ఓబీసీ గణనపై బీజేపీలో భిన్నస్వరాలు.. లెక్క తేలితే చిక్కే

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో బీసీ కులాలకు చెందిన కుటుంబాలెన్ని? జనాభా ఎంత? ఈ లెక్కలపై ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతున్నది. జనాభా గణన త్వరలో ప్రారంభం కానున్నందున ఓబీసీ లెక్కలు తేల్చేందుకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఒక పార్టీగా బీజేపీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ప్రభుత్వం తరఫున ప్రధాని కూడా విధాన నిర్ణయం తీసుకోలేదు. కానీ పార్టీలో మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొద్దిమంది […]

Update: 2021-08-31 22:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో బీసీ కులాలకు చెందిన కుటుంబాలెన్ని? జనాభా ఎంత? ఈ లెక్కలపై ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతున్నది. జనాభా గణన త్వరలో ప్రారంభం కానున్నందున ఓబీసీ లెక్కలు తేల్చేందుకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఒక పార్టీగా బీజేపీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ప్రభుత్వం తరఫున ప్రధాని కూడా విధాన నిర్ణయం తీసుకోలేదు. కానీ పార్టీలో మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొద్దిమంది నేతలు ఓబీసీ గణన చేపట్టాలని అభిప్రాయపడుతున్నారు. మరికొద్దిమంది అది మరో తేనెతుట్టెను కదిపినట్టే అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కూడా ఓబీసీ లెక్కలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​కుమార్ ఇదే విషయమై ఆ రాష్ట్రానికి చెందిన 10 పార్టీల ప్రతినిధులతో కలిసి ఢిల్లీకి వచ్చి ప్రధాని మోడీతో చర్చించారు. ఇది జరిగిన రెండు రోజులకే ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీ అప్నాదళ్ సైతం బీసీ గణన చేపట్టాల్సిందేనని డిమాండ్ చేసింది. ఓబీసీల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేయాలని సూచించింది.

ఓబీసీల వార్షికాదాయాన్ని రూ. 15 లక్షలకు పెంచి సంక్షేమ పథకాలకు అర్హతను ఫిక్స్ చేయాలని కూడా సూచించింది. అయినా ప్రధాని మాత్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకుండా పెండింగ్‌లోనే ఉంచారు. ఇలాంటి గందరగోళం నేపథ్యంలో బీజేపీకి చెందిన మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ మాత్రం ఓబీసీ గణన చేపట్టాల్సిందిగా ప్రధాని మోడీకి లేఖ ద్వారా విజ్ఞఫ్తి చేశారు. ఎందుకు చేపట్టాల్సిన అవసరం ఉన్నదో వివరించారు. ఇదిలా ఉండగా పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా ఇటీవల ఓబీసీ జనగణన చేపట్టాల్సిందిగా సిఫారసు చేసింది. అంతకు ముందు జస్టిస్ రోహిణి కమిషన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక చట్టబద్ధత కలిగిన జాతీయ బీసీ కమిషన్ సైతం ఓబీసీ లెక్కలు తేల్చాలంటూ కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రిత్వశాఖకు సిఫారసు చేసింది. గత టర్ములో హోం మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్​ సింగ్ సైతం బీసీ గణన చేపట్టనున్నట్టు హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల తర్వాత ఆ అంశం పార్టీలో, ప్రభుత్వంలో చర్చకు రాలేదు. దీనికి తోడు బీసీ గణనపై రాజస్థాన్ ప్రభుత్వం లాంఛనంగా నిర్ణయం తీసుకున్నది. బిహార్, మహారాష్ట్ర, ఒడిషా అసెంబ్లీలు తీర్మానం చేశాయి. సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణకు ఓబీసీ జన గణన చేపట్టనున్నట్లు ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా స్పష్టత ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.

ఇన్ని రకాల ఒత్తిడుల మధ్య ప్రధాని స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నది. ఎస్సీ, ఎస్టీ జనాభాను తేల్చడానికి మాత్రమే కుల గణన జరుగుతుందని, ఓబీసీల విషయంలో మాత్రం అలాంటి ప్రక్రియపై విధాన నిర్ణయం తీసుకోలేదని సోషల్ జస్టిస్ మంత్రిత్వశాఖ ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్భంగా క్లారిటీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా అనేక బీసీ సంఘాలు సైతం ఓబీసీ గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం బీసీ కులాలను జాబితాలో చేర్చే వెసులుబాటును రాష్ట్రాలకే కల్పించింది. పార్టీలతో పాటు బీసీ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని సమర్ధించాయి. కానీ ఓబీసీల లెక్క తేల్చే విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నాయి. ప్రతి పదేండ్లకోసారి జరిగే జనాభా లెక్కల సేకరణ ఈ ఏడాది ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలోనే అది ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఓబీసీ గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండటం గమనార్హం. నిజానికి బీసీ లెక్కలు తేల్చాలనే ఆలోచన పార్టీకి ఉన్నదని, కానీ రాజకీయంగా ఎలాంటి కొత్త తలనొప్పికి కారణమవుతున్నదనే కోణం నుంచి బీజేపీ నిర్ణయం తీసుకోలేకపోతున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.

లెక్కతేలితే చిక్కులే!

ఈ ప్రక్రియ చేపడితే ఏ రాష్ట్రంలో ఎంత మంది బీసీలున్నారో తేలిపోతుంది. అది ఎలాంటి కొత్త డిమాండ్లకు దారితీస్తుందోననేది బీజేపీని వేధిస్తున్న ప్రశ్న. ఇప్పటికే రిజర్వేషన్లను పెంచాలని, ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని, జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయింపులు చేయాలని డిమాండ్లు వస్తున్న సమయంలో ఈ లెక్కలు బహిర్గతమైతే ప్రభుత్వాలకు పలు సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది. దేశ జనాభాలో మెజారిటీ బీసీలే అనే ఒక సాధారణ అభిప్రాయం ఇప్పటికే నెలకొన్నది. నిర్దిష్టంగా లెక్కలు తేలితే రకరకాల డిమాండ్లు తెరపైకి వస్తాయన్నది అధికార పార్టీల భయం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీసీ లెక్కలు తేల్చడంపై విధాన నిర్ణయం తీసుకోడానికి ప్రధాని మోడీ ముందూ వెనకా ఆలోచిస్తున్నారు. స్వయంగా బీసీ వర్గానికి చెందిన ప్రధాని సానుకూల నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయం ఎలా ఉన్నా ఒత్తిడి తీసుకురావడం ద్వారా సాధించుకోవచ్చన్నది బీసీ సంఘాల, కొద్దిమంది ప్రజాప్రతినిధుల భావన.

Tags:    

Similar News