, విద్యా వైద్య అవసరాల నిమిత్తం ఇక్కడే ఉండగా, మరి కొంత మంది తప్పనిసరి పరిస్థితులలో ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. 2017-18వ సంవత్సరంలో విడతల వారీగా సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి కార్మిక నివాస గృహాలను అప్పగించారు. దీన్ని ఆసరా చేసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు పోస్ట్ ఆఫీస్ బస్తీ, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియా, హనుమాన్ బస్తీ, ఇంక్లైన్ బస్తీ, బూడిద గడ్డబస్తీ, స్టేషన్ రోడ్డు కాలనీలలోని సింగరేణి గృహాలను అధికార పార్టీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు శాఖకు చెందిన పలువురు ఉద్యోగులు, అటవీ శాఖకు చెందిన ఉద్యోగులు, వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆక్రమించుకున్నారు.
అడుగడుగునా నిర్లక్ష్యం..
సింగరేణి యాజమాన్యం కార్మిక నివాస గృహాల రక్షణకు సంబంధించి చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. ఖాళీగా ఉన్న నివాస గృహానికి కరెంటు, నీటి సదుపాయం తొలగించాల్సి ఉన్న నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ధరణి సర్వేలో కబ్జా చేసిన వారు సింగరేణి గృహాలు తమ పేరిట నమోదు చేయించుకునే పనిలో పడ్డారు. ఈ పరిణామం భవిష్యతులో తీవ్ర ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉంది. పర్యవేక్షించాల్సిన మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నేతలతో అంటకాగుతూ వారి నుంచి ముడుపులు తీసుకుని ఇంటికి నెంబర్లు కేటాయిస్తున్నారు. పేదలు నివాసం ఉంటున్న గృహాల్ని కొంతమంది ప్రజాప్రతినిధులు పోలీసులతో బయపెట్టి ఖాళీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్టేషన్ రోడ్డు కాలనీలోని సుమారు 50పైగా ఇండ్లను పలు శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు కబ్జా చేశారు. ఇలా కబ్జా చేసిన గృహాల్ని ఒక్కొక్కటి రూ. మూడు నుంచి ఐదు లక్షల వరకు అమ్ముకుంటున్నట్లు సమాచారం.
స్థానిక యంత్రాంగం అండ దండలతోనే..
సింగరేణి యాజమాన్యం అప్పగించిన వందలాది ఎకరాలు అన్యాక్రాంతం అయ్యేందుకు స్థానిక అధికార యంత్రాంగం తోడ్పాటు ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పట్టింపు లేకపోవడంతో అంబేద్కర్‌నగర్, బెల్లంపల్లి బస్తీ శంషేర్‌నగర్, రడగం బాలబస్తీ, స్టేషన్ రోడ్డు కాలనీ సుభాష్‌నగర్, పట్టణంలోని వందలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. కబ్జా చేసిన భూములను స్థానిక అధికారులు, అధికార పార్టీ నేతలు, పలు పార్టీలకు చెందిన చోటామోటా నాయకులు లక్షలాది రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పాత బస్టాండ్ సమీపానికి ఆనుకొని ఉన్న సింగరేణి నివాస గృహాల్ని పలువురు పోలీసు శాఖకు చెందిన కానిస్టేబుళ్లు సైతం దర్జాగా ఆక్రమించుకొని నివాసాలు ఏర్పరుచుకున్నారు.
ఒకరిని మించి మరొకరు..
ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో పరిసర ప్రాంతంలో స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు నాలుగు సింగరేణి గృహాలు ఆక్రమించుకున్నారు. పట్టణానికి చెందిన ఓ బడా వ్యాపారి ఒకరు సింగరేణి యాజమాన్యానికి అప్పగించిన సర్వే నంబర్ 170 పీపీ ప్రభుత్వ భూమి, పట్టణం నడిబొడ్డున గల కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న భూమి, బెల్లంపల్లి ప్రధాన రహదారి వెంబడి సుమారు 20 ఎకరాలకు పైగా కొనుగోలు చేసినప్పటికీ స్థానిక అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం పారదర్శకతతో వ్యవహరించి సింగరేణికి అప్పగించిన నివాస గృహాలను, భూములను ఆధీనంలోకి తీసుకొవాలని కోరుతున్నారు. సింగరేణి సంస్థ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన కార్మికుల కోసమైనా వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది.