షర్మిల ఆశలపై ‘రేవంత్’ దెబ్బ..!

దిశ ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో రాజకీయాలు వన్ సైడ్ అయిన వేళ షర్మిల పార్టీ ప్రకటనతో కొంత అలజడి రేగింది. మళ్లీ స్టేట్ పాలిటిక్స్‌లో మార్పొలొస్తాయని అందరూ భావించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కోలుకోకుండా అవుతుందని.. ఆ పార్టీ సగానికి సగం ఖాళీ అవుతుందని ఊహించారు. అందరి ఊహకు తగ్గట్టే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీగా షర్మిల వెంట నడిచేందుకు సిద్ధపడ్డాయి. ఈ క్రమంలో ఇతర పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం నుంచి భారీ […]

Update: 2021-07-11 05:37 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో రాజకీయాలు వన్ సైడ్ అయిన వేళ షర్మిల పార్టీ ప్రకటనతో కొంత అలజడి రేగింది. మళ్లీ స్టేట్ పాలిటిక్స్‌లో మార్పొలొస్తాయని అందరూ భావించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కోలుకోకుండా అవుతుందని.. ఆ పార్టీ సగానికి సగం ఖాళీ అవుతుందని ఊహించారు. అందరి ఊహకు తగ్గట్టే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీగా షర్మిల వెంట నడిచేందుకు సిద్ధపడ్డాయి. ఈ క్రమంలో ఇతర పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం నుంచి భారీ స్థాయిలో ద్వితీయశ్రేణి నాయకులు కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ టీపీలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు.

రాజన్న బిడ్డ రంగంలోకి దిగుతుండడంతో ఇక తమకు తిరుగులేదనుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీలు షర్మిల పార్టీ గురించే చర్చించుకున్నాయి. అధికార పార్టీ సైతం అలర్ట్ అయింది. ఈలోపే కరోనా విజృంభించడం, షర్మిల ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన కార్ల ర్యాలీ రద్దవడం, ఆ తర్వాత భారీ మీటింగ్ తీవ్ర ఆంక్షల నడుమ నిర్వహించడంతో భారీ దెబ్బ పడ్డట్లయింది. ఈలోపు కొవిడ్ కేసులు తీవ్ర స్థాయికి చేరడంతో కొంత కాలం అన్ని పార్టీల్లో స్తబ్ధత ఏర్పడింది.. సీన్ కట్ చేస్తే… కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టడంతో ఇప్పుడు వైఎస్ఆర్టీపీ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. పార్టీ ప్రకటన నాటికి కాంగ్రెస్ నుంచి భారీగా అనుచరగణం చేరుతారనుకుంటే అందరూ వెనకడుగు వేశారు. పీసీసీ పీఠంపై యువ నాయకుడు ఉండడంతో షర్మిల వెంట నడిచేందుకు ఎవరూ ఆసక్తి కనబరచడం లేదు.

కాంగ్రెస్ శ్రేణుల యూటర్న్..

వాస్తవంగా కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీల్లోనూ వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు. కాంగ్రెస్‌లో ఇప్పటికీ ఆయనను పూజించేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఖమ్మంలో మరీ ఎక్కువ. ఈ సెంటిమెంట్‌తోనే జగన్ పార్టీ వైఎస్ఆర్ సీపీని కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మంలో ఆదరించారు. షర్మిల ఖమ్మం నుంచి తన పార్టీ కార్యాచరణ మొదలు పెడతానంది కూడా అందుకేనని ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ శ్రేణులు భారీగా షర్మిల పార్టీలో చేరుదామని భావించినా.. రేవంత్ రెడ్డి సారథిగా ఎంపిక కావడంతో యూటర్న్ తీసుకున్నారు. పార్టీ ప్రకటన అనంతరం చేరుదామనుకున్న కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, పెద్ద నేతలు కూడా ఇప్పుడు పునరాలోచనల్లో పడ్డట్టు తెలుస్తోంది. మొత్తంగా పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకం తర్వాత వైఎస్ఆర్ టీపీకి భారీగా గండి కొట్టినట్లయింది.

