పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కోదండరాం?
దిశ ప్రతినిధి, ఖమ్మం : వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయడం దాదాపు ఖరారైపోయింది. ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించే కాంగ్రెస్ వ్యూహానికి సీపీఐ నుంచి కూడా సూత్రప్రాయంగా మద్దతు లభించినట్లు సమాచారం. కోదండరాం అభ్యర్ధిత్వంపై కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా గ్రూపులకు అతీతంగా కోదండరాం విషయంలో సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. తెలంగాణ జన సమితి పార్టీకి చెందిన మూడు ఉమ్మడి జిల్లాల నేతలు […]
దిశ ప్రతినిధి, ఖమ్మం : వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయడం దాదాపు ఖరారైపోయింది. ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించే కాంగ్రెస్ వ్యూహానికి సీపీఐ నుంచి కూడా సూత్రప్రాయంగా మద్దతు లభించినట్లు సమాచారం. కోదండరాం అభ్యర్ధిత్వంపై కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా గ్రూపులకు అతీతంగా కోదండరాం విషయంలో సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. తెలంగాణ జన సమితి పార్టీకి చెందిన మూడు ఉమ్మడి జిల్లాల నేతలు ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటూ కోదండరాం పేరును ప్రతిపాదించారు. పోటీచేయడంపై స్వయంగా కోదండరాంగానీ, పార్టీగానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ గ్రౌండ్ వర్క్ మాత్రం మొదలైంది. సీపీఎం మాత్రం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోయినా వ్యక్తిగా కోదండరాం పోటీచేస్తే మద్దతు ఇవ్వడానికి సిద్ధమే అనే సంకేతాన్ని పంపినట్లు తెలిసింది. ఒకవేళ సీపీఎం మద్దతు ఇవ్వకపోయినా, కాంగ్రెస్ తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినా పోటీ చేసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదనే పట్టుదలతో కోదండరాం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వారం రోజుల నుంచి మూడు జిల్లాల్లోని పట్టణాల్లో పర్యటిస్తున్నారు. నిరుద్యోగులపట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ఉపాధికల్పనపై బాధ్యతారాహిత్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.
వ్యూహాత్మకంగానే ప్రొఫెసర్‌కు కాంగ్రెస్ మద్దతు!
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశావహులు చాలా మందే ఉన్నప్పటికీ గెలుపుపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. బలమైన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. సరిగ్గా ఈ సమయంలో కోదండరాం పోటీచేసే ఆలోచన తెరపైకి రావడం, మద్దతు తెలిపి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం ప్రస్తతు రాజకీయ పరిస్థితుల్లో ఉత్తమంగా ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చింది. టీఆర్‌ఎస్ గెలుపును అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం కాబట్టి అందుకు ప్రొఫెసర్‌కు మద్దతు ఇవ్వడం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఎలాగూ టీజేఎస్‌తో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు ఉన్నందున ఇప్పుడు ఆ ధర్మానికి అనుగుణంగా ఆయన అభ్యర్థిత్వాన్ని బలపర్చడం రెండు పార్టీలకూ, సంబంధాలకూ మంచిదని అనుకుంటోంది.
గతంలో జరిగిన పొరపాటుకు ఇప్పుడు న్యాయం
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని కోదండరాం భావించారు. కాంగ్రెస్ సైతం అంగీకారం తెలిపింది. చివరి నిముషంలో పొత్తులో భాగంగా ఆ స్థానం కాంగ్రెస్‌కు ఖరారైంది. కోదండరాం పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ ఆయన పోటీకి దూరంగానే ఉండిపోయారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పొన్నాల లక్ష్మయ్య ఓడిపోయారు. కాంగ్రెస్ గందరగోళ వైఖరితోనే ప్రొఫెసర్‌కు అన్యాయం జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర నేతలు పశ్చాత్తాపాన్ని వ్యక్తంచేశారు (బహిరంగంగా కాదు). తప్పిదం జరిగిందని విడివిడిగా కాంగ్రెస్ నేతలు ఒప్పుకున్నారు కూడా. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేయడానికి అవకాశం కల్పించడం ద్వారా చక్కదిద్దవచ్చని భావిస్తోంది.
