Dalit Bandhu: సీఎం కేసీఆర్‌కు షాక్.. 'దళితబంధు'కు చిక్కులు స్టార్ట్ (వీడియో)

దిశ ప్రతినిధి, కరీంనగర్: ‘దళిత బంధు’ కార్యక్రమానికి ఆదిలోనే అభ్యంతరాలు మొదలయ్యాయి. లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటించలేదని మండిపడుతూ తహసీల్దార్ చాంబర్ ముట్టడించిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వీణవంక మండల కేంద్రంలో జరిగిన సంఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు‌. తుది జాబితా ఏ ప్రాతిపదికన తయారు చేశారంటూ స్థానిక తహశీల్దార్ సరితతో వాగ్వాదానికి దిగారు. వీణవంక […]

Update: 2021-08-13 06:30 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: ‘దళిత బంధు’ కార్యక్రమానికి ఆదిలోనే అభ్యంతరాలు మొదలయ్యాయి. లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటించలేదని మండిపడుతూ తహసీల్దార్ చాంబర్ ముట్టడించిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వీణవంక మండల కేంద్రంలో జరిగిన సంఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు‌. తుది జాబితా ఏ ప్రాతిపదికన తయారు చేశారంటూ స్థానిక తహశీల్దార్ సరితతో వాగ్వాదానికి దిగారు. వీణవంక మండల కేంద్రానికి 35 యూనిట్లు మంజూరుకాగా.. వీరిలో కేవలం టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారి పేర్లే రాశారని తహశీల్దార్‌తో గొడవకు దిగారు.

ఈ నెల 16న ముఖ్యమంత్రి చేతుల మీదుగా కొంతమంది లబ్దిదారులకు దళిత బంధు చెక్కులు అందజేయనున్నారు. ఇందులో వీణవంక మండలంలోని 26 గ్రామాలకు చెందిన 351 మంది లబ్ది దారులకు రూ. 10లక్షల చొప్పున అందజేయనున్నారు. ఇందుకోసం ఫైనల్ లిస్టు తయారు చేయగా.. అందులో చాలామంది ఉద్యోగులు, స్థానికేతరులు, టీచర్లు ఉన్నారని ఆరోపిస్తున్నారు. నిరుపేదలను, ఇల్లు లేని వారిని, కూలీలను వదిలేసి ధనవంతులకు దళిత బంధు పథకం ఎలా వర్తింపజేస్తారంటూ నిలదీశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో వీణవంక ఉప సర్పంచ్ భానుచందర్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు మేకల ఎల్లారెడ్డి, పలువురు దళిత ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఇది ఫైనల్ లిస్ట్ కాదని, మళ్లీ జాబితా విడుదల చేస్తామని తహశీల్దారు చెబుతున్నారు.

ఈటలను గెలిపిస్తావా ఏందీ.?

దళిత బంధు పథకంలో లబ్దిదారులను ఎంపిక చేస్తున్న విధానం సరిగా లేదని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఎల్లారెడ్డి ఆరోపించారు. ఇలా అమలు చేసి ఈటల రాజేందర్ ను గెలిపిస్తారా ఏంటీ అంటూ ప్రశ్నించారు. ఒకే సారి రూ. 10 లక్షలు ఇవ్వకుండా మూడు విడుతలుగా 2023 వరకు లబ్దిదారులకు డబ్బులు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు.

జమ్మికుంటలో కూడా…

మరో వైపు జమ్మికుంట మండలం కోరెపల్లి గ్రామస్థులు గ్రామపంచాయితీ ముందు కూడా ఆందోళన చేపట్టారు. ఒకే సారి గ్రామంలోని అర్హులైన వారి పేర్లతో కూడిన జాబితాను విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. అలాగే ఇల్లందకుంట గ్రామంలోని శ్రీరాములపల్లి గ్రామంలో స్థానికంగా లేని లబ్దిదారులను ఎంపిక చేశారంటూ గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.

కందుగులలో ఆందోళన

హుజురాబాద్ మండలం కందుగులలో కేవలం ఎనిమిది మంది లబ్దిదారులనే ఎంపిక చేశారంటూ గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. హుజురాబాద్, పరకాల రహదారిపై బైఠాయించిన గ్రామస్థులు తమ లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ మండిపడ్డారు. గ్రామంలో లేని వ్యక్తులను లబ్దిదారులుగా ఎంపిక చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 250 కుటుంబాలు ఉంటే ఎనిమిది మందినే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. హుజురాబాద్ జడ్పీటీసీ బక్కారెడ్డి, అతని భార్య ప్రభావతి ఈ గ్రామానికి సర్పంచ్ గా వ్యవహరిస్తున్నారు.

Tags:    

Similar News