కొత్త లుక్ తో ఆకట్టుకుంటున్నస్మార్ట్ వాచేస్..
దిశ, శేరిలింగంపల్లి : చేతికి వాచ్ పెట్టుకోవడం చాలామందికి అలవాటు. ఇది వరకటి రోజుల్లో ఇదో స్టేటస్ సింబల్‌గా ఉండేది. చివరికి పెళ్లిళ్లలో కూడా వరుడికి కట్నంగా వాచ్‌ను పెట్టేవారు. చేతి గడియారాలకు అంత ప్రాధాన్యత ఉండేది. ఇందులోనూ చాలా బ్రాండ్స్ ఉండేవి. టైటాన్, హెచ్‌ఏంటీ, సొనాట, హాల్వీన్ ఇలా అనేక రకాల ఇండియన్ వాచ్ కంపెనీలు, విదేశీ బ్రాండ్ కంపెనీలు కొన్నాళ్లు ఓ వెలుగు వెలిగాయి. అందులోనూ మళ్లీ చాలా మోడల్స్ వినియోగదారులను ఆకట్టుకునేవి. మహిళలకు, […]
దిశ, శేరిలింగంపల్లి : చేతికి వాచ్ పెట్టుకోవడం చాలామందికి అలవాటు. ఇది వరకటి రోజుల్లో ఇదో స్టేటస్ సింబల్‌గా ఉండేది. చివరికి పెళ్లిళ్లలో కూడా వరుడికి కట్నంగా వాచ్‌ను పెట్టేవారు. చేతి గడియారాలకు అంత ప్రాధాన్యత ఉండేది. ఇందులోనూ చాలా బ్రాండ్స్ ఉండేవి. టైటాన్, హెచ్‌ఏంటీ, సొనాట, హాల్వీన్ ఇలా అనేక రకాల ఇండియన్ వాచ్ కంపెనీలు, విదేశీ బ్రాండ్ కంపెనీలు కొన్నాళ్లు ఓ వెలుగు వెలిగాయి. అందులోనూ మళ్లీ చాలా మోడల్స్ వినియోగదారులను ఆకట్టుకునేవి. మహిళలకు, పురుషులకు వేరువేరు సైజ్ లు కలర్స్ తో ఆకట్టుకునేవి.
కానీ అలాంటి గడియారాల సేల్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. సెల్ ఫోన్స్ వచ్చాక ప్రసిద్ధ కంపెనీలు కూడా మూతపడ్డాయి. చేతిలో సెల్ ఉంది. అందులోనే సమయం ఉంది, అలారం ఉంది. ఇంకా చేతికి మరో బరువు ఎందుకు అని స్మార్ట్ గా ఆలోచించి చేతిగడియారాలను కొన్నాళ్లు పక్కన పెట్టేశారు చాలామంది. కానీ ఇప్పుడు అవే గడియారాలు టూ స్మార్ట్ గా మరోసారి జనాల చేతి మీద తళుక్కున మెరిసిపోతున్నాయి.
అనేక మార్పులు
గడియారం అనేది మానవ పరిణామ క్రమంలో పెను మార్పునకు నాంది పలికింది అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు సూర్యచంద్రుల గమనాన్ని చూసి సమయాన్ని లెక్కించి పనులు చేసేవారమని పెద్దవాళ్లు చెబుతుంటారు. ఎప్పుడైతే గడియారాలు అందుబాటులోకి వచ్చాయో ప్రతీది మారిపోయింది. కాలం విలువ ఏంటో తెలిసివచ్చింది. అయితే ఈ వాచ్ కూడా ఒకప్పుడు డబ్బున్నవారి చేతికి మణిహారంగానే ఉండేది. కానీ రానూరానూ ఇది చాలామందికి అందుబాటులోకి వచ్చింది. గడియారాల కంపెనీలకు ఆదరణ కూడా బాగా పెరిగింది. ఏకంగా మన కేంద్ర ప్రభుత్వం కూడా కంపెనీలు పెట్టి మరీ వాటిని ఉత్పత్తి చేసిందంటే వాచ్‌లకు ఎంతటి ఆదరణ ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. అయితే అప్పటి వాచీలన్నీ కేవలం సమయ సూచికలుగా మాత్రమే పనిచేశాయి. ఆతర్వాత కొద్ది కాలానికి తేదీలను కూడా చూపించేలా మార్పులు చేశారు.
అంతా స్మార్ట్
సెల్ ఫోన్స్ వచ్చాక వాచ్ ల వినియోగం బాగా తగ్గిపోయింది. అరకొరగానే వాచ్ లు ధరిస్తున్నారు. అయితే ఇది వరకు కేవలం టైమ్, డేట్ మాత్రమే చూపించే వాచ్ లు మారుతున్న కాలానికి అనుగుణంగా, ఇప్పుడు వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా కొత్తపుంతలు తొక్కుతూ కొంగొత్తగా మార్కెట్లోకి వచ్చేశాయి. అవే స్మార్ట్ వాచేస్. ఈ వాచేస్ టూ మచ్ స్మార్ట్. మీరు ఏం చేస్తున్నారో చెప్పేస్తాయి, ఏం చేయాలో అప్ డేట్ చేస్తాయి. ఏ టైమ్ కు ఏం తినాలి, ఏం తాగాలి, మీ హార్ట్ బీట్ ఎలా ఉంది. మీ బీపీ లెవల్ ఏంటీ, మీ హెల్త్ ఎలా ఉందో అని ఇంటి డాక్టర్ లా మీపై ఓ కన్నేసి ఉంచుతాయి. మీరు టెన్షన్ గా ఉన్నారు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది అని ముందే హెచ్చరిస్తాయి. గంట గడిచింది అయినా మీరు ఇంకా వాటర్ తాగలేదు వెంటనే తాగేయండి అంటూ అలర్ట్ చేస్తాయి. వాకింగ్ చేస్తుంటే ఎన్ని అడుగులు నడిచారు. ఎంత క్యాలరీస్ బర్న్ అయ్యాయి అని క్యాలిక్ లేట్ చేస్తుంది ఇలా ప్రతీ అవసరాన్ని గుర్తిస్తుంది. మీకూ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంది. ఇంత ఖచ్చితత్వం ఉంది కాబట్టే ఈమధ్య అందరూ స్మార్ట్ వాచేస్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఎన్నెనో వెరైటీలు
అనేక రకాల కంపెనీల పేరుతో ఈ స్మార్ట్ వాచేస్ మార్కెట్లో లభిస్తున్నాయి. ఇందులో రూ. వెయ్యి నుండి మొదలుకొని లక్ష రూపాయల వరకు రేట్ ఉన్నవి ఉన్నాయి. ఇందులో దేని ప్రత్యేకత దానిదే. కంపెనీ, అందులో ఉన్న సౌలభ్యాలను బట్టి రేట్స్ పెరుగుతున్నాయి. స్మార్ట్ వాచేస్ కొనుగోలు చేస్తున్న వారిలో ఎక్కువమంది హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్లే ఉన్నారని ఇటీవల ఓ సర్వే రిపోర్ట్ వెల్లడించింది. అలాగే యూత్ కూడా స్మార్ట్ వాచేస్ ధరిస్తున్నారు. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడానే లేదు. ఎవరికి నప్పేవి వారికి కలర్ ఫుల్ గా వెరైటీ వెరైటీ వాచేస్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ వాచేస్ లోనే సెల్ ఆపరేట్ చేస్తూ, వ్యాయామం చేస్తూ బిజీబిజీగా ఉంటుంది యూత్. ఒకప్పుడు తాటికాయ సైజ్ లో చేతికి ఏదో తగిలించుకున్నట్టు ఉండే గడియారాలు ఇప్పుడు అందంగా టూ స్మార్ట్ గా న్యూ లుక్ తో అదరగొడుతున్నాయి.