Peacefull life : సంతోషంగా ఉండాలంటే.. వీరికి దూరంగా ఉండటమే బెటర్ !

Peacefull life : సంతోషంగా ఉండాలంటే.. వీరికి దూరంగా ఉండటమే బెటర్ !

Update: 2025-01-10 13:14 GMT

దిశ, ఫీచర్స్ : మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? అయితే కొందరు వ్యక్తులకు దూరంగా ఉంటేనే మంచిదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రతీది నెగెటివ్ కోణంలోనే ఆలోచించే వారివల్ల మీరు సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీలో ప్రతికూల ఆలోచనలకు, ఆందోళనలకు అవతలి వ్యక్తి అతి ధోరణి కూడా కొన్నిసార్లు కారణం కావచ్చు. అలాగని ఎవ్వరూ మనల్ని విమర్శించ కూడదని, అభిప్రాయాలు వెల్లడించకూడదని అనుకోవడం కూడా పొరపాటే.. సద్విమర్శలు స్వీకరించాల్సిందే. అయితే మరి ఎలాంటి వారికి దూరంగా ఉండాలి? నిపుణుల ప్రకారం ఆ వివరాలేంటో చూద్దాం.

దురుసు ప్రవర్తన కలిగి ఉంటే..

మీ చుట్టూ ఉండేవారిలో ఎవరైనా దురుసు ప్రవర్తన కలిగి ఉంటున్నారా?, రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారా? అయితే వారికి దూరంగా ఉండటమే మంచిది. ఇలాంటి వారు ఎమోషనల్ పరంగా మాట్లాడే తీరులోనూ కఠినంగా వ్యవహరిస్తుంటారు. ఎదుటి వారిని ప్రతీ విషయంలో చులకనగా చూస్తుంటారు. తమకున్న లోపాలు, బలహీనతల కారణంగా అవతలి వ్యక్తులను కూడా అదే కోణంలో అంచనా వేస్తుంటారు. శక్తిహీనులుగా భావిస్తుంటారు. మీ స్నేహితుల, బంధువులు, ఇంకెవరైనా కావచ్చు ఇలాంటి ప్రవర్తన, వ్యక్తిత్వం కలిగి ఉన్నప్పుడు దూరంగా ఉంటేనే మనశ్శాంతిగా ఉంటారు.

సందర్భోచితం కాని విమర్శలు

విమర్శ మంచిదే. అది సద్విమర్శ అయినప్పుడు మనల్ని అలర్ట్ చేస్తుంది. మనలోని లోపాన్ని సరిదిద్దుతుంది. కానీ దురుద్దేశంతో కూడుకున్నదైతేనే ప్రమాదం. కొందరు సమయం, సందర్భం లేకుండా ప్రతీసారి విమర్శిస్తుంటారు. ఇలాంటి ప్రవర్తన కలిగిన వారితో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే పనిగట్టుకొని విమర్శించేవారివల్ల మీలోని ఆత్మవిశ్వాసం, నమ్మకం సన్నగిల్లే చాన్స్ ఉంటుంది. మిమ్మల్ని అణచి వేయడానికి, మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి కూడా కొందర ఇలా చేసే అవకాశం ఉంటుందని సైకాలజిస్టులు అంటున్నారు.

నిందలు వేయడం

మీ మేలు కోరి తప్పులు ఎత్తిచూపడం వేరు. వీరు మీ ఆత్మీయుల కేటగిరీలోకి వస్తారు. అయితే వీరు బహిరంగంగా అలా చేయరు. మీతో మాత్రమే చెబుతారు. కానీ కొందరు మీరెప్పుడు తప్పులో దొరుకుతారా? అని ఎదురు చూస్తుంటారు. బహిరంగంగా దానిని ఎత్తి చూపుతూ నిందలు వేస్తుంటారు. చివరికి తమ లోపాలు, పొరపాట్లకు కూడా అవతలి వ్యక్తిపైనే నిందలు మోపుతుంటారు. ఇలాంటి వారిని దూరం పెడితేనే మీరు సంతోషంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

గాసిప్స్ క్రియేటర్స్

మీరు ఏదీ చేయకపోయినా ఏదో చేసినట్లు అవతలి వ్యక్తి గాసిప్స్ క్రియేట్ చేస్తారు. తాను మంచి వ్యక్తిని అనిపించుకోవడానికి మిమ్మల్ని చెడ్డ వ్యక్తులుగా కూడా ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంటారు. పై అధికారుల వద్ద, ప్రముఖల వద్ద సింపతీ కోసం తమ పక్కనున్న వాళ్లు, స్నేహితులు, బంధువులు ఇలా ఎవరినో ఒకరిపై గాసిప్స్ ప్రచారం చేస్తూ మెప్పు పొందుతుంటారు. కానీ చివరికి ఇది వారికే నష్టం చేస్తుంది. ఎందుకంటే గాసిప్స్, అబద్ధాలు ఏదో ఒకరోజు తేలిపోతాయి. అయితే ఆలోగా మీకు జరిగే నష్టం జరిగిపోవచ్చు. కాబట్టి తరచుగా ఎవరైనా మీమీద గాసిప్స్ క్రియేట్ చేస్తున్నట్లు గుర్తిస్తే వారిని దూరం పెట్టడమే బెటర్. అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.

కంట్రోల్ చేసుకోలేని ప్రవర్తన 

తమను తాము కంట్రోల్లో ఉంచుకోలేని వ్యక్తులు తరచుగా ఇతరులను తప్పుపడుతుంటారు. ఇతరులపై నిందలు వేస్తుంటారు. ఇతరులను చులకన చేయడం, నలుగురిలో వారిని తక్కువ చేసి మాట్లాడటం చేస్తుంటారు. ఇలాంటి ప్రవర్తన కలిగినవారు తాము చేసే పనులపై మానసికంగా, శారీరకంగా నియంత్రణను కోల్పోతుంటారు కూడా. దీంతో గొడవలకు దిగడం, నిందలు వేయడం, ఇతరులు ఏది చెప్పినా వాస్తవంతో సంబంధం లేకుండా నమ్మేయడం చేస్తుంటారు. ఇలాంటి వారివల్ల కూడా మీరు మనశ్శాంతిగా ఉండలేరు. కాబట్టి వీరికి దూరంగా ఉండటం బెటర్.

Tags:    

Similar News