స్టాఫ్ నర్సు పోస్టులపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్లారిటీ

దిశ, తెలంగాణ బ్యూరో : స్టాఫ్ నర్సు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేని కారణంగా ఖాళీగా మిగిలిపోయినవాటికి వెయిటింగ్ లిస్టు ఉండదని, ఆ ఖాళీ పోస్టులన్నీ వచ్చే నోటిఫికేషన్ జమ అవుతాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. మొత్తం 3311 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిందని, 70% మార్కులు రాత పరీక్ష నుంచి, 30% మార్కులు వెయిటేజ్ నుంచి తీసుకుని ఉత్తీర్ణతను నిర్ణయించామని, అర్హత పొందిన 2,418 మందిని ఎంపిక చేసినట్లు […]

Update: 2021-06-01 10:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : స్టాఫ్ నర్సు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేని కారణంగా ఖాళీగా మిగిలిపోయినవాటికి వెయిటింగ్ లిస్టు ఉండదని, ఆ ఖాళీ పోస్టులన్నీ వచ్చే నోటిఫికేషన్ జమ అవుతాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. మొత్తం 3311 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిందని, 70% మార్కులు రాత పరీక్ష నుంచి, 30% మార్కులు వెయిటేజ్ నుంచి తీసుకుని ఉత్తీర్ణతను నిర్ణయించామని, అర్హత పొందిన 2,418 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఖాళీగా ఉండిపోయిన 893 పోస్టుల విషయంలో వెయిటింగ్ లిస్టు ఉంటుందనే అభిప్రాయాలు చాలా మంది అభ్యర్థుల్లో ఉన్నయని, కానీ అలాంటిది ఉండదని కమిషన్ కార్యదర్శి వాణీ ప్రసాద్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

అభ్యర్థుల అర్హతను నిర్ణయించడంలో అవతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయని, కానీ అందులో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. ఓసీ అభ్యర్థులకు 40% (రాత పరీక్ష, వెయిటేజీ మార్కులు కలిపి), బీసీ అభ్యర్థులకు 35%, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30% మార్కులను అర్హతగా నిర్ణయించామని, అర్హత సాధించినవారిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌‌కు పిలిచామని, చివరకు అర్హులైన 2,418 మందితో జాబితాను ప్రకటించామని వివరించారు. ఖాళీ పోస్టుల్లో జనరల్‌తో పాటు రిజర్వేషన్ కేటగిరీలు కూడా ఉన్నాయన్నారు. అర్హులైనవారు లేనందునే ఆ పోస్టులు ఖాళీగా ఉండిపోయాయని, వచ్చే నోటిఫికేషన్‌కు వీటిని జమ చేయనున్నట్లు తెలిపారు.

కొత్త కమిషన్ తొలి సమావేశం

ఐఏఎస్ అధికారి జనార్ధన్ రెడ్డి ఛైర్మన్‌గా ఎనిమిది మందితో కొలువుదీరిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలక మండలి తొలి సమావేశం మంగళవారం జరిగింది. అఖిల భారత సర్వీసుకు చెందిన అభ్యర్థులకు ఏప్రిల్ నెలలో నిర్వహించిన డిపార్టుమెంటల్ అర్థ వార్షిక పరీక్షా ఫలితాలను అధ్యయనం చేసి ఆమోదించింది. తక్షణం చేపట్టాల్సిన కార్యాచరణ గురించి కూడా చర్చించింది. స్టాఫ్ నర్సుల తుది జాబితాపై వచ్చిన ఆరోపణలను కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. కొత్తగా కమిషన్ సభ్యులుగా నియమితులైన ధన్‌సింగ్, ప్రొఫెసర్ లింగారెడ్డి, అరుణ కుమారి, సుమిత్రా ఆనంద్, కారం రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు, సత్యనారాయణలతోపాటు ముఖ్య కార్యదర్శి, పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు.

Tags:    

Similar News