పార్టీ కేడర్ మొరేల్ కోసం…
కోదండరాంకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేకపోయినప్పటికీ మూడు జిల్లాల నుంచి వచ్చిన వత్తిడి, ప్రస్తావించిన కారణాలతో పునరాలోచించి సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురైన తర్వాత పార్టీని యాక్టివ్‌గా ఉంచకపోతే కేడర్ మొరేల్ దెబ్బతింటుందని కొద్దిమంది పార్టీ నేతలు అభిప్రాయపడడం కూడా ఇందుకు ఒక కారణం. ఏ పార్టీ సహకారం, మద్దతు ఇవ్వకపోయినా పోటీ చేయడం ఖాయమే అనే పట్టుదలతోనే కోదండరాం ఉన్నారని, ఇతర పార్టీల నుంచి వచ్చేది అదనమే అవుతుంది తప్ప సొంతంగా గ్రౌండ్‌ను ప్రిపేర్ చేసుకోవడం అనివార్యమన్న అభిప్రాయంతో ఆయన ఉన్నట్లు తెలిసింది.
కోదండరాంకు కలిసొచ్చే అంశం ఇదే..
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ప్రస్తావించిన నియామకాల అంశంపై ఇప్పటికీ నిరుద్యోగులు ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉండడం కోదండరాంకు బాగా కలిసొస్తున్న అంశమవుతోంది. పట్టభద్రుల నియోజకవర్గం కాబట్టి ఉపాధ్యాయుల అసంతృప్తి కూడా ఒక ప్రధాన విజయావకాశంగా ఉంటుందన్నది ఆయన అభిప్రాయం. ఏయే పాకెట్లలో పార్టీలవారీగా స్వతహాగా ఉండే ఓటు బ్యాంకు, పట్టభద్రుల వయసులు, వారిలో ఉన్న అసంతృప్తి, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత.. వీటన్నింటిపై క్షేత్రస్థాయి నుంచే కోదండరాం అధ్యయనం చేస్తున్నారు. దీనికి తోడు అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కే ధోరణి ఎలా ఉందో కళ్లకు కనిపిస్తున్న సమయంలో ఎమ్మెల్సీగా మండలిలో అడుగు పెట్టడం ద్వారా బాధితుల, ప్రజల గొంతును వినిపించడం తప్పనిసరి అవసరమనేది అన్నింటికన్నా ముఖ్యమైనదిగా కోదండరాం భావిస్తున్నారు.ఈ ఎన్నికల్లో విజయంతో టీజేఎస్ అస్థిత్వం కూడా పెరుగుతుందని ఆయన అభిప్రాయం. సాధ్యమైనంత ఎక్కువమంది విద్యావంతులను నేరుగా కలిసేలా ప్రచార కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు.
టీఆర్ఎస్ బలహీన అంశాలపై ఫోకస్
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా సంప్రదాయ కేడర్ ఉండడం, ప్రజల్లో విశ్వాసం కొనసాగుతుండడం, అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది సీట్లలో వచ్చిన గెలుపు, వామపక్ష పార్టీలకు ఉన్న పట్టు, నల్లగొండ జిల్లాలోనూ ఈ రెండు పార్టీలకు ఉన్న బలం, ఇదే సమయంలో టీఆర్ఎస్‌కు ఈ మూడు జిల్లాల్లో ఉన్న వ్యతిరేకత తదితరాలన్నింటిపై విశ్లేషించిన తర్వాత పోటీ చేయాలనే నిర్ణయం జరిగినట్లు టీజేఎస్ నాయకుడొకరు తెలిపారు. టీఆర్ఎస్ వ్యూహంపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయిగానీ కొద్దికాలం తర్వాత స్పష్టత రానుంది. ఇటీవల టీచర్ల, పట్టభద్రుల ఎన్నికల సమయంలో అనుసరించిన వైఖరి, చాలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఆశాభంగం కావడం.. వీటిని దృష్టిలో పెట్టుకుని నేరుగా అభ్యర్థిని బరిలో పెట్టాలా లేక వెనకనుంచి మద్దతు ఇచ్చే వ్యూహాన్ని అనుసరిద్దామా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోదండరాం నిలబడడం ఖాయమనే అధికార ప్రకటన వచ్చిన తర్వాత ఖచ్చితంగా గెలిచే అభ్యర్థినే నిలబెట్టాలని, లేదంటే సైలెంట్‌గా ఉండడమే బెటర్ అనే అభిప్రాయమూ టీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తోంది.