సర్కార్ బడుల్లో కొరలు చాస్తోన్న కరోనా
దిశ, తెలంగాణ బ్యూరో/దిశ ప్రతినిధి, హైదరాబాద్ /దిశ, బెల్లంపల్లి: కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజుకొక జిల్లాలోని విద్యాసంస్థలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో విద్యార్థులకు వైరస్ అంటుకోవడంతో భయాందోళన వ్యక్తమవుతోంది. బారినపడుతున్నవారు 15 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. రంగారెడ్డి, మంచిర్యాల, సంగారెడ్డి, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ స్కూళ్లలో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదు జిల్లాల్లోని 8 ప్రభుత్వ స్కూళ్లలో 112 మంది విద్యార్థులతో పాటు ముగ్గురు టీచర్లకు కరోనా […]
దిశ, తెలంగాణ బ్యూరో/దిశ ప్రతినిధి, హైదరాబాద్ /దిశ, బెల్లంపల్లి: కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజుకొక జిల్లాలోని విద్యాసంస్థలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో విద్యార్థులకు వైరస్ అంటుకోవడంతో భయాందోళన వ్యక్తమవుతోంది. బారినపడుతున్నవారు 15 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. రంగారెడ్డి, మంచిర్యాల, సంగారెడ్డి, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ స్కూళ్లలో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదు జిల్లాల్లోని 8 ప్రభుత్వ స్కూళ్లలో 112 మంది విద్యార్థులతో పాటు ముగ్గురు టీచర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నాగోల్ బండ్లగూడలోని తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం 36 మంది విద్యార్థినులు కరోనా బారినపడ్డారు. ఇక్కడ మొత్తం 183 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వీరిలో కొంతమందికి కరోనా లక్షణాలు కనిపించడంతో డాక్టర్లు వారికి మెడికల్ టెస్టులు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో పాటు తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థినులకు ఆస్పత్రిలో చేర్పించి ట్రీట్ మెంట్ అందిస్తుండగా ఇతర విద్యార్థులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్తున్నారు.
ఇదిలా ఉండగా, రెండు రోజుల్లో మంచిర్యాల జిల్లాలో 43 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయినికి పాజిటివ్ గా నిర్ధారణ కావడం అందరిలోనూ టెన్షన్ నెలకొంది. మంచిర్యాల ప్రభుత్వ గర్ల్స్ హై స్కూలులో 484 విద్యార్థినులు ఉన్నారు. రెండు రోజుల్లోనే మెడికల్ టెస్టులు చేయగా 29 మంది విద్యార్థినులు, 11 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇక బెల్లంపల్లి టౌన్ లోని బజార్ ఏరియా జడ్పీ హైస్కూలులో 586 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయినికి కరోనా పాజిటివ్ రావడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఆమె 6,7,8 తరగతులకు పాఠాలు బోధిస్తున్నారు. స్కూలు హెచ్ఎం అనిల్ కుమార్ వైద్యశాఖ, మున్సిపల్ అధికారులకు సమాచారమిచ్చారు. విద్యార్థులకు బుధవారం కరోనా టెస్టులు చేయిస్తున్నామని తెలిపారు.
వారం రోజుల క్రితం గచ్చిబౌలి సమీపంలోని గౌలిదొడ్డి గురుకులంలో 25 మంది విద్యార్థులు, జగిత్యాల కోరుట్ల మండలంలోని అయిలాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థితో పాటు ప్రధానోపాధ్యాయుడు, మరో ఇద్దరు టీచర్లు, సంగారెడ్డి జిల్లాలోని కేజీబీవీలో చదువుతున్న 18 మంది విద్యార్థినులు కరోనా బారినపడ్డారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. రెబ్బెన మండలంలో ఒకరు, కాగజ్ నగర్ పట్టణానికి చెందిన ఒకరు, చింతల మానేపల్లి మండలానికి చెందిన మరొకరికి పాజిటివ్ గా తేలింది.
వనపర్తి జిల్లాలో 62శాతం హాజరు
ఆరు నెలలుగా ఆన్ లైన్ క్లాసులకు హాజరైన విద్యార్థులు స్కూళ్లకు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. వనపర్తి జిల్లాలో 62శాతం మేర హాజరుశాతం నమోదవుతోంది. వనపర్తి జిల్లాలో 174 ప్రభుత్వ స్కూళ్లు ఉండగా, వీటి పరిధిలో మొత్తం 27,198 మంది ఉన్నారు. వీరిలో పాఠశాలలకు 64.80శాతంగా 17,626 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. 90 ప్రైవేట్ పాఠశాలల్లో 11,455 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందగా వీరిలో 56.86శాతం మంది స్కూలుకు వస్తున్నారు. ఇలా స్కూళ్లకు వస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.
కరోనా కేసులు పెరుగుతుండడంతో తమ పిల్లలను పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. చదువు కంటే ప్రాణమే మిన్న అనే ఆలోచనతో వారిని గుమ్మం దాటనీయడం లేదు. గతంలో మాదిరిగానే ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వ్యాధి వ్యాప్తి తీవ్రత ఎక్కవవుతున్న నేపథ్యంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న తమ పిల్లలను ఇంటికి పంపిచాల్సిందిగా సిబ్బందిని కోరుతున్నారు.