రైతులను తప్పుదారి పట్టించారు : మోడీ

న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ పొలిమేరల్లో రైతు ఆందోళనలు మూడోవారానికి చేరిన సందర్భంలో అన్నదాతల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడీ వారికి భరోసానిచ్చారు. కర్షకుల సమస్యలను తమ ప్రభుత్వం ఎన్నడూ విస్మరించలేదని ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు ప్రతిపక్షాల మాయమాటల్లో పడ్డారని అన్నారు. గుజరాత్‌లోని కచ్‌లో మెగా ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న కార్యక్రమంలో రైతులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. […]

Update: 2020-12-15 11:49 GMT

న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ పొలిమేరల్లో రైతు ఆందోళనలు మూడోవారానికి చేరిన సందర్భంలో అన్నదాతల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడీ వారికి భరోసానిచ్చారు. కర్షకుల సమస్యలను తమ ప్రభుత్వం ఎన్నడూ విస్మరించలేదని ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు ప్రతిపక్షాల మాయమాటల్లో పడ్డారని అన్నారు. గుజరాత్‌లోని కచ్‌లో మెగా ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న కార్యక్రమంలో రైతులను ఉద్దేశిస్తూ మాట్లాడారు.

ప్రతిపక్షంలో కూర్చున్నవారు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని, అన్నదాతల ఆందోళనల వెనుక విపక్షాల కుట్ర ఉన్నదని ప్రధాని మోడీ అన్నారు. రైతు సంఘాల దీర్ఘకాల డిమాండ్‌లు, ప్రస్తుత ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు చేపట్టాలని తలచిన సంస్కరణలే తమ ప్రభుత్వం చేసిందని వివరించారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని సంస్కరణలను తమ ప్రభుత్వం చేసి చూపెట్టిందని, అవి చరిత్రాత్మకమైన నిర్ణయాలని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని, వారి సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు. చట్టాలపై వారి సందేహాలను నివృత్తి చేయడానికి తమ ప్రభుత్వం 24 గంటలూ సిద్ధంగా ఉన్నదని వివరించారు.

ఢిల్లీ చుట్టూ ఒక కుట్ర జరుగుతున్నదని, రైతులను గందరగోళంలోకి నెట్టే వ్యూహాలు సాగుతున్నాయని ప్రధాని ఆరోపించారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలతో ఇతరులు రైతుల భూములను కబ్జా చేసుకుంటారని అన్నదాతలను భయపెడుతున్నారని అన్నారు. ‘ఒక డెయిరీ మీ నుంచి పాలు సేకరించే ఒప్పందం చేసుకుంటే, అది మీ నుంచి మీ పశువులనూ లాక్కెళ్తుందా?’ అని అడిగారు. గుజరాత్‌లో డెయిరీ ఉత్పత్తులు, సాగు-వర్తకం విరాజిల్లుతున్నదని, ప్రభుత్వం జోక్యం మితంగా ఉండటమే దీనికి కారణమని వివరించారు. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కచ్ ఒకటి అని, కనెక్టివిటీ దినదినం మెరుగవుతున్నదని కచ్‌ను ప్రశంసించారు. భూకంపమూ కచ్ వాసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేదని అన్నారు.

Tags:    

Similar News