కేంద్రానికి గెహ్లాట్ చెక్ పెట్టారా?
జైపూర్: ఆడియో టేపులను సెంట్రల్ బ్యూరో ఏజెన్సీ (సీబీఐ) దర్యాప్తు చేయాలని బీజేపీ డిమాండ్ చేసిన రోజుల వ్యవధిలోనే దానికి రాజస్తాన్ సర్కారు అడ్డుకట్టవేసింది. ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్(డీఎస్‌పీఈ) యాక్ట్, 1946ను తెరమీదకు తెచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకునే రాష్ట్రంలోని ఏ అంశాన్నైనా సీబీఐ దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. రాజస్తాన్ సర్కారును కూల్చే కుట్రలో భాగస్వాములైన బీజేపీ బడా నేతలను కప్పిపెట్టడానికే బీజేపీ సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేస్తున్నదని కాంగ్రెస్ […]
జైపూర్: ఆడియో టేపులను సెంట్రల్ బ్యూరో ఏజెన్సీ (సీబీఐ) దర్యాప్తు చేయాలని బీజేపీ డిమాండ్ చేసిన రోజుల వ్యవధిలోనే దానికి రాజస్తాన్ సర్కారు అడ్డుకట్టవేసింది. ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్(డీఎస్‌పీఈ) యాక్ట్, 1946ను తెరమీదకు తెచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకునే రాష్ట్రంలోని ఏ అంశాన్నైనా సీబీఐ దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. రాజస్తాన్ సర్కారును కూల్చే కుట్రలో భాగస్వాములైన బీజేపీ బడా నేతలను కప్పిపెట్టడానికే బీజేపీ సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేస్తున్నదని కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆడియో టేపులు సహా ఇతర అంశాలను సీబీఐ దర్యాప్తు చేస్తుందనే భయంతోనే ఈ యాక్ట్‌ను తెరమీదకు తెచ్చి కొత్త నోటీసులను జారీ చేసిందని తాజాగా, బీజేపీ రాజస్తాన్ యూనిట్ ప్రెసిడెంట్ సతీష్ పూనియా ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఆడియో శాంపిళ్లు అందివ్వాలని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌వోజీ) కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌కు నోటీసులు జారీ చేసింది. కుట్ర సంబంధిత ఆడియోలో షెకావత్ మాట్లాడారన్న ఫిర్యాదుపై ఈ నోటీసులు జారీ చేసింది. కాగా, అసలు ఆడియో టేపులు ఎక్కడివి? ఎవరు రికార్డ్ చేశారు? దాని జెన్యూనిటీ ఎంత? అనేది ముందు నిర్ధారించాలని షెకావత్ సాయంత్రం వ్యాఖ్యానించారు.
సచిన్‌పై సీఎం తీవ్ర ఆరోపణలు
మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌పై సీఎం అశోక్ గెహ్లాట్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీతో జతకట్టి సొంతపార్టీ ప్రభుత్వాన్ని కూల్చే యత్నం చేశారని సచిన్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. కాంగ్రెస్ స్టేట్ చీఫ్‌గా ఏడేళ్లు కొనసాగినా పార్టీ నిర్ణయాలకు కట్టుబడిన తాము అతన్ని మార్చాలని ఎన్నడూ డిమాండ్ చేయలేదని, అతనికంతా సీన్ లేకున్నా అలాగే కొనసాగాడని అన్నారు. అతని ముఖాన్ని చూసి అమాయకుడని అందరూ అనుకున్నారని, కానీ, తాను కూరగాయలమ్మడం లేదు.. సీఎంను అని అన్నారు. అందుకే అతని అసలు రంగును గుర్తుపట్టారని చెప్పారు. కాగా, రెబల్స్‌పై అనర్హత వేటు నోటీసులపై రాజస్తాన్ హైకోర్టులో సోమవారం విచారణ సాగింది. రెబల్స్ తరఫు న్యాయవాది హరిష్ సాల్వే వాదిస్తూ.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాటం ఫిరాయింపు కాదని, ధిక్కరణ కాదని అన్నారు. అలాగైతే చట్టసభ్యుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టేనని తెలిపారు. స్పీకర్ విధుల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకునే వీలుంటుందని చెప్పారు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ సోమవారం ముగియకపోవడంతో తర్వాతి రోజుకు వాయిదా పడింది.