Harish Rao: సిద్దిపేటలో హరీశ్ రావు మాటకు విలువ లేదా.. చెప్పినా వినరా..?

దిశ ప్రతినిధి, మెదక్: కరోనా పేషెంట్ల కోసం ఐసోలేషన్ వార్డులు పెంచాం… గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేక కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేశాం.. ఆస్పత్రిలో ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మీ ఆరోగ్యానికి నాది బాధ్యత అంటూ మంత్రి జిల్లా ఆస్పత్రి పర్యటన సందర్భంగా చెప్పిన మాటలివి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని మరోమారు నిరూపితమైంది. జిల్లా ఆస్పత్రిలో కొవిడ్ రోగులు మరణించిన ఆస్పత్రి సిబ్బంది సమాచారం అందించడం లేదు. మృతుని బంధువులు […]

Update: 2021-05-21 01:55 GMT

దిశ ప్రతినిధి, మెదక్: కరోనా పేషెంట్ల కోసం ఐసోలేషన్ వార్డులు పెంచాం… గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేక కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేశాం.. ఆస్పత్రిలో ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మీ ఆరోగ్యానికి నాది బాధ్యత అంటూ మంత్రి జిల్లా ఆస్పత్రి పర్యటన సందర్భంగా చెప్పిన మాటలివి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని మరోమారు నిరూపితమైంది. జిల్లా ఆస్పత్రిలో కొవిడ్ రోగులు మరణించిన ఆస్పత్రి సిబ్బంది సమాచారం అందించడం లేదు. మృతుని బంధువులు వెళ్లి చూసే సరికి చనిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో రోజు జరుగుతున్నాయని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

సమాచారం లేదు..

సిద్దిపేటకు చెందిన టీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకుడు ఎండీ మునీర్ తల్లికి కరోనా సోకడంతో ఇటీవల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు సరైన వైద్యం అందక మృతి చెందింది. కానీ, ఆ విషయం అక్కడి సిబ్బంది మాత్రం మృతుని బంధువులకు తెలుపలేదు. అమ్మ పై ప్రేమతో తన తల్లి ఎలా వుందో చూసేందుకు వెళ్లగా అప్పటికే కన్నుమూసింది. ఈ విషయాన్ని ఎందుకు తమకు ప్రశ్నించగా.. సిబ్బంది మాట దాట వేసే ప్రయత్నం చేశారు. మృతురాలి పక్కనే మరో వృద్ధుడు కూడా మరణించాడు. ఆ విషయం కూడా వాళ్ళ బంధువులకు తెలియజేయలేదు. మరో వృద్ధురాలికి సెలైన్ (గ్లూకోజ్) ఎక్కిస్తుండగా ఆమె చేతి నుండి తీవ్ర రక్త స్రావం జరుగుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఈ విషయాన్నంత మొబైల్‌లో రికార్డ్ చేస్తుండగా అక్కడే విధులు నిర్వహిస్తున్న నర్స్ వారి మొబైల్ కింద పడేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మారని ప్రభుత్వ ఆస్పత్రి తీరు..

అభివృద్ధికి మారుపేరు ఆర్థిక మంత్రి హరీశ్ రావు అని చెప్పుకునే ఇలాఖలో ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. శవాల తారుమారు, కొవిడ్ బాధితులకు నాణ్యమైన వైద్యం అందడం లేదని, ఇటీవల టీఆర్ఎస్ నాయకుడు తన తండ్రిని కోల్పోయిన ఆవేదనని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా మరో టీఆర్ఎస్ నాయకుడు సైతం తల్లి మరణించిన వార్తపై బోరున విలపిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. బయటకురాని ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. అవి వెలుగులోకి రాకుండా ఆస్పత్రి సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు తప్పా.. రోగులకి నాణ్యమైన వైద్యం అందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

అన్ని వార్డులు పర్యటించలేదు..

మంత్రి హరీశ్ రావు మొన్న జిల్లా ఆస్పత్రిలో పర్యటించారని గొప్పలు చెబుతున్నారు. అందులో వాస్తవం లేదు. మంచిగున్న నాలుగైదు వార్డులు తిరిగిండు. మా అమ్మ ఉన్న వార్డుకి రానే రాలేదు. నేను ఒక టీఆర్ఎస్ నాయకుడిని, మైనారిటీ సెల్ టౌన్ జనరల్ సెక్రటరీని, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా మాకు దగ్గరోళ్లే. మా అమ్మకి అన్నం ఎవరు తినిపియ్యలే. డా. క్రాంతి కుమార్ 60 ఏండ్ల వారికి చూస్తలేం. 45 ఏండ్ల లోపు వారినే చూస్తున్నాం. వారే మాకు ముఖ్యమని చెప్పిండు. అసుంటుది మా అమ్మని ఎందుకు జాయిన్ చేసుకున్నారని ఆస్పత్రి తీరు, మంత్రి హరిశ్ రావు పై మండిపడ్డారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సిద్దపేటలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News