వ్యాక్సిన్‌కు మొగ్గుచూపని ప్రైవేటు ఆస్పత్రులు
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాక్సిన్ రాగానే అందరికీ అందించాలని, తొలి డోస్ వైద్యారోగ్య సిబ్బందికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంటే ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం అంతగా సహకరించడం లేదని అధికారులు వాపోతున్నారు. రాష్ట్రంలో తొలి డోస్ అందుకోవాల్సిన సుమారు 2.76 లక్షల వైద్యారోగ్య సిబ్బందిలో సగాని కంటే ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే వారేనని, ఇప్పటివరకు ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌లో వివరాలను అప్‌లోడ్ చేయలేదని ఓ అధికారి పేర్కొన్నారు. ఇంకో రెండు రోజుల్లో […]
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాక్సిన్ రాగానే అందరికీ అందించాలని, తొలి డోస్ వైద్యారోగ్య సిబ్బందికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంటే ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం అంతగా సహకరించడం లేదని అధికారులు వాపోతున్నారు. రాష్ట్రంలో తొలి డోస్ అందుకోవాల్సిన సుమారు 2.76 లక్షల వైద్యారోగ్య సిబ్బందిలో సగాని కంటే ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే వారేనని, ఇప్పటివరకు ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌లో వివరాలను అప్‌లోడ్ చేయలేదని ఓ అధికారి పేర్కొన్నారు. ఇంకో రెండు రోజుల్లో వివరాలన్నింటినీ సమర్పించాల్సిందేనంటూ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలిపారు. కొన్ని ఆస్పత్రులు వ్యాక్సిన్ డోస్‌లు ఇస్తే తామే సిబ్బందికి ఇస్తామని చెప్తుండగా మరికొన్ని యాజమాన్యాలు రకరకాల సాకులతో వివరాలను అప్‌లోడ్ చేయడం లేదని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ప్రకారం హైదరాబాద్ జిల్లాలో మొత్తం 970 ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో 60,288 మంది హెల్త్ కేర్ సిబ్బంది పని చేస్తుండగా 166 ప్రభుత్వ దవాఖానల్లో 16,156 మంది పనిచేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 76,804 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 59 ప్రభుత్వ హాస్పిటళ్లలో 5,899 మంది, 803 ప్రైవేటు ఆస్పత్రుల్లో 19,312 మంది పనిచేస్తున్నారు. ఇందులో కేవలం పది శాతం మంది వివరాలు మాత్రమే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయ్యాయని, ఇంకా 90 శాతం కావాల్సి ఉందని పేర్కొన్నారు. సర్కార్ దవాఖానల్లో పనిచేసే వారికి 24 కాలమ్‌లు, ప్రైవేటు ఆస్పత్రుల్లోని సిబ్బందికి 20 కాలమ్‌లు ఉన్నాయని వివరించారు. వివరాలను సైట్‌లో అప్‌లోడ్ చేసే ప్రక్రియకు గడువు దగ్గరపడుతోందని, తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వివరాలను ఇవ్వాల్సిందేనని ఆ అధికారి నొక్కిచెప్పారు.
టీకాలపై తప్పనిసరిగా ప్రభుత్వ పర్యవేక్షణ..
చాలా ప్రైవేటు ఆస్పత్రులు సిబ్బందికి టీకాలు తామే వేసుకుంటామని, డోస్‌లను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాయని, కానీ తప్పనిసరిగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరగాలని అధికారి నొక్కిచెప్పారు. ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌లో వివరాలను అప్‌లోడ్ చేయకుండా టీకాలను వాడే ప్రసక్తే లేదని తెలిపారు. వివరాలను ఇవ్వకపోవడానికి కారణాల గురించి ఆ అధికారిని ప్రశ్నించగా, నకిలీ క్లినిక్‌లు, రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా నడుస్తున్న ఆస్పత్రుల వివరాలు బయటపడుతాయన్న ఉద్దేశం కావచ్చని అభిప్రాయపడ్డారు. పెద్ద దవాఖానల దగ్గర టీకాల పంపిణీ ప్రభుత్వ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో అక్కడే ఉంటుందని, చిన్న ఆస్పత్రులు, క్లినిక్‌ల విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన దగ్గరికే వచ్చి చేయించుకోవాల్సి ఉంటుందని వివరించారు. ప్రైవేటు ఆస్పత్రులు కోరినట్టుగా వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చినట్లయితే నిజమైన లబ్ధిదారులకు అందడానికి బదులుగా కాసుక కక్కుర్తితో పేషెంట్లకు ఇవ్వడం ద్వారా దుర్వినియోగమవుతుందనే అనుమానం ఉంది. ఎంతమంది సిబ్బంది ఉన్నారో కూడా లెక్క తేలకుండా వ్యాక్సిన్ డోస్‌లు ఇవ్వడం ఎలా సాధ్యమని ఆ అధికారి అంటున్నారు.
సైడ్ ఎఫెక్టుల భయం కూడా..
వైద్యారోగ్య సిబ్బందికే తొలి డోస్ ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అయినప్పటికీ చాలామంది మాత్రం అందుకు వెనకాడుతున్నారు. వాటి ఫలితాలు, సైడ్ ఎఫెక్టు గురించి ఇంకా స్పష్టత రానందున ముందుగా వ్యాక్సిన్ తీసుకోడానికి జంకుతున్నారు. అందుకే ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు వారి వివరాలను సైట్‌లో అప్‌లోడ్ చేయడానికి వెనకాడుతున్నారు. ఈ కారణంగానే గత పది రోజులుగా వైద్యారోగ్య సిబ్బంది ‘కొవిన్’ సాప్ట్‌వేర్ గురించి మల్లగుల్లాలు పడుతున్నా ఇప్పటికీ పది శాతం వివరాలు కూడా ప్రైవేటు హాస్పిటళ్లు నుంచి అప్‌లోడ్ కాలేదు. వాటి నుంచి సహకారం ఆశించిన స్థాయిలో రాకపోవడంపై ఆ అధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు.