దుబ్బాకలో రఘునందన్ రావుకు ఎదురీతేనా..?
దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నిక పోరులో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గెలుపొందారు. ఆయన గెలుపొంది ఎనిమిది నెలలు పూర్తవుతుంది. అయినా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇప్పటివరకు నెరవేరలేదని స్థానికులు చెబుతున్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ఇప్పటికే పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. యువత ఉపాధి కోసం పట్టణాల బాటపడుతూనే ఉంది. బీడి, చేనేత, ఇతర వృత్తి కార్మికులు జీవనోపాధి కోసం తిప్పలు పడక […]
దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నిక పోరులో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గెలుపొందారు. ఆయన గెలుపొంది ఎనిమిది నెలలు పూర్తవుతుంది. అయినా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇప్పటివరకు నెరవేరలేదని స్థానికులు చెబుతున్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ఇప్పటికే పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. యువత ఉపాధి కోసం పట్టణాల బాటపడుతూనే ఉంది. బీడి, చేనేత, ఇతర వృత్తి కార్మికులు జీవనోపాధి కోసం తిప్పలు పడక తప్పడం లేదు. దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం హామీలు నెరవేర్చకపోవడంతో స్థానిక ప్రజలు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల హామీలు అమలయ్యేనా?
దుబ్బాక ఉప ఎన్నిక కేవలం దుబ్బాకకే కాదు .. కేసీఆర్ అహంకారానికి, నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరు.. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి .. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల మాదిరిగా దుబ్బాకను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రజలకు హమీ ఇచ్చారు. వీటితో పాటు మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు సిద్దిపేట రంగనాయకసాగర్, గజ్వేల్ కొండపోచమ్మసాగర్ భూ నిర్వాసితులు ఇచ్చిన మాదిరిగా.. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు తాను గెలిచిన ఆరు నెలల్లోపు నష్ట పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
అంతేగాకుండా దుబ్బాకలో మెజార్టీ స్థాయిలో బీడి, చేనేత కార్మికులు ఉంటారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. దుబ్బాక యువతకు స్థానికంగా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. చేగుంటలో డిగ్రీ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. అతి త్వరలో దుబ్బాకలో వంద పడకల ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. వీటితో పాటు అనేక హామీల వర్షం కురిపించారు. కానీ ఇందులో ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. కేవలం అధికార పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ, పల్లె , పట్టణ ప్రగతి, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారే తప్ప.. ప్రజలకిచ్చిన హామీలపై దృష్టి సారించడం లేదని ఇతర పార్టీల నాయకులు ముచ్చటించుకుంటున్నారు.
ఎమ్మెల్యేపై స్థానికుల్లో ఆగ్రహం
దుబ్బాక నియోజకవర్గానికి పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్‌రావు మంచి పేరున్న వకీల్, ఉన్నత విద్య అభ్యసించారు. దుబ్బాక నియోజకవర్గంపై పూర్తి పట్టుంది. భూ నిర్వాసితుల పక్షాన పోరాటాలు చేసిన వ్యక్తిని గెలిపిస్తే దుబ్బాక అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని భావించారు. కానీ ఎమ్మెల్యేగా ఎన్నికై ఎనిమిది నెలలు పూర్తవుతున్నా.. ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. దీంతో మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు స్థానిక ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆరు నెలల్లో పూర్తి నష్ట పరిహారం ఇప్పిస్తానని చెప్పి ఇంత వరకు నెరవేర్చలేదన్నారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గెలిచిన తర్వాత చేనేత కార్మికులు తమ సమస్యలపై ధర్నా నిర్వహించారు.
ఆ సందర్భంలో చేనేత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కానీ ఆ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. బీడీ కార్మికులందరికి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పినా.. అది కూడా అమలు కాలేదు. ఇక్కడి నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని సైతం హమీనిచ్చారు. అది నెరవేరలేదు. ఇప్పటివరకు ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్టు కూడా ఎక్కడా కన్పించడం లేదు. నిరుద్యోగుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పినా.. ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఏ చోట ధర్నాలు నిర్వహించడం కానీ, ధర్నాలు చేసిన చోట కనీసం పాల్గొనడం లాంటి కార్యక్రమాలు చేయలేదంటున్నారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందడం కష్టమేనంటున్నారు స్థానికులు.