చెప్పేవారే పాటించకుంటే ఎలా?
దిశ, మహబూబ్ నగర్: అందరికీ చెప్పేవారే నిబంధనలు పాటించకుంటే ఎలా అంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ప్రజలు సామాజిక దూరం పాటించాలని ఎప్పటికపుడు సూచిస్తున్నది. దీంతో ఎమ్మెల్యేల దగ్గరి నుండి అధికారుల వరకు అందరూ కూడా దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళేందుకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. అయితే.. బాధ్యత గల హోదాలో ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రం వీటిని ఆచరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు అవగాహన […]
దిశ, మహబూబ్ నగర్: అందరికీ చెప్పేవారే నిబంధనలు పాటించకుంటే ఎలా అంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ప్రజలు సామాజిక దూరం పాటించాలని ఎప్పటికపుడు సూచిస్తున్నది. దీంతో ఎమ్మెల్యేల దగ్గరి నుండి అధికారుల వరకు అందరూ కూడా దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళేందుకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. అయితే.. బాధ్యత గల హోదాలో ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రం వీటిని ఆచరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన నాయకులు ఈ విధంగా వ్యవహరించడం ఏమిటని మండిపడుతున్నారు. సామాన్యులు గుంపులు గుంపులుగా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు పెడతామని చెబుతున్న పోలీసులు, అధికారులు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ముందు చెప్పాలంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.
ప్రభుత్వం అందించే సహాయాన్ని అయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా నిర్వహించాలని, ముఖ్యంగా ప్రజలు గుంపులుగా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. కానీ, కొంత మంది నాయకులు మాత్రం వాటిని పెడచెవిన పెడుతూ తమ పని తాము చేసుకుపోతున్నారు. వారు వెళ్లేచోట మందిమార్బలంతో గుంపులుగుంపులుగా నాయకులు, కార్యకర్తలతో కార్యక్రమాలను నిర్వహించడంతో ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు.
ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తాజాగా తన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అయన పేదలకు, నిరాశ్రయులకు బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ, పంట కొనుగోళ్ల కేంద్రం ప్రారంభ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ గుంపులు గుంపులుగా నాయకులు, కార్యకర్తలు ఉండడంపై పలు విమర్శలు వస్తున్నాయి. అదే విధంగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి సైతం నారాయణపేట జెడ్పీ చైర్మన్ వనజమ్మ, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా.. పదుల సంఖ్యలో నాయకులను, కార్యకర్తలను వెంట బెట్టకుని వచ్చి కొనుగోళ్ల కేంద్రాన్నిప్రారంభించారు. మరికొంత మంది కూడా తమ చుట్టూ అనుచర గణాన్ని వెంటబెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలతోపాటు ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నారు. మొత్తం మీద ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాటలను ముందుగా ఆచరించాల్సిన నాయకులే ఇలా వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి.
Tags: Mahabubnagar MLAs, Guvvala Balaraju, Rammohan Reddy, Corona