తెలంగాణకు రైతు రుణమాఫీ పెనుభారం..!

“రుణమాఫీ హామీ ప్రజల ‘క్రెడిట్ కల్చర్’నే మారుస్తోంది. ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టడానికి కారణమవుతోంది. క్రమం తప్పకుండా చెల్లించేవారి ఆలోచననూ మార్చేస్తోంది. కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించడానికి దారితీస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని డిమాండ్లు వచ్చే అవకాశాలకు వీలు కల్పిస్తోంది” – 15వ ఆర్థిక సంఘం ”రుణమాఫీ పథకం రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై పెను భారాన్ని వేస్తోంది. తెలంగాణ 2014లో ప్రకటించిన రుణమాఫీ పథకం రాష్ట్ర జీఎస్‌డీపీలో దాదాపు 3.4%గా ఉంది. రూ. 17 వేల కోట్లను […]

Update: 2021-02-06 13:02 GMT

“రుణమాఫీ హామీ ప్రజల ‘క్రెడిట్ కల్చర్’నే మారుస్తోంది. ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టడానికి కారణమవుతోంది. క్రమం తప్పకుండా చెల్లించేవారి ఆలోచననూ మార్చేస్తోంది. కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించడానికి దారితీస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని డిమాండ్లు వచ్చే అవకాశాలకు వీలు కల్పిస్తోంది” – 15వ ఆర్థిక సంఘం

”రుణమాఫీ పథకం రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై పెను భారాన్ని వేస్తోంది. తెలంగాణ 2014లో ప్రకటించిన రుణమాఫీ పథకం రాష్ట్ర జీఎస్‌డీపీలో దాదాపు 3.4%గా ఉంది. రూ. 17 వేల కోట్లను ఖర్చు చేసినట్లు రాష్ట్రం చెప్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయినప్పుడు, వరుస కరువు ఉన్నప్పుడు మాత్రమే రుణమాఫీ హామీ సమంజసం” – రిజర్వుబ్యాంకు

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం రకరకాల హామీలు ఇస్తుంటాయి. చివరికి అవే ఆ రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు సవాలు మారుతున్నాయి. తెలంగాణలో సైతం రైతులకు ఇచ్చిన ‘రుణమాఫీ’ పథకం అలాంటిదేనని రిజర్వు బ్యాంకు, 15వ ఆర్థిక సంఘం పేర్కొన్నాయి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు రుణమాఫీ పథకం పెనుభారంగా మారిందని, ఇది చాలా లోతుగా ఆలోచించి విచారించాల్సిన అంశమని 15వ ఆర్థిక సంఘం తన తాజా నివేదికలో పేర్కొంది. గతంలో కేంద్ర ప్రభుత్వాలు సైతం ఇలాంటి హామీలు ఇచ్చినా 1990, 2008 తర్వాత రుణమాఫీ హామీలు ఇవ్వలేదని పేర్కొంది.

కానీ, తెలంగాణలో మాత్రం 2014, 2018 ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఉందని, దీని అమలు ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారిందని వ్యాఖ్యానించింది. రుణమాఫీ మాత్రమే కాక అనేక రకాల సబ్సిడీ పథకాలు కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా మారాయని, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని ఆర్థిక సంఘం పేర్కొంది. రుణమాఫీతో పాటు డిస్కంలకు అమలుచేస్తున్న ‘ఉదయ్’ స్కీమ్, వేతన సవరణ సిఫారసులు రాష్ట్రాలకు ఆర్థికంగా భారమైనవిగా మారుతున్నాయని, ఇవి ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంది. ప్రతీ ఐదేళ్ళకోసారి రుణమాఫీ పథకం అమలుచేయడం ప్రజల ‘క్రెడిట్ కల్చర్’ను మార్చేస్తోందని, ఉద్దేశపూర్వకంగా రుణాలను కట్టాల్సిన అవసరం లేదనే అలవాటుకు కారణమవుతోందని పేర్కొంది.

