వారాంతం మరోసారి జీవితకాల గరిష్టాలకు మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల నుంచి గట్టేక్కాయి. వరుసగా రెండు రోజుల నష్టపోయిన మార్కెట్లు భారీ లాభాలతో ఈ వారంతం ముగించాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు ప్రభావంతో పాటు దేశీయంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ వార్తలతో సూచీలు జోరు పెంచాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా దేశీయ ఆర్థికవ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలతో మదుపర్ల సెంటిమెంట్ బలపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. శుక్రవారం నాటి మార్కెట్ల జోరుకు ప్రధానంగా ఐటీ, ఆటో రంగాల షేర్లు దోహదపడటంతో మరోసారి మార్కెట్లు […]

Update: 2021-01-08 06:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల నుంచి గట్టేక్కాయి. వరుసగా రెండు రోజుల నష్టపోయిన మార్కెట్లు భారీ లాభాలతో ఈ వారంతం ముగించాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు ప్రభావంతో పాటు దేశీయంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ వార్తలతో సూచీలు జోరు పెంచాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా దేశీయ ఆర్థికవ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలతో మదుపర్ల సెంటిమెంట్ బలపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. శుక్రవారం నాటి మార్కెట్ల జోరుకు ప్రధానంగా ఐటీ, ఆటో రంగాల షేర్లు దోహదపడటంతో మరోసారి మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను తాకాయని తెలుస్తోంది. నిఫ్టీ సైతం మరోసారి జీవితకాల గరిష్ఠాల వద్ద ముగిసింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 689.19 పాయింట్లు ఎగసి 48,782 వద్ద ముగియగా, నిఫ్టీ 209.90 పాయింట్లు లాభపడి 14,347 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఐటీ అత్యధికంగా 3.6 శాతం పుంజుకోగా, ఆటో, మీడియా, ఫార్మా, రియల్టీ రంగాలు బలపడ్డాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కదలాడగా, మిగిలిన అన్ని షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ముఖ్యంగా మారుతీ సుజుకి, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఆల్ట్రా సిమెంట్, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్, టీసీఎస్, ఓఎన్‌జీసీ, ఎల్అండ్‌టీ, బజాజ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు అత్యధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.26 వద్ద ఉంది.

బీఎస్ఈ కూడా రికార్డుల బాటలో…

ఇటీవల రికార్డు స్థాయిలో బీఎస్ఈ మార్కెట్ విలువ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి మార్కెట్ల జోరుతో బీఎస్ఈ కంపెనీల మార్కెట్ విలువ జీవితకాల గరిష్ఠాలకు చేరుకుంది. భారీ లాభాల నేపథ్యంలో కంపెనీల విలువ రూ. 195.21 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో బీఎస్ఈ చరిత్రలో శుక్వవారం నాటి పెరుగుదల సరికొత్త రికార్డుగా నిలిచింది.

Tags:    

Similar News