Noise pollution : బాబోయ్ భరించలేం.. ట్రాఫిక్‌ సౌండ్‌తో గుండెకూ ముప్పే!

Noise pollution : బాబోయ్ భరించలేం.. ట్రాఫిక్‌ సౌండ్‌తో గుండెకూ ముప్పే!

Update: 2025-01-10 12:59 GMT

దిశ, ఫీచర్స్ : నగర జీవితమంటే.. ఉరుకులూ పరుగులే కాదు,  చెవులు చిల్లులు పడేలా శబ్దాలు, రణగొణ ధ్వనులు కూడాను. బయట అడుగు పెడితే చాలు రకరకాల సౌండ్స్ వినబడుతూ చికాకు తెప్పిస్తుంటాయి. ఇక బస్సులోనో, బైకుమీదో వెళ్తున్నప్పుడు ఏ కూడలివద్దనో కాస్త ట్రాఫిక్ జామ్ అయితే అదో నరకమే. ఎందుకంటే కొందరు వాహన దారులు హారన్ల మోత మోగిస్తూనే ఉంటారు. కనీసం సిగ్నల్ పడిందనో, ట్రాఫిక్ ఎక్కువగా ఉందనో కూడా ఆలోచించరు. కొందరైతే.. ఎందుకు చేస్తారో తెలియదు కానీ.. హారన్లు మోగిస్తూ పైశాచికానందం పొందుతుంటారు. ఇలాంటి పరిస్థితే ట్రాఫిక్‌లో శబ్ద కాలుష్యాన్ని పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు.

హారన్‌ల మోతతో అవస్థలు 

మెట్రో సిటీలల్లో అయితే ట్రాఫిక్ సౌండ్ వల్ల శబ్దకాలుష్యం రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో చాలామంది అవస్థలు పడుతున్నారు. ఉద్యోగాలు, వివిధ పనుల కోసం బయటకు వెళ్లేవారు ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు వినిపించే వాహన శబ్దాలు, హారన్ల మోతలకు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితి మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్, దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక నగరాల్లో ఉందని నిపుణులు చెబుతున్నారు. మన దేశమే కాదు ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రమాదకర కాలుష్యాల్లో శబ్ద కాలుష్యం కూడా ఒకటని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

ప్రమాదంలో ఆరోగ్యం

పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ, దానివల్ల వెలువడే శబ్దాలు మానవ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నట్లు యూఎస్, డెన్మార్క్, స్విడ్జర్లాండ్, జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల అధ్యయనంలోనూ వెల్లడైంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్, సర్క్యులేషన్ రీసెర్చ్ జర్నల్ స్టడీ ప్రకారం కూడా ట్రాఫిక్ శబ్దాలతో ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ఇది మానసిక గందరగోళం, అధిక రక్తపోటుతో పాటు గుండె జబ్బుల రిస్క్‌ను పెంచుతోంది. రోడ్లు, రైళ్లు, విమానాల నుంచి వచ్చే శబ్దాలు తరచుగా వినేవారిలో కార్డియో వాస్క్యులర్ వ్యాధులు, మధుమేహం, స్ట్రోక్ రిస్క్ పెరిగే అవకాశం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.

గుండెకు ముప్పు

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకారం ట్రాఫిక్ సౌండ్ వల్ల పశ్చిమ ఐరోపాలో ఏటా 1.6 మిలియన్ల మంది ప్రజలు తమ ఆరోగ్యకరమైన జీవితాన్ని కోల్పోతున్నారట. రాత్రింబవళ్లు కూడా ట్రాఫిక్ శబ్దాలు రిస్క్‌ను పెంచుతున్నాయి. అధిక శబ్దాలు కొందరిని ఒత్తిడికి గురిచేస్తుంటే.. మరికొందరిలో రాత్రి సమయంలో నిద్రకు ఆటంకం కలిగిస్తూ మానసిక గందరగోళానికి కారణం అవుతున్నాయి. దీనివల్ల స్ట్రెస్ హార్మోన్లు రిలీజై రక్త నాళాలు, మెదడుపై ప్రభావం చూపడంవల్ల అధిక రక్తపోటుకు దారితీస్తున్నాయి. తద్వారా గుండె జబ్బుల రిస్క్ కూడా పెరుగుతోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా ట్రాఫిక్ సౌండ్ వల్ల గుండె పనితీరు దెబ్బతినే రిస్క్ పెరిగింది. ప్రతీ 10 డెసిబెల్స్ (DBA) ట్రాఫిక్ సౌండ్‌కు, గుండె సమస్యల ప్రమాదం 3.2 శాతం పెరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ వ్యాధులు కూడా..

శబ్ద కాలుష్యం ఎక్కువైతే క్రానిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్, అక్యూట్ కరోనరీ సిండ్రోమ్, ఆర్టరీ హైపర్ టెన్షన్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో సహా వివిధ కార్డియో వాస్క్యులర్, సెరెబ్రో వాస్క్యులర్ వంటి అనారోగ్యాలకు శబ్ద కాలుష్యం దారితీస్తుంది. రాత్రిపూట తరచుగా విమాన శబ్దాలకు గురయ్యే వారిలో ఒత్తిడి ప్రేరేపిత కార్డియో మయోపతి (Tacosubo syndrome) రిస్క్ పెరిగే అవకాశం ఉందని, క్రమంగా ఇది రక్తపోటును పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

సౌండ్ పొల్యూషన్ పెరిగే కొద్దీ..

ట్రాఫిక్ సౌండ్స్ లేదా శబ్ద కాలుష్యం 85 డెసిబెల్స్ (DB) కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు శాశ్వత వినికిడి లోపానికి దారితీయవచ్చు. ఇక 10 డెసిబెల్ లెవెల్ పెరుగుదల అధిక రక్తపోటు ప్రమాదాన్ని 6 శాతం పెంచుతుంది. తరచుగా ట్రాఫిక్ సౌండ్స్‌కు గురికావడంవల్ల, ఇలాంటి శబ్దాలకు గురికానివారితో పోలిస్తే డయాబెటిస్ వచ్చే ప్రమాదం 11 శాతం పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. 45 డిసెబెల్స్ కంటే అధిక స్థాయిలో శబ్ద కాలుష్యానికి గురైతే తీవ్రమైన అలసట, నిద్రలేమి, డయాబెటిస్ వంటి ముప్పు పెరుగుతుంది.

Tags:    

Similar News