నీటిలోనే నిజామాబాద్ రైల్వేస్టేషన్.. రూ.60 లక్షలు డ్రైనేజీ పాలేనా..?

దిశప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణం మెట్రో నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతుంది. చుట్టు పక్కల నగరం విస్తరిస్తుంది. జనాభా పెరిగిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఇది పాలకులు పదే పదే చెప్పిన మాటలు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. వానా కాలంలో కేవలం రెండు, మూడు సెంటి మీటర్ల వర్ష పాతానికే నగరం ముంపునకు గురవుతుంది. నగరం ఎగువ భాగంలోని చెరువులు నిండలేదు. నిజాంసాగర్ కాలువ పొంగిపొర్లకపోయినా నగరం […]

Update: 2021-07-15 07:26 GMT

దిశప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణం మెట్రో నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతుంది. చుట్టు పక్కల నగరం విస్తరిస్తుంది. జనాభా పెరిగిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఇది పాలకులు పదే పదే చెప్పిన మాటలు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. వానా కాలంలో కేవలం రెండు, మూడు సెంటి మీటర్ల వర్ష పాతానికే నగరం ముంపునకు గురవుతుంది. నగరం ఎగువ భాగంలోని చెరువులు నిండలేదు. నిజాంసాగర్ కాలువ పొంగిపొర్లకపోయినా నగరం మాత్రం చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కాలువలను మరిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు నీట మునిగి తేరుకోవడం లేదు. ప్రతీఏడాది వర్షాకాలంలో రూ.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నా ముంపు బాధ మాత్రం తప్పడం లేదు. వర్షాకాలంలో మురికి కాలువలు పెద్ద డ్రైనేజీల పూడిక తొలగింపునకు రూ.60 లక్షలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. బుధ, గురువారాల్లో కురిసిన వర్షానికి నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.

నిజామాబాద్ నగరంలో ఈ ఏడాది రూ.60 లక్షలు ఖర్చు చేశారు. అయినా డ్రైనేజీ సిస్టమ్ సరిగా పనిచేయడం లేదు. వరద ప్రవాహంతో డ్రైనేజీలు పొంగిపోర్లుతున్నాయి. వర్షాకాలం ఆరంభానికి ముందే ఈ టెండర్లను పిలిచి డ్రైనేజీల పూడికతీత పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు గాను రూ.60 లక్షలు కేటాయించారు. జోన్‌కు రూ.10 లక్షల చొప్పున ఆరు జోన్లలో డ్రైనేజీ పూడికతీత పనులు చేపట్టారు. అయితే, అవి పూర్తి అయ్యాయో లేదో అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా జిల్లాలో జోరుగా వర్షాలు కురిసాయి. బుధవారం నిజామాబాద్ సౌత్‌లో 20.7 మిమీ, నార్త్‌లో 27.0 మిమీ, రూరల్‌లో 27.3 మిమీ, గురువారం నార్త్‌లో 37.3 మిమీ, సౌత్‌లో 24.8, రూరల్‌లో 13.8 మిమీ వర్షపాతం నమోదైంది. ఈ కాస్త వర్షానికే నగరం మొత్తం ముంపు ప్రాంతంగా కనిపించింది. నిజామాబాద్ నార్త్ ఎమ్మార్వో కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రెండు రోజులుగా నీట మునిగే ఉంది. నగరంలోని బోధన్ రోడ్డులో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రహదారి కనిపించడం లేదు. నగరంలోని గౌతంనగర్‌లో ఇండ్లలోకి నీరు ప్రవేశించింది. రోటరి నగర్ ముంపులో తేలియాడింది. రైల్వే స్టేషన్ ప్రాంతం కూడా చెరువును తలపించింది. నిజాంకాలనీ, ఆటోనగర్, సాయినగర్ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు.

అయితే, ప్రతిఏడాది పూడిక తొలగింపు కార్యక్రమాలను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నా అవి అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పెద్ద డ్రైనేజీలపై కబ్జాలు ఉండటంతో తూతూ మంత్రంగా తొలగించడం, జేసీబీలతో చేయించాల్సిన పూడిక తొలగింపును యంత్రాలు లేకుండానే చేయిస్తున్నారనే విమర్శలున్నాయి. నగరంలో ఈ పరిస్థితి ప్రతీసారి ఉంటుందని, కేవలం పూడికతీయడం పేరిట లక్షలాది రూపాయల ప్రజాధనం నేతల జేబుల్లోకి వెళ్తుంది. కానీ ప్రజలను మాత్రం వర్షాకాలం ఇబ్బందుల నుంచి గట్టెక్కించలేకపోతున్నారు. ఈ వ్యవహరం ప్రతీ ఏడాది జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై బల్ధియా అధికారులు నోరు మెదపడం లేదు.నిజామాబాద్ మున్సిపల్ ఇంజనీర్ హరికిషోర్ 6 జోన్ల పరిధిలో దాదాపు పనులు పూర్తయ్యాయని తెలిపారు. కానీ ముంపుపై మాత్రం స్పందించలేదు. పూర్తి వివరాలు పిఓ వద్ద ఉంటాయని తెలుపడం గమనార్హం.

Tags:    

Similar News