వ్యాపారాల్లోనూ దళితులకు రిజర్వేషన్.. దళితబంధు డబ్బులతో ఈ బిజినెస్‌లు చేయండి: సీఎం

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్, వాసాలమర్రితోపాటు ప్రయోగాత్మకంగా అమలవుతున్న దళితబంధు పథకాన్ని రాష్ట్రానికి నలువైపులా ఉన్న నాలుగు మండలాల్లోనూ ఇదే పద్ధతిలో అమలు చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సోమవారం సమీక్షించారు. వచ్చే ఏడాది బడ్జెట్ నుంచే ప్రతీ ఆర్థిక సంవత్సరం రూ.20 వేల కోట్ల కేటాయింపులు చేస్తామని, ప్రతీ ఏటా రెండు లక్షల దళిత కుటుంబాలకు వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. ఈ పథకం పూర్తయిన తర్వాత ఇతర కులాల్లోని పేదలకూ వర్తింపజేయనున్నామని, ప్రభుత్వానికి […]

Update: 2021-09-13 19:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్, వాసాలమర్రితోపాటు ప్రయోగాత్మకంగా అమలవుతున్న దళితబంధు పథకాన్ని రాష్ట్రానికి నలువైపులా ఉన్న నాలుగు మండలాల్లోనూ ఇదే పద్ధతిలో అమలు చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సోమవారం సమీక్షించారు. వచ్చే ఏడాది బడ్జెట్ నుంచే ప్రతీ ఆర్థిక సంవత్సరం రూ.20 వేల కోట్ల కేటాయింపులు చేస్తామని, ప్రతీ ఏటా రెండు లక్షల దళిత కుటుంబాలకు వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. ఈ పథకం పూర్తయిన తర్వాత ఇతర కులాల్లోని పేదలకూ వర్తింపజేయనున్నామని, ప్రభుత్వానికి ఆ ఆలోచన ఉన్నదని సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొన్నది. హుజూరాబాద్ అనుభవాన్ని సమీక్షించిన తర్వాత ఎక్కువ మంది లబ్ధిదారులు పాల డెయిరీ యూనిట్లను పెట్టుకోడానికే ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమైందని సీఎం పేర్కొన్నారు. లబ్ధిదారులకు ప్రత్యేకంగా దళితబంధు కోసమే బ్యాంకు ఖాతాను తెరవనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, వాసాలమర్రి గ్రామాల్లో దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్నందున మరో నాలుగు నియోజకవర్గాల్లోని మండలాల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దాని అమలుకు ఉన్న అవకాశాలపై ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, కలెక్టర్లు, ఎంపీపీలు, జడ్‌పీటీసీలు, అధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాల్లో దళితబంధును ప్రభుత్వం అమలు చేయనున్నది. రానున్న రెండు మూడు వారాల్లోనే నిధులు దశలవారీగా విడుదల చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు.

దళితబంధు పథకం కింద ఎక్కువ మంది డైయిరీ యూనిట్లను నెలకొల్పుకోడానికే ఆసక్తి చూపుతున్నందున ఎస్సీ సంక్షేమ శాఖ, పశుసంవర్దక శాఖ, ప్రభుత్వ సహకార డైయిరీలు సంయుక్తంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం తెలంగాణ ప్రజలు సగటున ఎన్ని పాలను వినియోగించాలి? ప్రస్తుతం ఎంత వినియోగిస్తున్నారు? రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎంత జరుగుతున్నది? బయటి రాష్ట్రాల నుండి ఎంత దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది? తదితర అంశాల మీద సమీక్ష జరిపి దళితబంధులో డైయిరీ యూనిట్లను ప్రొత్సహించడానికి తగిన కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వ డైరీ యూనిట్లను ప్రోత్సహించాలని ఆదేశించారు.

వ్యాపారాల్లో రిజర్వేషన్

ప్రభుత్వం లైసెన్సులు కేటాయించే వివిధ రంగాలను గుర్తించి అందులో అర్హులైన దళితులకు రిజర్వేషన్‌ను పాటించనున్నట్లు కేసీఆర్ నొక్కిచెప్పారు. మెడికల్ షాపులు, ఫెర్టిలైజర్ షాపులు, ‘మీ సేవా’ కేంద్రాలు, గ్యాస్ డీలర్‌షిప్‌లు, ట్రాన్స్‌పోర్టు పర్మిట్లు, మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టర్లు, అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టులు, బార్లు, వైన్ షాపులు తదితర రంగాల ద్వారా ఉపాధి పొందేలా దళితబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అన్ని విధాలుగా దళిత కుటుంబం బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్ధారించుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని వివరించారు.

