జానారెడ్డి చుట్టూ సాగర్ రాజకీయం

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై దృష్టి పెట్టాయి. సిట్టింగ్​ స్థానాన్ని నిలబెట్టుకోవాలని టీఆర్​ఎస్​ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా… ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ఉవ్విళూరుతోంది. కాంగ్రెస్​కు తమ కోటాగా భావిస్తూ గెలుపు కోసం తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ జానారెడ్డి వైపు చూస్తున్నాయి. టీఆర్​ఎస్​ కూడా జానారెడ్డికి ఆఫర్​ ఇచ్చింది. గులాబీ కండువా కప్పుకోవాలని రాయబారం పంపింది. మరోవైపు బీజేపీ కూడా అదే పనిలో […]

Update: 2020-12-09 09:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై దృష్టి పెట్టాయి. సిట్టింగ్​ స్థానాన్ని నిలబెట్టుకోవాలని టీఆర్​ఎస్​ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా… ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ఉవ్విళూరుతోంది. కాంగ్రెస్​కు తమ కోటాగా భావిస్తూ గెలుపు కోసం తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ జానారెడ్డి వైపు చూస్తున్నాయి. టీఆర్​ఎస్​ కూడా జానారెడ్డికి ఆఫర్​ ఇచ్చింది. గులాబీ కండువా కప్పుకోవాలని రాయబారం పంపింది. మరోవైపు బీజేపీ కూడా అదే పనిలో ఉంది. బీజేపీ నుంచి జానారెడ్డితో పాటు ఆయన కొడుకును కూడా పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్​ కూడా తమ నేతను పదిలంగా ఉంచుకోవాలని భావిస్తోంది. దీంతో సాగర్​ రాజకీయం మొత్తం జానారెడ్డి చుట్టూ తిరుగుతోంది.

సర్వేల్లో పార్టీలు

కేంద్ర, రాష్ట్రాల్లోని అధికార పార్టీలు నాగార్జున సాగర్​లో సర్వేలు చేస్తున్నాయి. ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమవుతోంది. మార్చి వరకు షెడ్యూల్​ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే రంగంలోకి దిగాయి. టీఆర్​ఎస్​ పార్టీ సాగర్​ సెగ్మెంట్​పై వరాలు కురిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో దెబ్బతినడంతో ఈసారి ఆ సీన్​ రిపీట్​ కావద్దంటూ వ్యూహరచన చేస్తోంది. స్వయంగా సీఎం కేసీఆర్​ రంగంలోకి దిగారు. సాగర్​కు నిధుల విడుదల, కొత్త స్కీంలు మొదలెట్టారు. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ ప్రధాన బాధ్యత తీసుకుని పని చేయాలనుకుంటున్నారు. ట్రబుల్​ షూటర్​ హరీష్​రావు దుబ్బాకలో విఫలం కావడంతో సాగర్​పై సీఎం దృష్టి పెట్టారు. ఇక్కడ కూడా ఓడితే మున్ముందు రాజకీయంగా చాలా ఇబ్బందులు వస్తాయనే ఆందోళన నెలకొంది. దీంతో ఇప్పటికే సర్వేలు మొదలుపెట్టారు.

అభ్యర్థులెవ్వరో..?

నోముల కుటుంబానికి ఇక్కడ టికెట్​ ఇచ్చే అవకాశాలు లేనట్టేనని చెప్పుతున్నారు. అటువైపు నోముల కుటుంబం కూడా రాజకీయాలపై ఇష్టంగా లేదు. దీంతో కొత్తవారి కోసం వెతుకుతున్నారు. మంత్రి జగదీష్​రెడ్డి అనుచరుడు ఎంసీ కోటిరెడ్డికి టికెట్​ వస్తుందని భావిస్తున్నారు. కానీ సీఎం కేసీఆర్​ మాత్రం అభ్యర్థి కోసం పలు రకాల అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి ఛైర్మన్​ పల్లా రాజేశ్వర్​రెడ్డి కూడా తెరపైకి వచ్చారు. ఉమ్మడి వరంగల్​ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసేందుకు వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో తనకు నాగార్జున సాగర్​ నుంచి అవకాశం కల్పించాలని ఇప్పటికే సీఎం దగ్గర చెప్పుకున్నారు. కానీ గులాబీ బాస్​ ఇంకా ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీఆర్​ఎస్​ జానారెడ్డికి వల వేస్తోంది. వాస్తవంగా జానారెడ్డిపై టీఆర్​ఎస్​ అధిష్టానికి సదాభిప్రాయం ఉంది. గత అసెంబ్లీలో సీఎల్పీగా ఉన్న జానారెడ్డితో టీఆర్​ఎస్​కు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. జానారెడ్డిని పలుమార్లు నేరుగా… బహిరంగంగానే సీఎం కేసీఆర్​ పొగుడుతూ ఆకాశానికెత్తుకున్నారు. ఈ సమయంలో జానారెడ్డిని గులాబీ దళంలోకి రావాలంటూ రాయబారం పంపించారు. సాగర్​ టికెట్​ ఇస్తామని, గెలుపు బాధ్యతలను కూడా చూసుకుంటామని హామీ ఇస్తున్నారు.

