వారికి కనీసం 60 గజాలు అయిన ఇవ్వాలి లేదంటే.. ఎమ్మెల్యే ఇంటినే.. రేవంత్ రెడ్డి

దిశ, శేరిలింగంపల్లి: కోట్ల రూపాయల విలువ చేసే భూములపై కన్నేసిన పెద్దల ధనదాహం కోసం పేదల గుడిసెలు కూల్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం గచ్చిబౌలి డివిజన్ లోని బసవతారక నగర్ భూ నిర్వాసితులను అఖిలపక్ష నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బసవతారక నగర్‌లో ఏళ్ల తరబడి నివసిస్తున్న పేద ప్రజల స్థలాల మీద కన్నేసిన బడా బాబు కోసమే కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా.. ఉన్నపళంగా పేదల గుడిసెలు […]

Update: 2021-12-25 09:17 GMT

దిశ, శేరిలింగంపల్లి: కోట్ల రూపాయల విలువ చేసే భూములపై కన్నేసిన పెద్దల ధనదాహం కోసం పేదల గుడిసెలు కూల్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం గచ్చిబౌలి డివిజన్ లోని బసవతారక నగర్ భూ నిర్వాసితులను అఖిలపక్ష నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బసవతారక నగర్‌లో ఏళ్ల తరబడి నివసిస్తున్న పేద ప్రజల స్థలాల మీద కన్నేసిన బడా బాబు కోసమే కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా.. ఉన్నపళంగా పేదల గుడిసెలు కూల్చారని ఆరోపించారు. ఒకప్పుడు చెట్లు, పుట్టలతో నిండి ఉన్న స్థలాల్లో గుడిసెలు వేసుకుని ఏళ్ల తరబడి ఇక్కడే జీవిస్తున్న పేదల గూడు కూల్చి పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిన టీఆర్ ఎస్ నాయకులు గెలిచాక పేదలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. వడ్డెరలు కండలు కరిగించి రాళ్లను కొడితే పెద్దలు భవంతుల కట్టుకుంటున్నారని ఆరోపించారు. 30 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నవారికి 120 గజాలు ఇవ్వకపోయినా.. కనీసం 60 గజాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బసవతారక నగర్ ప్రజలకు న్యాయం చేయకపోగా ఇక్కడి నుండి షెల్టర్ జోన్ లకు తరలిస్తామంటున్నారని విమర్శించారు. అలా చేస్తే స్థానిక ఎమ్మెల్యే ఇంటినే షెల్టర్ జోన్ గా మారుస్తామని, అక్కడే వంటావార్పు చేస్తామన్నారు. టీఆర్‌ఎస్ నాయకులకు మానవత్వం ఉంటే తక్షణమే మున్సిపల్ శాఖమంత్రి ఇక్కడికి రావాలని, పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాజీమంత్రి పీజేఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని, ఆయనే ఉంటే మహానగర ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జైపాల్, మన్నె సతీష్, రాజు యాదవ్, మహిపాల్ యాదవ్, ఇలియాస్ షరీఫ్, దుర్గం శ్రీహరి గౌడ్, రాజన్, దుర్గేష్, సీపీఐ శేరిలింగంపల్లి నియోజక వర్గ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి కృష్ణ, ఇసాక్, రాజు, నరేష్, డి. రవి, టీడీపీ నాయకులు, పీడీఎస్‌యూ నాయకులు, స్థానికులు రంగయ్య, శివతో పాటు బసవతారక నగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:    

Similar News