ఆర్నెళ్లకే మూతపడ్డ స్ట్రీమింగ్ సర్వీస్
దిశ, వెబ్‌డెస్క్ : థియేటర్లు పోయి స్ట్రీమింగ్ సర్వీస్‌ల హవా నడుస్తున్న జమానా ఇది. మరి ఒక్క స్ట్రీమింగ్ సర్వీస్ హిట్ అయిందంటే ఇక మిగతా పెట్టుబడిదారులు ఆగుతారా? వినూత్న ఐడియాలతో విడిగా స్ట్రీమింగ్ సర్వీస్ యాప్‌లను రూపొందించి విడుదల చేస్తారు. అలా ఒక వినూత్న ఐడియాతో ఏప్రిల్ 6న విడుదలైన ఓ స్ట్రీమింగ్ సర్వీస్ త్వరలో మూతపడబోతోందని ఆ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. కేవలం మొబైల్‌కే పరిమితమై పది నిమిషాల కంటే తక్కువ నిడివి ఉన్న […]
దిశ, వెబ్‌డెస్క్ : థియేటర్లు పోయి స్ట్రీమింగ్ సర్వీస్‌ల హవా నడుస్తున్న జమానా ఇది. మరి ఒక్క స్ట్రీమింగ్ సర్వీస్ హిట్ అయిందంటే ఇక మిగతా పెట్టుబడిదారులు ఆగుతారా? వినూత్న ఐడియాలతో విడిగా స్ట్రీమింగ్ సర్వీస్ యాప్‌లను రూపొందించి విడుదల చేస్తారు. అలా ఒక వినూత్న ఐడియాతో ఏప్రిల్ 6న విడుదలైన ఓ స్ట్రీమింగ్ సర్వీస్ త్వరలో మూతపడబోతోందని ఆ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. కేవలం మొబైల్‌కే పరిమితమై పది నిమిషాల కంటే తక్కువ నిడివి ఉన్న ఎపిసోడ్‌లను మాత్రమే ప్రసారం చేస్తూ, షార్ట్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్‌గా విడుదలైన ‘క్విబీ’ త్వరలో మూతపడబోతోంది. అయితే ఏ రోజున మూతపడబోతుందనే తేదీని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో పేరుపొందిన వ్యాపారస్తులందరూ కలిసి ఆవిష్కరించిన ఈ స్ట్రీమింగ్ సర్వీస్ ఇలా అర్థాంతరంగా ఆగిపోతుండటం నిజంగా బాధాకరం. అయితే తర్వాతి తరానికి ఉపయోగపడే కథనాలను దృష్టిలో ఉంచుకుని సమయాన్ని ఎక్కువగా వృథా చేయకుండా షార్ట్‌గా చెప్పాలనే ఉద్దేశంతో ఈ స్ట్రీమింగ్ సర్వీస్‌ను విడుదల చేశారు. అయితే ఈ వినూత్న ఐడియా జనాల్లోకి పెద్దగా చేరలేదని, అందుకే తాము ప్రొడక్షన్ నిలిపివేస్తున్నట్లు బోర్డ్ చైర్మన్ జెఫ్రీ కాట్జెన్‌బర్గ్ తెలిపారు. అప్పటికే డిస్నీ, హెచ్‌బీవో లాంటి దిగ్గజ సంస్థల స్ట్రీమింగ్ సర్వీస్‌లు విడుదల కావడం, అలాగే చెప్పుకోదగ్గ కార్యక్రమం ఏదీ ఈ క్విబీలో రాకపోవడం వల్ల విడుదల చేసిన వారంలో ఈ యాప్ డౌన్‌లోడ్‌లు దారుణంగా పడిపోయాయి. అంతేకాకుండా ఇది కేవలం స్మార్ట్ ఫోన్‌లో మాత్రమే పనిచేయడం, టీవీలకు సపోర్ట్ చేయకపోవడం కూడా ఆదరణ లభించకపోవడానికి కారణమని విమర్శకుల అభిప్రాయం.