సర్కారు బడుల్లో సమస్యలు

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బడిగంట మళ్లీ మోగనుంది. సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరిచేందుకు సర్కారు నిర్ణయించింది. పాఠశాలల్లో 9,10వ తరగతి విద్యార్థులకు, కళాశాల్లో ఇంటర్ ​విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పాఠశాలల్లో పారిశుధ్యం, శానిటైజేషన్, టాయిలెట్లు, బెంచీల సమస్య తీవ్రంగా వేధిస్తుండగా.. బడికి పంపేందుకు సగానికిపైగా తల్లిదండ్రులు సుముఖంగా లేరు. దీంతో సర్కారు విద్యాసంస్థలు సమస్యలకు నిలయాలుగా మారాయి. మంచిర్యాల జిల్లాలో 9, 10, ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు […]

Update: 2021-01-31 20:32 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బడిగంట మళ్లీ మోగనుంది. సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరిచేందుకు సర్కారు నిర్ణయించింది. పాఠశాలల్లో 9,10వ తరగతి విద్యార్థులకు, కళాశాల్లో ఇంటర్ ​విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పాఠశాలల్లో పారిశుధ్యం, శానిటైజేషన్, టాయిలెట్లు, బెంచీల సమస్య తీవ్రంగా వేధిస్తుండగా.. బడికి పంపేందుకు సగానికిపైగా తల్లిదండ్రులు సుముఖంగా లేరు. దీంతో సర్కారు విద్యాసంస్థలు సమస్యలకు నిలయాలుగా మారాయి.

మంచిర్యాల జిల్లాలో 9, 10, ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు 23,854 మంది ఉండగా.. 10, 616 మందిని మాత్రమే బడికి పంపేందుకు తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేశారు. జిల్లాలో 270 ఉన్నత పాఠశాలలు ఉండగా.. 9,10వ తరగతి చదివే విద్యార్థులు 21,689 మంది ఉండగా.. 9,836 మంది తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలను బడికి పంపేందుకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. ఈ లెక్కన సగానికిపైగా విద్యార్థులను బడికి పంపేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇది మచ్చుకు ఉదాహరణ మాత్రమే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఉంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 850 ఉన్నత పాఠశాలలు ఉండగా.. ఇందులో 9, 10వ తరగతి చదివే విద్యార్థులు 73,840 మంది ఉన్నారు. వీరికి రేపటి నుంచి బడులు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా.. సగానికిపైగా తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు.

పది నెలల తరువాత..

కరోనా నేపథ్యంలో సుమారు పది నెలల బడులకు తాళం వేశారు. దీంతో మార్చి 15 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభంకాగా, వైరస్ తీవ్రత మరింత పెరగడంతో అవి అర్ధాంతరంగా నిలిచి పోయాయి. నేటి నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనుండగా, చాలా మంది తల్లిదండ్రులు తమ విద్యార్థులను పంపేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. తమ పిల్లలకు భద్రత ఉండదని భావిస్తున్నవారు మరికొంత కాలం వేచి చూద్దామనే భావనతో ఉన్నారు. మందులు వాడుతున్నా.. జ్వరం, జలుబు ఉన్నా.. పాఠశాలలోకి అనుమతించరు. ఎలాంటి వ్యాధులు లేకుండా.. పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నామని తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రంపై సంతకం చేసుకుని రావాలి. దీంతో చాలా మంది విద్యార్థులు వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు సర్కారు బడుల్లో పాత సమస్యలు అలాగే ఉన్నాయి.

సమస్యలే.. సమస్యలు..

పాఠశాలల్లో మాస్కులు, శానిటైజర్లు, సామాజిక దూరం తప్పనిసరి చేశారు. గతంలో పదో తరగతి పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం శానిటైజర్లు, మాస్కులు తీసుకురాగా.. వీటిని ఆయా పాఠశాలలకు పంపిణీ చేశారు. ఇవి ఏ మాత్రం సరిపోని పరిస్థితి ఉంది. దీంతో పాఠశాల గ్రాంటు నుంచి శానిటైజర్లు, ఇతర సామగ్రి కోనుగోలుకు డీఈవోలు ఆదేశాలు జారీ చేశారు. పట్టణాల్లో మున్సిపాలిటీలకు, గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు పాఠశాలల శానిటైజేషన్ బాధ్యతలు అప్పగించగా.. గ్రామ పంచాయతీల్లో సరిపడా సిబ్బంది లేరు. దీంతో ప్రతి రోజు శానిటైజేషన్ ఎలా చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. . అలాగే 9, 10వ తరగతి అన్ని గ్రామాల్లోని పాఠశాలల్లో లేకపోగా.. వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్​ల కోసం అధికారులు ఏర్పాట్లు చేయగా.. చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. కరోనా సమయంలో చాలా రూట్లలో ఆర్టీసీ సర్వీసులను నిలిపివేసింది. దీంతో ఎవరి రవాణా ఏర్పాట్లు వారే చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక మధ్యాహ్న భోజన పథకం మళ్లీ అమలు చేస్తుండగా.. భోజనం చేయడమనేది విద్యార్థుల ఇష్టానికే వదిలేశారు. చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా బెంచీలు, టాయిలెట్లు పూర్తి స్థాయిలో లేవు. ఇక మోటార్లు చెడిపోయి ఉన్న కొద్ది టాయిలెట్లకు నీరు కూడా వచ్చే పరిస్థి లేదు. పాఠశాలల్లో పిల్లర్లు, పైకప్పు శిథిలావస్థకు చేరగా.. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా పాఠశాలల్లో సమస్యలు ఉన్నాయని, కొవిడ్​నేపథ్యంలో పాఠశాలలు తెరిచినా ఎంతమంది పిల్లలు సద్వినియోగం చేసుకుంటారో చూడాల్సిన పరిస్థితి.

Tags:    

Similar News