‘తొలిసారి పటాసులపై ఊగిసలాట’

దిశ ప్రతినిధి, నిజామాబాద్: దీపావళి పండుగ అంటే చాలు గుర్తుకు వచ్చేది దీపాల వరుస, పటాసులే.. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా ఉత్సాహంగా జరుపుకొనే వేడుక. ఆ రోజు పటాసులు కాల్చడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని స్వచ్ఛంద సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నెత్తి నోరు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతి యేటా రూ. కోట్లలో పటాసుల విక్రయాలు జరుగుతుంటాయి. ఈ సారి కరోనా ప్రభావం వాటిపై కూడా పడింది. పర్యవరాణానికి హాని […]

Update: 2020-11-13 13:13 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: దీపావళి పండుగ అంటే చాలు గుర్తుకు వచ్చేది దీపాల వరుస, పటాసులే.. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా ఉత్సాహంగా జరుపుకొనే వేడుక. ఆ రోజు పటాసులు కాల్చడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని స్వచ్ఛంద సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నెత్తి నోరు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతి యేటా రూ. కోట్లలో పటాసుల విక్రయాలు జరుగుతుంటాయి. ఈ సారి కరోనా ప్రభావం వాటిపై కూడా పడింది. పర్యవరాణానికి హాని కలిగించడంతోపాటు కొవిడ్​బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో పలు రాష్ట్రాలు పటాసులను బ్యాన్​ చేశాయి. తెలంగాణలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వాటిని నిషేధించాలని హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు అనుమతించింది.

జిల్లాల్లో భారీగా పటాసుల నిల్వలు
పటాసులను కాల్చవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే వరకూ నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు మిగతా ప్రాంతాల్లో వ్యాపారులు పటాసులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నాయి. అప్పటికే అమ్మకాలు కూడా షురూ అయ్యాయి. విక్రయాలపై నిషేధం ఉత్తర్వులు శుక్రవారం ఉదయం కలెక్టర్లకు చేరడంతో వారు పోలీస్, రెవెన్యూ, అగ్ని మాపక శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. హోల్ సెల్, రిటైల్ దుకాణాలను మూసివేయించడంతో వ్యాపారుల గుండెల్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. రూ. లక్షలు వెచ్చించి పటాసులను కొనుగోలు చేశామని, పండుగకు 24 గంటల ముందు నిషేధం విధిస్తే తమ పరిస్థితి ఏంటని లబోదిబోమన్నారు. అధికారులు నిఘా పెట్టడంతో కొందరు వ్యాపారులు పటాసులను రహస్యంగా విక్రయించారే గానీ బహిరంగంగా అమ్ముకోలేక పోయారు.

గ్రీన్​క్రాకర్స్​కు అనుమతి
తెలంగాణలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు కోర్టు అనుమతిచ్చింది. పర్యావరణ హితం ఉండేవాటినే అనుమతించాలని తెలిపింది. అయితే అంతకు ముందే తాము పెద్ద ఎత్తున పటాసులను దిగుమతి చేసుకున్నమని, ఇప్పటికిప్పుడు గ్రీన్​క్రాకర్స్​ ఎక్కడ నుంచి తెచ్చేదని వ్యాపారులు వాపోతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పది మంది హోల్​సేల్, వంద మంది రిటేల్​వ్యాపారులుంటారు. వారు ఆంధ్ర, తమిళనాడు నుంచి పటాసులను దిగుమతి చేసుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ సారి ప్రభుత్వం, న్యాయస్థానం గ్రీన్ క్రాకర్స్ కు అనుమతి ఇచ్చింది. సాయంత్రం 8 నుంచి 10 గంటల వరకు కాల్చాలని సూచించింది. కానీ, ఒక్క రోజులో జరిగిన పరిణామాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అసలు పటాసులు కొనుగోలు చేయాలా వద్దా అని సందిగ్దంలో పడేలా చేశాయి. దీతో దీపావళి పండగకు ముందు రోజు ధన త్రయోదశి నాడు పటాసులు కాల్చే సందడి కనిపించలేదు. కానీ, సాయంత్రం వరకు వ్యాపారులు తమ దుకాణాల్లో పటాసులను విక్రయించారు. ప్రభుత్వం వెంట వెంటనే తీసుకున్న నిర్ణయంతో పండుగ జోష్ లేదని, శనివారం అమ్మకాలు సరిగా లేకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని రిటేల్ వ్యాపారులు వాపోయారు.

Tags:    

Similar News