సచిన్‌ను ఔట్ చేసినందుకు గిఫ్ట్ ఇచ్చారు: ఓజా

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ వికెట్ తీయడం అంటే ప్రతి బౌలర్‌కూ ఒక మధుర జ్ఞాపకమే. అలా తాను కూడా సచిన్ వికెట్ తీశానని, అందుకు జట్టు యాజమాన్యం ప్రత్యేక బహుమతి కూడా ఇచ్చిందని టీం ఇండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా చెప్పాడు. ఐపీఎల్ ప్రారంభించిన కొత్తలో ముంబై ఇండియన్స్ జట్టులో సచిన్ ఆడాడు. అదే సమయంలో డెక్కన్ చార్జర్స్ తరఫున ప్రజ్ఞాన్ ఓజా ప్రాతినిథ్యం వహించాడు. 2009 ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ను […]

Update: 2020-06-28 07:17 GMT

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ వికెట్ తీయడం అంటే ప్రతి బౌలర్‌కూ ఒక మధుర జ్ఞాపకమే. అలా తాను కూడా సచిన్ వికెట్ తీశానని, అందుకు జట్టు యాజమాన్యం ప్రత్యేక బహుమతి కూడా ఇచ్చిందని టీం ఇండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా చెప్పాడు. ఐపీఎల్ ప్రారంభించిన కొత్తలో ముంబై ఇండియన్స్ జట్టులో సచిన్ ఆడాడు. అదే సమయంలో డెక్కన్ చార్జర్స్ తరఫున ప్రజ్ఞాన్ ఓజా ప్రాతినిథ్యం వహించాడు. 2009 ఎన్నికల సమయంలో ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాకు తరలించారు. అప్పుడు డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య డర్బన్‌లో ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో సచిన్ వికెట్‌ను ప్రజ్ఞాన్ ఓజా తీశాడు. ఆనాటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘ముంబైతో మ్యాచ్‌కు ముందు రోజూ నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, డెక్కన్ చార్జర్స్ ఓనర్ అక్కడికి వచ్చి నాతో ఓ మాట అన్నాడు. ‘‘ప్రజ్ఞాన్.. నువ్వు రేపు మ్యాచ్‌లో సచిన్ వికెట్ పడగొడితే, నీకు స్పెషల్ గిప్ట్ ఇస్తా’’ అని చెప్పాడు. దానికి బదులుగా నేను కూడా, సార్.. నేను సచిన్ వికెట్ పడగొడితే నాకు వాచ్ కావాలని కోరాను. మొత్తానికి తర్వాత రోజు మ్యాచ్‌లో నేను సచిన్ వికెట్ పడగొట్టడం, నాకు వాచ్ గిఫ్ట్‌గా రావడం జరిగిపోయాయి’ అని ఓజా వెల్లడించాడు. కాగా, 2012 నుంచి ఓజా ముంబై ఇండియన్స్ తరఫునే ఆడటం విశేషం. సచిన్ టెండుల్కర్ రిటైర్మెంట్ ప్రకటించిన టెస్టు మ్యాచే ప్రజ్ఞాన్ ఓజాకు కూడా చివరి మ్యాచ్ కావడం కాకతాళీయమే.

Tags:    

Similar News