మే 15 నాటికి అన్ని జిల్లాలకు విత్తనాలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విత్తన కొరత ఏర్పడకుండా మే 15 నాటికి అన్ని జిల్లాలకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యతపై హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిమాండ్ ఉన్న పంటలను సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని, వానాకాలంలో 90లక్షల ఎకరాల్లో సాగు ప్రణాళికలు ఏర్పాటు చేశామన్నారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విత్తన కొరత ఏర్పడకుండా మే 15 నాటికి అన్ని జిల్లాలకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యతపై హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిమాండ్ ఉన్న పంటలను సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని, వానాకాలంలో 90లక్షల ఎకరాల్లో సాగు ప్రణాళికలు ఏర్పాటు చేశామన్నారు. దేశంలో తొలిసారి క్యూ ఆర్ కోడ్, సీడ్ ట్రేసబిలిటీతో నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. 75లక్షల ఎకరాలకు సరిపడా పత్తి విత్తనాలను సరఫరా చేసేందుకు 57 విత్తన కంపెనీలకు విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశించామన్నారు.
కోటీ 70 లక్షల నాణ్యమైన పత్తి విత్తన ప్యాకెట్లను నిర్ణీత సమయానికి సరఫరా అయ్యేలా చర్యలు చేపడుతామన్నారు. 20 లక్షల ఎకరాలలో కంది సాగుకు అనుగుణంగా రాష్ట్ర, జాతీయ విత్తనాభివృద్ది సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇతర ప్రైవేట్ కంపెనీల ద్వారా 80 వేల క్వింటాళ్ల కంది విత్తనాలను అందుబాటులో ఉంచాలని కోరామన్నారు. వరి సాగుకు బదులు జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న నూనెగింజల సాగు మేలని సూచించారు. నాసిరకం విత్తనాలు అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశామని చెప్పారు. రైతులను మోసం చేసి నాసిరకం లూజు పత్తి విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, విత్తనాభివృద్ది సంస్థ డైరెక్టర్ కేశవులు, జేడీఎ బాలు, డీడీఎ శివప్రసాద్, విత్తన కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.