చేతి వెంటే రెడ్డి నేతలు..

రేవంత్ బాధ్యతలు చేపట్టకముందు రాజకీయాల్లో షర్మిల కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని అందరూ ఊహించారు. చాలా వరకు అన్ని పార్టీలపై తీవ్ర ప్రభావం ఉంటుందని భావించారు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు పెద్ద నేతలు సైతం పరిస్థితిని అంచనా వేసి షర్మిల వెంట నడిచేందుకు సిద్ధం అయ్యారు. అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు కొందరు పెద్దలు నేతలు పార్టీకి ప్రస్తుతానికి పరోక్షంగా మద్దతిస్తామని, అవసరాన్ని బట్టి బయటకు వస్తామంటూ హామీ సైతం ఇచ్చారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం రెడ్డినేతలు భారీగా వైఎస్ఆర్టీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే రేవంత్ రెడ్డి ఒక్కసారిగా తెరమీదకు రావడంతో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఈ తరుణంలో షర్మిల పార్టీలోకి వెళ్లే బదులు కాంగ్రెస్ లోనే కొంతకాలం ఉండి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చేనే ఆలోచనలో ఉన్నట్లు ఓ పెద్దనాయకుడి అత్యంత సన్నిహితులు చెబుతున్నారు.

ఆది నుంచే అడ్డంకులు..

షర్మిల పార్టీ ఏర్పాటు ప్రచారం మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అడ్డంకి తగులుతూనే ఉంది. ఖమ్మం పర్యటనకు సంబంధించి రెండుసార్లు బ్రేకులు పడ్డాయి. అన్ని జిల్లాల ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనాలు జరిగితే.. ఖమ్మంలో మాత్రం భారీ కార్ల ర్యాలీ నిర్వహించాలని షర్మిల ప్లాన్ చేశారు. హైదరాబాద్ నుంచి సుమారు 2000 కార్లతో ర్యాలీగా వచ్చి ఖమ్మంలోనే ముఖ్యనేతలు, అభిమానులతో చిన్నపాటి సభ ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే అప్పుడు అనుకోకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడం.. కోడ్ అమలులో ఉండడంతో ఆ ర్యాలీ రద్దయింది. ఆ తర్వాత జరపాలనుకున్న భారీ సభకు కొవిడ్ కారణంగా ఆంక్షలు విధించడంతో నామమాత్రంగానే నిర్వహించారు.

ఆ తర్వాత పార్టీ శ్రేణులు అప్పటికే తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అనంతరం కొవిడ్తో కొంతకాలం స్తబ్ధుగా ఉండగా పార్టీ ఆవిర్భావం అట్టహాసంగా చేయాలనుకున్నా.. కరోనా కారణంగా మామూలుగానే చేయడంతో అసలు పార్టీ పురుడు పోసుకున్న విషయమే సామాన్య ప్రజలకు తెలియకుండా అయిపోయింది.

అసంతృప్తిలో షర్మిల టీం..

మొదట షర్మిల పార్టీ పెడుతుందనగానే రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లో సైతం ఒక కదలిక వచ్చింది. ఇక దాదాపు అన్ని పార్టీల నేతలు, క్యాడర్ లో చర్చ జరిగింది. ఆ తర్వాత రానురాను పూర్తిగా షర్మిల పార్టీకి సంబంధించి చర్చలు, ప్రచారాలు తగ్గిపోయాయి.. పార్టీపై ఓ దృష్టి పెట్టిన వారు సైతం ఇప్పుడు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.

ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక పార్టీ మీదున్న క్రేజ్ తగ్గడంతో షర్మిల టీం అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మొదట ఉన్న ప్రచారం తగ్గడానికి కారణాలు వెతకడమే కాకుండా.. పార్టీని రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News