దేశీయ మార్కెట్ల రికార్డుల మోత!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డుల మోతను మోగించాయి. గతవారం జీవితకాల గరిష్టాలను తాకిన తర్వాత మళ్లీ అదే రికార్డును సాధించాయి. కొవిడ్-19 వ్యాక్సిన్‌కు సంబంధించి జరుగుతున్న పరీక్షల ఫలితాలు సానుకూలంగా ఉన్నట్టు వార్తలు వస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ ప్రభావంతో దేశీయ సూచీలు కూడా అదే జోరును కొనసాగించాయి. ఉదయం ప్రారంభంలోనే ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో సూచీలు భారీగా ఎగిశాయి. ముఖ్యంగా మెటల్, ఫైనాన్స్ షేర్ల కొనుగోళ్లు […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డుల మోతను మోగించాయి. గతవారం జీవితకాల గరిష్టాలను తాకిన తర్వాత మళ్లీ అదే రికార్డును సాధించాయి. కొవిడ్-19 వ్యాక్సిన్‌కు సంబంధించి జరుగుతున్న పరీక్షల ఫలితాలు సానుకూలంగా ఉన్నట్టు వార్తలు వస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ ప్రభావంతో దేశీయ సూచీలు కూడా అదే జోరును కొనసాగించాయి. ఉదయం ప్రారంభంలోనే ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో సూచీలు భారీగా ఎగిశాయి. ముఖ్యంగా మెటల్, ఫైనాన్స్ షేర్ల కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో మంగళవారం మార్కెట్లు సరికొత్త గరిష్టాలను దక్కించుకున్నాయి. మిడ్ సెషన్ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 44 వేల మార్కును అధిగమించినప్పటికీ ట్రేడర్ల నుంచి లాభాల స్వీకరణ జరగడంతో కొంత తగ్గాయి.
ఆ తర్వాత నిలకడైన ప్రదర్శనతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 314.73 పాయింట్లు ఎగసి 43,952 వద్ద ముగియగా, నిఫ్టీ 93.95 పాయింట్ల లాభంతో 12,874 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్, రియల్టీ, బ్యాంకింగ్ రంగాలు అత్యధికంగా 2 శాతానికిపైగా పుంజుకోగా, ఆటో లాభపడింది. ఫార్మా, మీడియా, ఐటీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, మారుతీ సుజుకి, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు అధిక లాభాల్లో ట్రేడయ్యాయి. ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్, ఓఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.45 వద్ద ఉంది.