షోకాజ్ నోటీసులపై వైసీపీ ఎంపీ రివర్స్ కౌంటర్
దిశ ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యేపై క్రమశిక్షణా చర్యలకు వైఎస్సార్సీపీ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సంజాయిషీ ఇస్తారని భావించిన రఘురామకృష్ణం రాజు పార్టీ ఊహించని రీతిలో స్పందిస్తూ… తనకు పంపిన షోకాజ్ నోటీసు వైఎస్సార్సీపీ నుంచి పంపినదా? యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి పంపినదా? అంటూ షాకింగ్ ప్రశ్న సంధించారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానానికి కొన్ని ప్రశ్నలతో లేఖ రాశారు.. ఆ లేఖ […]
దిశ ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యేపై క్రమశిక్షణా చర్యలకు వైఎస్సార్సీపీ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సంజాయిషీ ఇస్తారని భావించిన రఘురామకృష్ణం రాజు పార్టీ ఊహించని రీతిలో స్పందిస్తూ… తనకు పంపిన షోకాజ్ నోటీసు వైఎస్సార్సీపీ నుంచి పంపినదా? యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి పంపినదా? అంటూ షాకింగ్ ప్రశ్న సంధించారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానానికి కొన్ని ప్రశ్నలతో లేఖ రాశారు.. ఆ లేఖ వివరాల్లోకి వెళ్తే…
“మీరు నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నోటీసులు పంపారు. ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయిన ప్రకారం పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌పై నోటీసులు పంపారు. అదేమైనా మరో పార్టీనా… ఎన్నికల సంఘం వద్ద కొత్తగా రిజిస్టర్ అయిందా?… మరీ ముఖ్యంగా ఓ విషయం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. విజయసాయిరెడ్డి గారూ, మిమ్మల్ని మీరు పార్టీ జాతీయ కార్యదర్శిగా పేర్కొంటున్నారు. మన పార్టీ రిజిస్టర్ అయింది ఓ ప్రాంతీయ పార్టీగా. ఓ రాష్ట్ర పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉంటాడా?
పార్టీలో క్రమశిక్షణ సంఘం అంటున్నారు. దీనికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందా? ఉంటే, అందులోని సభ్యులెవరు? చైర్మన్ ఎవరు? వారెవరైనా ఉంటే, నాకు షోకాజ్ నోటీసులు పంపడంలో ఎలాంటి విధానం పాటించారు? ఒకవేళ అన్ని సజావుగా జరిగాయని మీరు చెబుతున్నట్టయితే, నాకు నోటీసులు పంపడానికి క్రమశిక్షణ సంఘం సమావేశమైనప్పటి మినిట్స్ పంపండి. పబ్లిక్ డొమైన్ లో ఎన్నికల సంఘం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాకు తెలిసినంతవరకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి న్యాయపరమైన గుర్తింపు ఉన్న, ఎలాంటి అధికారిక క్రమశిక్షణ సంఘం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుమీద లెటర్ హెడ్స్ ఉపయోగించడానికి మీరు మన ప్రియతమ నాయకుడు జగన్ అనుమతి తీసుకున్నారని భావిస్తాను. కానీ లెటర్ హెడ్స్ మీద వైఎస్సార్ అని ఉపయోగించడం కుదరదని, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని మాత్రమే ఉపయోగించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
మన ప్రియతమ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ వీరాభిమానిగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నియమాలు, నిబంధనలు, విధివిధానాలు, సిద్ధాంతాలను ఎంతగానో గౌరవిస్తాను. అయితే, పార్టీ తరఫున ఓ క్రమశిక్షణ సంఘం ఉందని, దానికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందని భావించినప్పుడే మీరు పంపిన షోకాజ్ నోటీసులపై నేను స్పందిస్తాను. ఆ హక్కు నాకుంది. సరైన అధికారం లేకుండా మీరు నాకు నోటీసులు పంపారంటూ న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోగలను. అన్నిటికీ మించి, మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే… పార్టీ ఉనికికి హాని కలిగించకండి. అందరికంటే మీ వల్లే పార్టీకి ఎక్కువగా నష్టం జరుగుతోంది” అంటూ షాకింగ్ సమాధానమిచ్చారు…