డెహ్రాడూన్‌లో మరో ‘చిప్కో’ ఉద్యమం
దిశ, వెబ్‌డెస్క్ : అభివృద్ధి పేరుతో ఇప్పటికే ఎన్నో చెట్లను నేలమట్టం చేశాం. అడవులు, పంట పొలాలను సైతం ఫ్యాక్టరీలు, నివాస స్థలాల కోసం కనుమరుగు చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ ప్రభుత్వం డెహ్రాడూన్ జాలా గ్రాంట్ ఎయిర్‌పోర్ట్‌ను విస్తరించేందుకు 243 ఎకరాల థానో ఫారెస్ట్ ల్యాండ్‌ను ‘ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా’కు ఇచ్చింది. నేషనల్ వైల్డ్‌లైఫ్ బోర్డ్ అప్రూవల్ వస్తే.. ఇక ఆ అరణ్యంలోని చెట్లన్నీ చరిత్రలో కలిసిపోనున్నాయి. అయితే ఆ చెట్ల కోసం స్థానిక […]
దిశ, వెబ్‌డెస్క్ : అభివృద్ధి పేరుతో ఇప్పటికే ఎన్నో చెట్లను నేలమట్టం చేశాం. అడవులు, పంట పొలాలను సైతం ఫ్యాక్టరీలు, నివాస స్థలాల కోసం కనుమరుగు చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ ప్రభుత్వం డెహ్రాడూన్ జాలా గ్రాంట్ ఎయిర్‌పోర్ట్‌ను విస్తరించేందుకు 243 ఎకరాల థానో ఫారెస్ట్ ల్యాండ్‌ను ‘ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా’కు ఇచ్చింది. నేషనల్ వైల్డ్‌లైఫ్ బోర్డ్ అప్రూవల్ వస్తే.. ఇక ఆ అరణ్యంలోని చెట్లన్నీ చరిత్రలో కలిసిపోనున్నాయి. అయితే ఆ చెట్ల కోసం స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ‘చిప్కో ఉద్యమాన్ని’ నడిపిస్తున్నారు.
హిమాలయాలకు అతి చేరువలో, 820 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ‘రాజాజీ నేషనల్ పార్క్’ను 1983లో ప్రారంభించారు. ఇది డెహ్రాడూన్, హరిద్వార్, పౌరి గాహర్వాల్ జిల్లాలకు సమీపంలో ఉంటుంది. చిల్ల, మొత్తిచూర్, రాజాజీ అనే మూడు సంరక్షణ కేంద్రాలను కలిపి ‘రాజాజీ ఉద్యానవనం’గా ఏర్పాటు చేశారు. 15 ఏప్రిల్, 2015న పులుల సంరక్షణ కేంద్రంగానూ గుర్తించబడిన ఈ ఉద్యానవనం గుండా ‘గంగా, సాంగ్’ అనే నదులు కూడా ప్రవహిస్తున్నాయి. ఈ పార్కులో పది కిలోమీటర్ల మేర ‘ఎకో సెన్సిటివ్ జోన్’ కూడా ఉంది. ఇంత జీవవైవిధ్యమున్న ఈ పార్క్‌లోని 10 వేల చెట్లకు ఇప్పుడు ప్రమాదం వచ్చి పడింది. నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు.. ఎయిర్‌పోర్ట్ విస్తరణకు అనుమతినిస్తే, ఇక ఆ చెట్లన్నీ భూమిలో కలిసిపోవాల్సిందే. అందుకే పర్యావరణవేత్తలు, సోషల్ యాక్టివిస్ట్‌లు, స్థానికులు దీన్ని తప్పుపడుతున్నారు. చెట్లను కట్ చేస్తే.. పార్క్‌లోని జీవవైవిధ్యం దెబ్బతింటుందని, ఏనుగులు, పులుల మనుగడకు ప్రమాదం వాటిల్లుతుందని నినదిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌కు కేటాయించిన భూభాగం రాజాజీలోని థానో పార్క్ పరిధిలో ఉంది.
నేలకొరిగే చెట్లను రక్షించడానికి స్థానికులంతా కలిసి మరో చిప్కో ఉద్యమానికి తెరలేపారు. గతంలో ఎలా అయితే చెట్లను నరకబోతుంటే, తమ ప్రాణాలను అడ్డుపెట్టి చెట్లను హత్తుకుని నిరసన తెలియజేశారో.. ఇప్పుడు కూడా డెహ్రాడూన్‌లోని స్థానికులు కూడా అదే బాటను ఎంచుకున్నారు. ప్రజలంతా కలిసి చెట్లను హత్తుకుని నినాదాలు చేస్తున్నారు. చెట్లను కాపాడేందుకు వాటికి రక్ష సూత్రాలు కడుతున్నారు. ‘సేవ్ థానో, సేవ్ గ్రీన్.. డోంట్ కట్ మీ’ అంటూ చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ప్లకార్డులు పట్టుకుని ఆ చెట్ల ముందర తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇటీవలే డెహ్రాడూన్ ఎయిర్‌పోర్ట్ ఎదుట కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. వెంటనే తమ చర్యలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో కూడా ‘సేవ్ థానో’ హాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాలను కూడా తమ నిరసనకు ఉపయోగించుకుంటున్నారు.
ఎకో సిస్టమ్‌ను మనకు మనమే నాశనం చేసుకుంటున్నాం. ఇలా చేయడం మానవాళికి ఎంతో ప్రమాదకరం. అడవులే మన మనుగడకు ఆధారం. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు మేం మా నిరసన తెలియజేస్తాం’ అని 12 ఏళ్ల గ్లోబల్ క్లైమేట్ యాక్టివిస్ట్ రిధిమా పాండే అన్నారు.