‘పంజరం’లో ఆ వేశ్య కోరిక నెరవేరిందా..!
దిశ, సినిమా : ‘జీవితం ఒకరికి చెప్పి మొదలుపెట్టేది కాదు.. మరొకరికి చెప్పి ముగించేది కాదు.. అనుకోకుండా జరిగే ప్రయాణం ఒక ప్రమాదం’ ఈ మాటల్లో ఎంత అర్థమున్నా.. వ్యక్తిగతంగా అన్వయించుకునే తీరును బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా స్ఫురిస్తుంది. అయితే ఎలా స్ఫురించినా లేదా ధ్వనించినా అంతిమంగా చెప్పేది మాత్రం జీవిత సత్యాలు, జీవన కష్టాల గురించే. ఒకప్పుడు గొప్పగా బతికినవాడైనా కాలం కాటేస్తే.. కాటి కాపరిగా మారొచ్చు. కార్లలో తిరిగేవాడైనా కాళ్లకు చెప్పులు లేని స్థితికి […]
దిశ, సినిమా : ‘జీవితం ఒకరికి చెప్పి మొదలుపెట్టేది కాదు.. మరొకరికి చెప్పి ముగించేది కాదు.. అనుకోకుండా జరిగే ప్రయాణం ఒక ప్రమాదం’ ఈ మాటల్లో ఎంత అర్థమున్నా.. వ్యక్తిగతంగా అన్వయించుకునే తీరును బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా స్ఫురిస్తుంది. అయితే ఎలా స్ఫురించినా లేదా ధ్వనించినా అంతిమంగా చెప్పేది మాత్రం జీవిత సత్యాలు, జీవన కష్టాల గురించే. ఒకప్పుడు గొప్పగా బతికినవాడైనా కాలం కాటేస్తే.. కాటి కాపరిగా మారొచ్చు. కార్లలో తిరిగేవాడైనా కాళ్లకు చెప్పులు లేని స్థితికి చేరొచ్చు. గతం ఏదైనా వర్తమానంలో మనగలగాలంటే ముందు మనం ఉండాలి, చేసేందుకు పనుండాలి. ఆ పని పరువుకు భంగం కలిగిస్తుందా? అన్న విషయం పక్కనబెడితే.. పట్టెడన్నం పెట్టేందుకు పడుపు వృత్తయినా సరే పవిత్రమైనదే. మరి ఆ వృత్తిలో ఉన్నవారికి ప్రేమలుండవా? అందమైన జీవితంపై ఆశలుండవా? తమను ప్రేమించేవారూ ఉంటారా? ఉంటే ఆ ప్రేమ ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌పై తెరకెక్కిన లఘు చిత్రం ‘పంజరం’.
జీవనోపాధి కోసం వేశ్య వృత్తిని కొనసాగించే ‘మేనక’ అనే యువతి.. లాక్‌డౌన్ కారణంగా బిజినెస్ లేకపోవడంతో కష్టాలు పడుతుంటుంది. పూట గడవడం ఎలా? అని ఆలోచిస్తున్న టైమ్‌లో ఒక కస్టమర్ తగిలాడని, రెడీగా ఉండమని ఫోన్ వస్తుంది. వెంటనే అలంకరించుకుని సిద్ధమైపోయిన మేనక.. కస్టమర్ రాగానే లోపలికి ఆహ్వానించి, ముందు డబ్బులు వసూలు చేస్తుంది. ఇక రెంట్ కష్టాలు ఉండవని అనుకుంటూనే.. కస్టమర్‌తో ఇక స్టార్ట్ చేద్దామా! అని సేఫ్టీ కోసం వెతుకుతుంది. కానీ ఎంత వెతికినా సేఫ్టీ దొరక్కపోవడంతో తన ఆనందమంతా ఆవిరైపోతుంది. సేఫ్టీ లేకుంటే సర్వీస్ చేయలేనని చెప్పి అతనికి డబ్బు తిరిగిచ్చి వెళ్లిపొమ్మంటుంది. సరిగ్గా అప్పుడే భారీ వర్షం మొదలవడంతో అతనికి తగ్గాక వెళ్లమని చెప్పడంతో మెల్లిగా మేనకతో మాట కలుపుతాడు కస్టమర్. పేరు, గతంతో పాటు నీకు నచ్చినవారు ఎవరూ లేరా? అని అడిగితే.. చిన్నప్పుడు రాము అనే అబ్బాయి ఉండేవాడని గుర్తుచేసుకుంటుంది. ఇక తను ఒక డైరెక్టర్‌ను అని చెప్పడంతో ఏదైనా అవకాశం ఇవ్వమని అడుగుతుంది మేనక. అప్పుడు ఒక కథ ఉందని.. రామచంద్రాపురం అనే ఊరిలో అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు కన్న కూతురిని ఫ్రెండ్‌కు అమ్మేసిన కసాయి తండ్రి గురించి చెప్పి తన గతాన్ని గుర్తుచేస్తాడు. ఇంతకీ నువ్వు ఎవరంటే.. ‘నా పేరు రాము, లాక్‌డౌన్‌లో ఎలా ఉన్నావో చూసి వెళ్దామని వచ్చాను లక్ష్మీ’ అంటూ తన అసలు పేరుతో పిలుస్తాడు. నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసంటే.. మౌనంగా వెళ్లిపోతాడు. డబ్బులతో పాటు సేఫ్టీ కూడా బెడ్ పైనే ఉంటుంది. నిజానికి లక్ష్మి రూమ్‌లోకి వచ్చే ముందు సేఫ్టీ దాచింది తనే.
‘చూసేవాళ్లకు నా ప్రయాణం తప్పేమో.. కానీ నా దృష్టిలో ఒప్పేమో.. కాలం రాసే కథలో నాది ఒక చిన్న పాత్రేనేమో.. ఈ మూణ్ణాళ్ల ముచ్చటలో గతాల వెనుక పరుగెత్తే జ్ఞాపకాలు ఎదురై, మళ్లీ ప్రేమై చిగురించడం ఎందుకో? సుడిగుండాలలో పడ్డ జీవితానికి మౌనమే సమాధానమేమో.. అతను ఎందుకు వచ్చాడు? నాలాంటి వేశ్యను కూడా ప్రేమిస్తాడా? పెళ్లి చేసుకుంటాడా? అలా అయితే బాగుండు.. నువ్వు అలాంటి వాడివైతే బాగుండు.. నా లైఫ్‌లోకి మళ్లీ తిరిగిరావా!’ అంటూ జీవితంపై కొత్త ఆశల్ని పెంచుకుంటుంది లక్ష్మి.. మరి ఆమె కోరిక నెరవేరిందా తెలియాలంటే మరో పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే.