కేసీఆర్ మాస్టర్ స్కెచ్.. హుజురాబాద్‌లో ‘జర్నలిస్టు’ల ముసుగులో సీక్రెట్ సర్వే..
దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ధీటైన అభ్యర్థి కోసం టీఆర్ఎస్ పార్టీ వేట కొనసాగిస్తూనే ఉంది. ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తరువాత.. అభ్యర్థి కోసం ఆరా తీస్తున్నా ఇప్పటి వరకూ ఈటలకు గట్టిపోటినిచ్చే అభ్యర్థి దొరకనట్టు తెలుస్తోంది. దీంతో, అధిష్టానం క్యాండెట్ కోసం సెర్చింగ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉంది. అత్యంత సీక్రెట్‌గా మూడు రోజుల పాటు ఈ విషయంపై నిఘా వర్గాలను హుజురాబాద్‌లోని పల్లెపల్లెకు ప్రత్యేకంగా పంపించి […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ధీటైన అభ్యర్థి కోసం టీఆర్ఎస్ పార్టీ వేట కొనసాగిస్తూనే ఉంది. ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తరువాత.. అభ్యర్థి కోసం ఆరా తీస్తున్నా ఇప్పటి వరకూ ఈటలకు గట్టిపోటినిచ్చే అభ్యర్థి దొరకనట్టు తెలుస్తోంది. దీంతో, అధిష్టానం క్యాండెట్ కోసం సెర్చింగ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉంది. అత్యంత సీక్రెట్‌గా మూడు రోజుల పాటు ఈ విషయంపై నిఘా వర్గాలను హుజురాబాద్‌లోని పల్లెపల్లెకు ప్రత్యేకంగా పంపించి ముఖ్యమంత్రి కేసీఆర్ నివేదిక తెప్పించుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నివేదికతో కూడా అభ్యర్థి ఎంపిక మళ్లీ మొదటికి వచ్చిందన్న అభిప్రాయంతో టీఆర్ఎస్ అధినేత ఉన్నట్టు సమాచారం.
జర్నలిస్టుల ముసుగులో..
మూడు రోజుల పాటు హుజురాబాద్ నియోజకవర్గంలో ఊరు.. వాడా కలియతిరిగిన నిఘా వర్గాలు జర్నలిస్టుల పేరిట ఓటర్లకు పరిచయమై అభిప్రాయాలు తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇంటలిజెన్స్ వర్గాలను హుజురాబాద్‌కు పంపించి మరీ ఆరా తీశారు. ఇప్పటివరకు అధినేత దృష్టిలో ఉన్న ప్రతీ ఒక్కరి గురించి వేర్వేరు బృందాలు వివరాలు సేకరించాయి. చివరకు ఇతర పార్టీల నాయకుల గురించి కూడా సమగ్ర వివరాలు సేకరించినప్పటికీ ప్రజల్లో సానుకూలత లేనట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయి.
నో అన్న బోయినపల్లి..
హుజురాబాద్ ఎన్నికల్లో మొదట ప్లానింగ్ బోర్డు స్టేట్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేరును అధిష్టానం పరిశీలించినప్పటికీ ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపారు. దీంతో, ధీటైన అభ్యర్థి కోసం ఆరా తీయక తప్పని పరిస్థితి ఏర్పడింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ముద్దసాని పురుషోత్తం రెడ్డి, దివంగత ముద్దసాని దామోదర్ రెడ్డి తనయడు కశ్యప్ రెడ్డితో పాటు పలువురి గురించి ఆరా తీసినప్పటికీ అక్కడి ప్రజల్లో అంతగా సానుకూలత కనిపించలేదు. చివరకు ఇతర పార్టీలకు చెందిన వారి గురించి ఆరా తీసే ప్రయత్నం చేసినా ఈటలను ఢీ కొట్టే పరిస్థితిలో వారు మాత్రం లేరని తేలినట్టు సమాచారం. నిఘా వర్గాలు సేకరించిన గ్రౌండ్ లెవల్ రిపోర్టులో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం నుంచి పోటీ చేసినట్టయితే కొంతమేర సానుకూలంగా ప్రజల్లో ఉన్నట్టు తేలింది. అంతేకాకుండా కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్న కనుమల్ల విజయ పట్ల కూడా హుజురాబాద్ ప్రజలు అనుకూలంగా ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. కానీ, ఈటలపై గన్ షాట్ విజయం సాధించే స్ట్రాంగ్ లీడర్ మాత్రం ఇంతవరకూ దొరకనట్టు సమాచారం.
కడియంపైనా ఆరా..
మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని హుజురాబాద్ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న కోణంలోనూ ఆరా తీశారని తెలిసింది. ఇంటలిజెన్స్ టీమ్స్ కడియంను బరిలో దింపితే ఎలా ఉంటుందన్న వివరాలను ఓటర్ల నుంచి సేకరించినట్టు సమాచారం. పొరుగునే ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరిని బరిలో నిలిపి ఈటల ప్రాభావానికి చెక్ పెట్టే యోచన కూడా అధినేత చేసినట్టుగా స్పష్టం అవుతోంది. తాజాగా దివంగత ముద్దసాని దామోదర్ రెడ్డి సతీమణి మాలతిని బరిలో నిలిపితే ఎలా ఉంటుంది అని కూడా సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపున హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన 1996 బ్యాచ్ సీఐ పింగిలి ప్రశాంత్ రెడ్డి గురించి కూడా ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈటలకు అత్యంత పట్టున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓట్లను చీల్చగలిగే వారైతే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.