ధాన్యం కొనుగోళ్లకు ‘గోనె సంచుల’ దెబ్బ

దిశ, మేడ్చల్: రబీ సీజన్ దాదాపు ముగిసేందుకు వచ్చింది. కరోనా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు పంట ఎలా అమ్ముకోవాలని రైతులు గుబులు పడ్డారు. అయితే ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్‌శాఖల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక తమ ధాన్యాన్ని ఎలాగైన అమ్ముకోవచ్చనే ధీమాతో పంట కోతలు మొదలు పెట్టారు. కానీ ఇంతలోనే రైతులకు మరో టెన్షన్ వచ్చి పడింది. ప్రస్తుతం సరిపడ బస్తాలు లేకపోవడంతో ధాన్యాన్ని ఎలా […]

Update: 2020-04-08 01:13 GMT

దిశ, మేడ్చల్: రబీ సీజన్ దాదాపు ముగిసేందుకు వచ్చింది. కరోనా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు పంట ఎలా అమ్ముకోవాలని రైతులు గుబులు పడ్డారు. అయితే ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్‌శాఖల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక తమ ధాన్యాన్ని ఎలాగైన అమ్ముకోవచ్చనే ధీమాతో పంట కోతలు మొదలు పెట్టారు. కానీ ఇంతలోనే రైతులకు మరో టెన్షన్ వచ్చి పడింది. ప్రస్తుతం సరిపడ బస్తాలు లేకపోవడంతో ధాన్యాన్ని ఎలా మార్కెట్లకు తీసుకెళ్లాలనేది అర్థం కాకుండా మారింది.

రాష్ట్రవ్యాప్తంగా 20కోట్ల బస్తాలు అవసరం

లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గోనె సంచులకు తీవ్ర కొరత ఏర్పడింది. రబీ సీజన్‌లో దాదాపు 1.05 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారుల అంచనా వేయడంతో, కోనుగోలు చేసేందుకు 20 కోట్ల గోనె సంచులు అవసరం ఉంది. కానీ రాష్ట్రంలో 10 కోట్ల బస్తాలు కూడా అందుబాటులో లేవు. దీంతో రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాల నుంచి ఎలా బయటపడాలన్న విషయం అంతుపట్టడం లేదు. ఇదిలావుంటే.. బహిరంగ మార్కెట్‌లో గన్నీ సంచులకు డిమాండ్ బాగా పెరిగింది. ఇదివరకు ఒక్కో సంచికి రూ.30కి అమ్మినవారు ప్రస్తుతం రూ.100కు విక్రయిస్తున్నారు.

కొనుగోళ్లపై ఎఫెక్ట్

గన్నీ సంచుల కొరత ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం చూపనుంది. దాదాపు రైతులందరూ మిషన్ల ద్వారా పంట కోత చేపడుతున్న నేపథ్యంలో మార్కెట్లకు ట్రాక్టర్ల ద్వారానే ధాన్యం తరలిస్తున్నారు. దీంతో గతంలో లాగా ధాన్యం తరలించేందుకు పెద్దగా గన్నీ సంచుల అవసరం పడట్లేదు. కూలీ వాళ్లు పంట కోసిన చోట మాత్రం తప్పనిసరిగా గన్నీ సంచుల అవసరం పడుతుంది. అయితే రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన తర్వాత వడ్లను కుప్పగా పోస్తారు. రైతుల వారీగా తమ వంతు వచ్చే వరకు వేచి ఉండాలి. అయితే రైతులు మార్కెట్లో ధాన్యం పోసిన దగ్గరి నుంచి కాంటా అయ్యే వరకు రైతులదే బాధ్యత. దీంతో గన్నీ సంచుల కొరత వల్ల ధాన్యం కాంటా అయ్యే పరిస్థితి లేదు.

అయితే గన్నీ సంచుల కొరతను అధిగమించేందుకు లాక్‌డౌన్‌ భాగంగా పంపిణీ చేసిన బియ్యం తాలూకు బస్తాలను వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం.. సివిల్ సప్లై బస్తాలు కేవలం 60 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 30 శాతానికి పైగా బస్తాలను డీలర్లు స్థానికంగా రైతులకు, చిల్లర వ్యాపారులకు అమ్మేసుకున్నారు. ఇక మిగిలిన దాదాపు 40 లక్షల గన్నీ సంచులు ధాన్యం కొనుగోళ్లకు ఏ మూలకు సరిపోవు. రైస్ మిల్లర్ల నుంచి సేకరిస్తామని అధికారులు చెబుతున్నారు. నిజానికి రైస్ మిల్లర్లకు ఇదే మంచి సీజన్. ఈ సీజన్‌లో వారి దగ్గర ఉన్న బస్తాలను సొంతంగా వారు కొనుగోలు చేసే ధాన్యానికే వినియోగిస్తారు.

దేశం మొత్తానికి బెంగాల్ దిక్కు

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు జరిగే సీజన్. అయితే జనపనార(గోనె సంచులు) సంచులు తయారయ్యేది పశ్చిమబెంగాల్‌లోనే. ఇక్కడి నుంచి 80 శాతం బస్తాలు సరఫరా అవుతాయి. మిగిలిన 20శాతం బస్తాలు పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ తయారవుతాయి. అయితే లాక్‌డౌన్‌లో భాగంగా జనపనార మిల్లులు మూతపడ్డాయి. దీంతో గోనె సంచుల ఉత్పత్తి నిలిచిపోయింది. ధాన్యం సేకరణ సీజన్ ఇదే కావడం.. గోనె సంచుల ఉత్పత్తి ఆగిపోవడం.. తిరిగి ఉత్పత్తిని ప్రారంభించేందుకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నో చెప్పడం.. ఈ అంశాలన్నీ రైతులకు గడ్డుకాలాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చెబితే తప్ప.. గోనె సంచుల ఉత్పత్తి మిల్లులు తెరుచుకునేలా లేవు.

వరుణుడి ముప్పు

ఇదిలావుంటే.. మరోవైపు వరుణుడి ముప్పు పొంచి ఉంది. గోనె సంచుల కొరత వల్ల రైతులు పంటలను కోయడం ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే.. పంట కోతలు మొదలు కాకముందే వడగళ్ల వర్షం పడితే.. తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా.. వర్షం నుంచి ముప్పు తప్పేలా లేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో తాత్కాలికంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల అక్కడ కనీసం సౌకర్యాలు లేవు. పంట పొలాలు, ఖాళీస్థలాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ కొద్దిపాటి వరదలు వచ్చినా పంటంతా తడిసే ప్రమాదం ఉంది.

Tags: corona virus, rabi season, gunny bags shortage, rain, IKP, marketing, west bengal, rain, rice millers, dealers

Tags:    

Similar News