ఇంకా జానారెడ్డి నుంచి సమాధానం రావడం లేదు…

మరోవైపు బీజేపీ కూడా సాగర్​ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దుబ్బాక ఉప ఎన్నిక విజయం, జీహెచ్​ఎంసీలో మెజార్టీ స్థానాలు దక్కినే నేపథ్యంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అధికార టీఆర్​ఎస్​, ప్రతిపక్ష కాంగ్రెస్​ నుంచి ఇప్పటికే నేతలు బీజేపీలోకి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్​కు వచ్చిన ఉప ఎన్నికను కమలదళం బోనస్​గా తీసుకుంటోంది. కచ్చితంగా గెలువాలనే లక్ష్యంతో పని చేస్తోంది. దీంతో గ్రామస్థాయిలో సర్వే చేస్తోంది. అయితే ఇప్పటికే జానారెడ్డిని పార్టీలోకి రావాలంటూ బీజేపీ ఆహ్వానించింది. జానారెడ్డితో పాటు ఆయన తనయున్ని కూడా పార్టీలోకి రావాలంటూ సూచించారు. కానీ జానారెడ్డి నుంచి ఇంకా రిప్లై రావడం లేదు. కాంగ్రెస్​ కూడా సాగర్​పై ఆశలు పెట్టుకుంది. జానారెడ్డి స్థానం కావడం, గతంలో కాంగ్రెస్​కు పెట్టనికోటలా ఉంటే సాగర్​ సెగ్మెంట్​లో ఈసారి జానారెడ్డినే మళ్లీ పోటీకి దింపి ఆ స్థానాన్ని తమ కోటాలో వేసుకోవాలని హస్తం నేతలు భావిస్తున్నారు. అయితే జానారెడ్డికి ఆయా పార్టీలు గాలం వేస్తున్న దరమిలా… ఆయన్ను పార్టీలోనే కాపాడుకునేందుకు అధిష్టానాన్ని రంగంలోకి దింపింది.

బీసీ అభ్యర్థి వైపు బీజేపీ

జానారెడ్డితో ఇప్పటికే సంప్రదింపులు చేసిన బీజేపీ… ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతుకుతోంది. సాగర్​ జనరల్​ స్థానమైనా… బీసీ వర్గానికి చెందిన నోములను బరిలోకి దింపి విజయం సాధించారు. అయితే ఇక్కడ బీసీ వర్గాలు ఒక్కతాటిపై ఉండి గెలిపించుకున్నాయని ప్రచారం. ఈ నేపథ్యంలో బీజేపీ బీసీ అభ్యర్థిపై కూడా సర్వే చేస్తోంది. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాజయ్య యాదవ్​ పేరును కూడా పరిశీలిస్తోంది. ఇటీవల మాజీ ఎంపీ గరికపాటి మోహన్​రావుతో కలిసి రాజయ్య యాదవ్​తో బీజేపీ రాష్ట్ర నాయకత్వంల చర్చలు జరిపింది. అయితే ఇప్పటికే జానారెడ్డి అంశం తేలకపోవడంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

జానారెడ్డి మౌనం ఎప్పటిదాకా..?

ప్రస్తుతం సాగర్​ రాజకీయమంతా జానారెడ్డి చుట్టూ తిరుగుతోంది. మూడు పార్టీలు జానారెడ్డిపైనే మొదటి ప్రాధాన్యతను పెట్టాయి. టీఆర్​ఎస్​కు జానారెడ్డితో సత్సంబంధాలు కొనసాగుతుండగా… రెండో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ కూడా ఆయనకు పెద్దపీట వేస్తోంది. ఎలాగూ కాంగ్రెస్​లో జానారెడ్డికి ప్రాధాన్యత ఉండనే ఉంది. ప్రస్తుత పరిణామాల్లో జానారెడ్డి మౌనం వహించారు. ఎవరికీ ఎలాంటి సమాధానం చెప్పలేక దాట వేస్తున్నారు. టీఆర్​ఎస్​కు వెళ్తే రాజకీయంగా ఎదురయ్యే పరిణామాలపై కొంత భయం కూడా వ్యక్తమవుతోంది. టీఆర్​ఎస్​లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, గతంలో సీనియర్​ నేతలుగా ఉండి, ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యతలో ఉన్నారనే అంశాలను జానారెడ్డి బేరీజు వేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీలో కూడా అంతే. అయితే ఒక సామాజికవర్గం బీజేపీలో బలంగా తయారవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరితే ఎలా ఉంటుందనేది అంచనాకు రాలేకపోతున్నారు.

ఇక కాంగ్రెస్​లో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇప్పటికే చాలా మంది పార్టీని వదులుతుండటంతో ఆందోళన పరిస్థితులే ఉన్నాయి. అయితే టీపీసీసీ చీఫ్​ మార్పు తర్వాత తనను ఎలా ట్రీట్​ చేస్తారనే అనుమానం కూడా కొనసాగుతోంది. వాస్తవంగా జానారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. తన రాజకీయ వారసునిగా ఆయన తనయున్ని పరిచయం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్​లో వెలుగు వెలిగిన జానారెడ్డి… ఎన్నికలు, మంత్రులుగా కొనసాగిన వారిలో ప్రత్యేక రికార్డును సొంతం చేసుకున్న జానారెడ్డి తన వారసునికి ఎలాంటి ప్రియార్టీ వస్తుందేమోననే బాధ కూడా కలిచివేస్తోంది. తన వారసుని రాజకీయ భవిష్యత్తును అంచనా వేసుకునే జానారెడ్డి ఏ పార్టీ కండువా కప్పుకోవాలనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని ఆయన సన్నిహితులు చెప్పుతున్నారు.

Tags:    

Similar News