మంత్రి ఇలాఖాలో ‘అనర్హుల’కే డబుల్ ఇండ్లు.. లబోదిబోమంటున్న నిరుపేదలు
దిశ ప్రతినిధి, మెదక్ : డబుల్ బెడ్‌రూం ఇండ్ల మంజూరులో అర్హులకు అన్యాయం జరుగుతోంది. నిరుపేదలకు గూడు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించిన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రం సిద్దిపేటలో పంపిణీ చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరులో మాత్రం అర్హులకు కాకుండా అనర్హులకు ఇండ్లు కేటాయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు ఫైరవీ కారులకు ప్రాధాన్యమివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ బాధితుడు అనర్హులకు ఇండ్లు కేటాయించారని, […]
దిశ ప్రతినిధి, మెదక్ : డబుల్ బెడ్‌రూం ఇండ్ల మంజూరులో అర్హులకు అన్యాయం జరుగుతోంది. నిరుపేదలకు గూడు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించిన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రం సిద్దిపేటలో పంపిణీ చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరులో మాత్రం అర్హులకు కాకుండా అనర్హులకు ఇండ్లు కేటాయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు ఫైరవీ కారులకు ప్రాధాన్యమివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ బాధితుడు అనర్హులకు ఇండ్లు కేటాయించారని, మరోమారు పరిశీలించి అర్హులకు ఇండ్లు కేటాయించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అధికారుల బాగోతం బట్టబయలైంది.
2,460 ఇండ్ల నిర్మాణం..
సిద్దిపేట పట్టణం నర్సాపూర్ శివారులో మంత్రి హరీశ్ రావు చొరవ మేరకు సుమారు 45 ఎకరాల్లో రూ.162 కోట్లతో 2,460 ఇండ్లు నిర్మించారు. ఇండ్ల మంజూరు కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరించగా 11,600 మంది దరఖాస్తు సమర్పించారు. వీరిలో అసలైన లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా కలెక్టర్ ప్రతీవార్డుకు ప్రత్యేకాధికారులను నియమించారు. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. గతేడాది డిసెంబర్ నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పలువురు లాంఛనంగా సామూహిక గృహ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 1,560 మందికి పట్టాలు అందజేయగా.. తాజాగా గాంధీ జయంతి రోజున మరో 350 మందికి మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా ఇండ్ల పట్టాలను అందించి గృహ ప్రవేశాలు చేయంచారు. ఇంకా కొన్ని ఇండ్లు మిగిలి ఉండగా వాటిని సైతం త్వరలో అందిస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
ఫైరవీ కారులకే ప్రాధాన్యం..
సిద్దిపేట పట్టణంలో మంజూరు చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లు అర్హులకు కాకుండా అనర్హులకు అందిస్తున్నారని గతంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. బహిరంగంగా పలువురు విమర్శించారు. అయినా, అధికారులు తమ తీరు మార్చుకోవడం లేదు. పైరవీకారులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల బంధువులు, తమ దగ్గరి వారికే ఇండ్లు కేటాయిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు డబుల్ బెడ్ రూం ఇళ్లు అందుకున్న వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్టు సమాచారం. వారే కాకుండా కొందరు ఇంటి స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకునే సత్తా ఉన్న వారికి కేటాయించారని, మరికొందరికీ ఇండ్లు ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ కేటాయించారని తెలుస్తోంది. అది చూసి అర్హులైన లబ్ధిదారులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాధితుని ఫిర్యాదుతో వెలుగులోకి..
గాంధీ జయంతి రోజున మంత్రి హరీశ్ రావు పంపిణీ చేసిన 350 ఇండ్లలో చాలా మంది అనర్హులకు ఇండ్లు మంజూరయ్యాయని, సిద్దిపేట పట్టణంలోని 26వ వార్డుకు చెందిన నాయకులు అధికారులను తప్పుదోవ పట్టించి 19 మంది అనర్హులకు ఇండ్లు కేటాయించారని పేర్కొంటూ ఓ బాధితుడు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. అనర్హులకు ఉన్న ఇండ్ల ఫోటోలను జత చేస్తూ ఫిర్యాదు చేయడంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారందరూ చాలా ఆర్ధికంగా మంచి స్థాయిలో ఉన్నారు. 26వ వార్డుకు చెందిన తాము ఎరుకుల కులస్తులమని.. మాకు ఇండ్లు లేనందున అనర్హులను తొలగించి మా లాంటి నిరుపేదలకు ఇండ్లు కేటాయించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. విషయం తెలుసుకున్న ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్న వారికే అధికారులు ఇండ్లు కేటాయిస్తున్నారని, ఇది చాలా అన్యాయమని మండిపడ్డారు. దీనిపై త్వరలోనే అన్ని పార్టీల నాయకులు, లబ్ధిదారులను కలుపుకొని పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.