ఉమెన్స్ డే స్పెషల్ : పట్టుదలతో ‘ఆమె’ కల సాకారం

దిశ, ఫీచర్స్ : పట్టుదల, అకుంఠిత దీక్ష ఉంటే చాలు.. ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించొచ్చు అనేందుకు ‘ఆమె’ జీవితమే నిదర్శనం. అడ్డంకులు ఎదురైతే భయపడొద్దని, ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలని, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే విజయం తప్పక వరిస్తుందనేది ఆమె ఫిలాసఫీ. అనారోగ్యంతో వీల్ చైర్‌కే పరిమితమైనప్పటికీ ఆ విషయం తన లక్ష్యసాధనకు ఎప్పుడూ అడ్డంకి కాలేదు. ప్రస్తుతం తన గళంతోనే సమాజానికి వాయిస్ ఆఫ్ స్ట్రెంత్ ఇస్తున్న ఆ మహిళే.. సింగర్ రాధారాయ్‌. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా […]

Update: 2021-03-08 02:44 GMT

దిశ, ఫీచర్స్ : పట్టుదల, అకుంఠిత దీక్ష ఉంటే చాలు.. ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించొచ్చు అనేందుకు ‘ఆమె’ జీవితమే నిదర్శనం. అడ్డంకులు ఎదురైతే భయపడొద్దని, ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలని, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే విజయం తప్పక వరిస్తుందనేది ఆమె ఫిలాసఫీ. అనారోగ్యంతో వీల్ చైర్‌కే పరిమితమైనప్పటికీ ఆ విషయం తన లక్ష్యసాధనకు ఎప్పుడూ అడ్డంకి కాలేదు. ప్రస్తుతం తన గళంతోనే సమాజానికి వాయిస్ ఆఫ్ స్ట్రెంత్ ఇస్తున్న ఆ మహిళే.. సింగర్ రాధారాయ్‌. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ టాలెంటెడ్ సింగర్‌పై ప్రత్యేక కథనం.

కోల్‌కతాకు చెందిన రాధారాయ్‌కు చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలవడం తన డ్రీమ్ కాగా, అందుకోసం ప్రతిరోజు ఉదయం స్విమ్మింగ్, ఈవినింగ్ స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తూ రోజంతా బిజీగా గడుపుతుండేది. ఈ క్రమంలో మొదటిసారి అనారోగ్యం పాలైంది. ఆస్పత్రికి వెళ్లగా రాధా రాయ్ వీక్‌గా ఉందని, కిడ్నీల పని తీరు మెరుగ్గా లేదని తెలిపారు వైద్యులు. ట్రీట్‌మెంట్‌లో భాగంగా స్టెరాయిడ్స్ కూడా వేశారు. అయితే ఎక్కడ తప్పిదం జరిగిందో తెలియదు కానీ ఆమెకు అరుదైన న్యూరో మస్కులర్ డిజార్డర్ (నరం వద్ద ఉండే కండరాలు బలహీనపడటం) వచ్చింది. దీంతో తను వీల్ చైర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అప్పుడు ఆమె వయసు 13 ఏళ్లు మాత్రమే. ఇక తాను స్విమ్మింగ్ చేయలేదని అంతా అనుకున్నారు. కానీ రాధారాయ్ మాత్రం కొత్త లైఫ్ ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మ్యూజిక్‌పై ఇంట్రెస్ట్ ఉందని తనకు తాను గుర్తించుకుని, వీల్ చైర్‌లో ఉంటూనే పండిట్ అజయ్ చక్రవర్తి వద్ద సంప్రదాయ హిందుస్తానీ క్లాసిక్ మ్యూజిక్ నేర్చుకుంది. మరోవైపు చదువు కూడా కొనసాగించింది. కోల్‌కతాలోని లొరెటా హౌస్ కాలేజ్ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ కంప్లీట్ చేసింది. అనంతరం మ్యూజిక్‌లో పర్ఫెక్షన్ కోసం ఇంకా ట్రైనింగ్ తీసుకోవాలని భావించి, కోల్‌కతా నుంచి ముంబైకి షిఫ్ట్ అయి కొద్ది రోజుల పాటు ఉస్తాద్ సర్ఫరాజ్ అహ్మద్ ఖాన్, దిల్షాద్ ఖాన్ వద్ద సంగీత సాధన చేసింది.

మ్యూజిక్‌లో పర్ఫెక్షన్ సాధించిన రాధ.. సల్మాన్ ఖాన్, కరీనాకపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘క్యోన్ కి’ సినిమా ద్వారా బాలీవుడ్‌కు సింగర్‌గా పరిచయమైంది. హిమేష్ రేష్మియా ఈ సాంగ్‌కు మ్యూజిక్ కంపోజ్ చేయగా, ఫేమస్ సింగర్ ఉదిత్ నారాయణన్‌తో కలిసి ‘క్యోన్ కి ఇత్నా ప్యార్’ పాటను రాధ ఆలపించారు. ఆ పాట అభిమానులను అలరించడంతో పాటు ఇండస్ట్రీ నుంచి అవకాశాలు లభించేందుకు దోహదపడింది. ఇక అప్పటి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హిందీతో పాటు తమిళ్ సినిమాల్లో పాటలు పాడుతూ టీవీ షోస్, లైవ్ షోస్‌, కన్సార్ట్స్‌లో ఆమె పార్టిసిపేట్ చేస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించింది. ఈ క్రమంలో సంగీత దిగ్గజం ఏ ఆర్ రెహమాన్, సింగర్ శంకర్ మహదేవన్‌తో కలిసి పాటలు పాడి శభాష్ అనిపించుకుంది. కాగా మ్యూజిక్ లెజెండ్ రెహమాన్‌తో లైవ్ ఈవెంట్‌లో పర్ఫార్మ్ చేయడం తన జీవితంలో ఎప్పుడూ మరిచిపోనని పేర్కొన్న రాధ.. జీవితంలో ఎన్ని కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ధైర్యంగా ముందుకు సాగాలని సూచిస్తోంది.

Tags:    

Similar News