ఆశ్చర్యం.. 3 వేల అడుగుల లోతున కొత్త జీవులు
దిశ, ఫీచర్స్ : అంటార్కిటికా ఖండం పూర్తిగా మంచు ప్రదేశం కాగా.. అక్కడి శీతల ఉష్ణోగ్రతలు, సూర్యకాంతి కూడా ప్రవేశించని మంచుదిబ్బల్లో జీవులు వృద్ధి చెందడం అసాధ్యమని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావించారు. అంతేకాదు ఒకవేళ వృద్ధి చెందినా, గడ్డకట్టుకుపోయే అలాంటి ప్రదేశంలో వాటికి ఆహారం లభించక జీవించలేవని అభిప్రాయపడ్డారు. కానీ వారి భావన తప్పని, మిలియన్ సంవత్సరాల్లో వారు ఎన్నడూ ఊహించని విధంగా, అంటార్కిటికాలోని మంచుదిబ్బల్లో 3,000 అడుగుల లోతున తాజాగా రెండు అన్‌నోన్ క్రియేచర్స్‌ను గుర్తించారు […]
దిశ, ఫీచర్స్ : అంటార్కిటికా ఖండం పూర్తిగా మంచు ప్రదేశం కాగా.. అక్కడి శీతల ఉష్ణోగ్రతలు, సూర్యకాంతి కూడా ప్రవేశించని మంచుదిబ్బల్లో జీవులు వృద్ధి చెందడం అసాధ్యమని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు భావించారు. అంతేకాదు ఒకవేళ వృద్ధి చెందినా, గడ్డకట్టుకుపోయే అలాంటి ప్రదేశంలో వాటికి ఆహారం లభించక జీవించలేవని అభిప్రాయపడ్డారు. కానీ వారి భావన తప్పని, మిలియన్ సంవత్సరాల్లో వారు ఎన్నడూ ఊహించని విధంగా, అంటార్కిటికాలోని మంచుదిబ్బల్లో 3,000 అడుగుల లోతున తాజాగా రెండు అన్‌నోన్ క్రియేచర్స్‌ను గుర్తించారు శాస్త్రవేత్తలు.
అంటార్కిటికా వ్యాప్తంగా బోలెడన్ని ఐస్ షెల్ఫ్స్ ఉండగా, అందులో ఫిల్చ్‌నర్-రోన్నే ఐస్ షెల్ఫ్ కూడా ఒకటి. ఇది 579,000 చదరపు మైళ్ళ కన్నా ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉండగా, ఈ మాసివ్ మంచుకొండలు అప్పుడప్పుడు మంచు దిబ్బలుగా విడిపోయి, దూరంగా వెళ్లిపోతుంటాయి. అయితే బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే నిపుణులు సముద్రపు అడుగుభాగం నుంచి నమూనాలను సేకరించడం కోసం ఈ భారీ ఐస్ షీట్‌ను 2,860 అడుగుల వరకు డ్రిల్లింగ్ చేస్తుండగా వారి కెమెరా జారిపడిపోయింది. ఈ క్రమంలో వాళ్లు తమ కెమెరా ఫుటేజీని సమీక్షించినప్పుడు, రెండు కొత్త జీవులను గమనించారు. అవి భూఉపరితలం నుంచి 2,860 అడుగుల లోతున, నీటి దిగువన 1,549 అడుగుల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. వాటిలో ఒకజీవి పొడవైన కాండాలతో ఉండగా, మరొకటి స్పాంజి లాంటి జీవిలా ఉందన్నారు.
అయితే మంచు పలకల అడుగున జీవులను కనుగొనడం ఇదేం మొదటిసారి కాదు. ఇదివరకు జెల్లీ ఫిష్, పురుగులు వంటి జీవులను గుర్తించారు. కానీ అసలు కాంతి జాడలేని ప్రదేశంలో జీవులు బతకడం అరుదు. ‘ఈ మంచు పలకల కింద ఉన్న ప్రాంతం బహుశా భూమిపై అతి తక్కువగా తెలిసిన ఆవాసాల్లో ఒకటి. స్పాంజ్ వంటి ఈ రకమైన జంతువులు అక్కడ జీవిస్తాయని మేం ఊహించలేదు. ఈ ఆవిష్కరణ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ జీవులు కొత్త జాతులా? కాదా? అని తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. అంతేకాదు అవి అక్కడకు ఎలా వచ్చాయి? అవి ఏం తింటున్నాయి? ఎంతకాలం నుంచి జీవిస్తున్నాయి? వంటి ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడం మా ముందున్న సవాల్’ అని ఆవిష్కరణ చేసిన శాస్త్రవేత్తల్లో ఒకరైన డాక్టర్ హువ్ గ్రిఫిత్ తెలిపారు.