హామీలకు అనివార్యంగా నిధులు

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అనివార్యంగా రాష్ట్రాలు నిధులను కేటాయించాల్సి రావడంతో కాపిటల్ ఎక్స్‌పెండిచర్‌లో కోతలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని 15వ ఆర్థిక సంఘం అభిప్రాయపడింది. రాష్ట్రాల లోటు జీఎస్‌డీపీలో మూడు శాతం కంటే మించొద్దనే నిబంధనతో ఆ ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి వస్తోందని, 3.3% నుంచి 2.5%కి తగ్గినట్లు ఉదహరించింది. కేవలం రుణమాఫీ మాత్రమే కాక ఏటేటా వివిధ సంక్షేమ పథకాలకు పెంచుతున్న సబ్సిడీలు కూడా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతోందని నొక్కిచెప్పింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే కాక చాలా రాష్ట్రాలు రుణమాఫీ హామీ ఇచ్చాయని గుర్తుచేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ పథకంతో ఖజానాపై సుమారు రూ. 24 వేల కోట్ల భారం పడిందని, (రాష్ట్ర జీఎస్‌డీపీలో 4.6%), తెలంగాణలో రూ. 17 వేల కోట్ల మేర (రాష్ట్ర జీఎస్‌డీపీలో 3.4%) ఉందని ఉదహరించింది. తమిళనాడులో 2016లో ఇచ్చిన రుణమాఫీ హామీ ద్వారా రూ. 6,000 కోట్ల మేర భారం పడిందని, ఆ రాష్ట్ర జీఎస్‌డీపీలో ఇది కేవలం 0.5% మాత్రమేనని వివరించింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో 2017 ఎన్నికల సందర్భంగా పార్టీలు రుణమాఫీ హామీ ఇచ్చాయని గుర్తుచేసింది. దీని కారణంగా మహారాష్ట్రలో రూ. 34 వేల కోట్లు (జీఎస్‌డీపీలో 1.4%), ఉత్తరప్రదేశ్‌లో రూ. 36 వేల కోట్లు (జీఎస్‌డీపీలో 2.7%), పంజాబ్‌లో రూ. 10 వేల కోట్లు (జీఎస్‌డీపీలో 2.1%) భారం పడిందని పేర్కొంది.

అన్ని రాష్ట్రాలదీ అదే దారి

2019 ఎన్నికల సందర్భంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కూడా రుణమాఫీ హామీ ఇచ్చాయని, ఈ కారణంగా రాజస్థాన్‌లో రూ. 18 వేల కోట్లు (జీఎస్‌డీపీలో 1.9%), మధ్యప్రదేశ్‌లో రూ. 36,500 కోట్లు ((జీఎస్‌డీపీలో 4.5%), చత్తీస్‌గఢ్‌లో రూ. 6,100 కోట్లు (జీఎస్‌డీపీలో 1.7%) భారం పడినట్లు పేర్కొంది. కర్నాటకలో 2017-18లో రూ. 18,000 కోట్ల మేర రుణమాఫీ హామీ ఇస్తే 2018-19 నాటికి అది రూ. 44 వేల కోట్లకు (జీఎస్‌డీపీలో 3.4%) పెరిగిందని ఆర్‌బీఐ రిపోర్టును 15వ ఆర్థిక సంఘం ఉదహరించింది. అయితే ఆయా రాష్ట్రాలు రుణమాఫీ అమలు చేసే క్రమంలో విడుదల చేసిన నిధులకు, ఫైనాన్స్ అకౌంట్స్ వివరాలకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోందని, ఇందుకు కారణం ఆయా రాష్ట్రాలు రుణాలతోపాటు వాటిపైన పడిన వడ్డీని కూడా చెల్లించడం కారణం కావచ్చని అభిప్రాయపడింది.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరులో ఈ పథకం అమలవుతోందని పేర్కొంది. 2014-15 నుంచి 2019-20 మధ్య కాలంలో 13 రాష్ట్రాలు రుణమాఫీ హామీ ఇవ్వనేలేదని, ఏడు రాష్ట్రాలు ఇచ్చిన హామీల అమలుకు చేసిన ఖర్చులో రూ. 79 వేల కోట్లకు సంబంధించిన వివరాలను ఆయా రాష్ట్రాల ఫైనాన్స్ కమిషన్‌లు సమర్పించినట్లు 15వ ఆర్థిక సంఘం పేర్కొంది. అధికారంలోకి రావడం కోసం పార్టీలు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన తర్వాత అమలు చేయడానికి నానా పాట్లు పడాల్సి వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఇప్పటికి పాక్షికంగానే అమలైంది. పాతిక వేల లోపు రుణాలు ఉన్నవారికి మాత్రమే మాఫీ అయింది. ఆర్థిక వనరుల సమీకరణలో తలెత్తిన ఇబ్బందులే వాటిని పూర్తిస్థాయిలో అమలుచేయడానికి వీలు కల్పించలేకపోతున్నాయి.

Tags:    

Similar News