వివక్ష విపరీతంగా ఉన్నచోటనే మేలుకొలుపు కూడా ఎక్కువగా ఉంటుందని, అలా చైతన్యం పొందినవారే పోరాటం చేసి వంద శాతం విజయాన్ని సాధిస్తారని సీఎం గుర్తుచేశారు. ఏదైనా ఒక్క రోజుతోనే సాధ్యంకాదని, దశలవారీగా విజయాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అధికారదర్పంతో కాకుండా కన్నబిడ్డను ఆలనా పాలనను తల్లిదండ్రులు ఎలా చూస్తారో అదే పద్ధతిలో వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు.

అసెంబ్లీసాక్షిగా రూపకల్పన

దళితబంధు పథకానికి అసెంబ్లీ సాక్షిగానే రూపకల్పన జరిగిందని సీఎం ఈ సమావేశంలో పేర్కొన్నారు. ‘దళిత ఎంపవర్‌మెంట్’ కింద 1000 కోట్ల రూపాయలను కూడా స్వయంగా అసెంబ్లీలో తానే ప్రకటించానని, వివిధ పార్టీలు, వివిధ రంగాలకు చెందిన దళిత పెద్దలు, మేధావులతో దఫదఫాలుగా చర్చించిన తర్వాత దళితబంధు కార్యక్రమానికి అమలుకు రూపకల్పన జరిగిందని వివరించారు. ఏదైనా మండలాన్ని లేదా నియోజకవర్గాన్ని సంపూర్ణంగా తీసుకుంటే బాగుంటుందని సలహాలు, సూచనలు వచ్చినందునే హుజూరాబాద్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నట్లు తెలిపారు. గతంలో ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయని కార్యక్రమం ఇది అని పేర్కొన్నారు.

ఇతర వర్గాలు సహకరించాలి

ప్రస్తుతానికి ప్రతీ బడ్జెట్‌లో రూ.20 వేల కోట్ల చొప్పున కేటాయించాలని నిర్ణయించామని, పరిస్థితులు అనుకూలిస్తే ఇంకా ఎక్కువే కేటాయిస్తామని సీఎం తెలిపారు. ఆ తర్వాత వరుసక్రమంలో ఇతర కులాల్లోని పేదలకూ పది లక్షల రూపాయల చొప్పున సాయం అందించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. రైతు బంధు సహా ఇతర పథకాలను అమలు చేసినప్పుడు దళితులెవరూ అభ్యంతరం చెప్పలేదని, తమకు కూడా మేలు చేయాలని మాత్రమే కోరుకున్నారని, ఇప్పుడు కూడా దళితబంధు పథకం అమలు విషయంలో మిగిలిన వర్గాలు అదే స్థాయిలో సహకరించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. బీసీ బంధు, మైనారిటీ బంధు లాంటి డిమాండ్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ క్లారిటీ ఇవ్వడం గమనార్హం.

ప్రత్యేక బ్యాంకు అకౌంట్

దళితబంధు పథకం అమలు, అందుకు అనుసరించాల్సిన పద్ధతులు, విధి విధానాల గురించి ఈ సమావేశంలో అధికారులు వివరించారు. మొదటిదశలో పథకం అమలు పటిష్టంగా జరగాలని, రెండవ దశలో పర్యవేక్షణ కీలకం అని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, దళితబంధు కమిటీలు సమన్వయంతో ఈ కార్యక్రమం అమలుకావాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతీ లబ్ధిదారుని కుటుంబానికి ప్రత్యేక దళితబంధు బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దళితబంధు కమిటీలు ఉంటాయని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కమిటీల ద్వారా లక్షమందికి పైగా దళితులు వారి జాతి సంరక్షణను స్వంత భుజాలమీద వేసుకొని నిర్వహించనున్నట్లు తెలిపారు. వారి జాతి అభివృద్ధికి వారే స్వయంగా భాగస్వాములు కావడం ఈ పథకం గొప్పతనమన్నారు.

దళితబంధు అమలుకు నా వంతు కృషి : మల్లు భట్టి విక్రమార్క

“ప్రతీ దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించే పథకం దేశంలో ఎక్కడా లేదు. రాజకీయాలకు అతీతంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేసినందుకు సంతోషం. సీఎం ఆలోచనల మేరకు దళితబంధు అమలు కోసం నా శాయశక్తులా కృషిచేస్తా. ఎంచుకున్న వ్యాపారాలకు అవసరమైన లైసెన్సుల జారీలో ఎస్సీలకు రిజర్వేషన్లు కేటాయించడం చాలా ఉపయోగపడుతుంది. పరిశ్రమల శాఖను కూడా ఈ పథకంలో భాగస్వామ్యం చేయాలి. పౌల్ట్రీ ఫీడ్, డైరీ ఫీడ్ వంటి వాటిని కూడా ఈ పథకం కింద పరిశీలించాలి”.

Tags:    

Similar News