లోయర్ మానేర్‌పై సోలార్ ప్రాజెక్టు.. రంగంలోకి సింగరేణి..!
దిశ, కరీంనగర్ సిటీ : నగర సమీపంలోని దిగువ మానేరు జలాశయం నీటిపై నిర్మించ తలపెట్టిన 250 మెగావాట్ల (డీసీ) ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మాణానికి సింగరేణి సంస్థ సన్నాహాలు చేపట్టింది. ప్లాంటు నిర్మాణానికి అవసరమైన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఏర్పాటు కోసం, హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గురువారం సంస్థ డైరెక్టర్ ఈ అండ్ ఎం డి.సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో ఔత్సాహిక ఏజెన్సీలతో ముందస్తు సమావేశం నిర్వహించారు. ఇందులో టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్, బెంగళూర్‌కు చెందిన […]
దిశ, కరీంనగర్ సిటీ : నగర సమీపంలోని దిగువ మానేరు జలాశయం నీటిపై నిర్మించ తలపెట్టిన 250 మెగావాట్ల (డీసీ) ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మాణానికి సింగరేణి సంస్థ సన్నాహాలు చేపట్టింది. ప్లాంటు నిర్మాణానికి అవసరమైన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఏర్పాటు కోసం, హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గురువారం సంస్థ డైరెక్టర్ ఈ అండ్ ఎం డి.సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో ఔత్సాహిక ఏజెన్సీలతో ముందస్తు సమావేశం నిర్వహించారు. ఇందులో టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్, బెంగళూర్‌కు చెందిన టీయూవీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ముంబాయి సంస్థ టీయూవీ, ఎస్‌యూడీ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్, జెన్సాల్ ఇంజినీరింగ్ అహ్మదాబాద్, ఎస్‌జీయూఆర్‌ఆర్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పూణె సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆయా సంస్థల ప్రతినిధులతో డైరెక్టర్ మాట్లాడుతూ.. సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కోరగా, ఇందుకు సంబంధించిన అనుమతులు త్వరలోనే వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మానేరు డ్యామ్ విస్తీర్ణం 81 చదరపు కిలో మీటర్లు ఉండగా, దీనిలో సింగరేణి సంస్థ కేవలం ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్లాంటును ఏర్పాటు చేయనున్నదని, రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి స్థాయి లిఖితపూర్వక అనుమతి లభించిన వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జనరల్ మేనేజర్ సోలార్ డీవీయస్‌ఎస్ రాజు, ఎస్‌ఓ (డైరెక్టర్ ఈ అండ్ ఎం) శ్రీ విశ్వనాధ రాజు, సోలార్ కన్సల్టెంట్ మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు.