ఐఓఏలో ముసలం

– అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఢీఅంటేఢీ – వైబ్‌సైట్ నుంచి పేర్లు గల్లంతు – మరింత ముదిరిన వ్యవహారం దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. కొన్నాళ్లుగా అధ్యక్షుడు నరీందర్ బాత్రా, ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. 2017లో నరీందర్ బత్రా ఐఓఏ అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర నుంచే అతనిపై రాజీవ్ మెహతా పలు ఆరోపణలు చేస్తున్నారు. అప్పటికే ఐవోఏ […]

Update: 2020-06-23 01:01 GMT

– అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఢీఅంటేఢీ
– వైబ్‌సైట్ నుంచి పేర్లు గల్లంతు
– మరింత ముదిరిన వ్యవహారం

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. కొన్నాళ్లుగా అధ్యక్షుడు నరీందర్ బాత్రా, ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. 2017లో నరీందర్ బత్రా ఐఓఏ అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర నుంచే అతనిపై రాజీవ్ మెహతా పలు ఆరోపణలు చేస్తున్నారు. అప్పటికే ఐవోఏ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మెహతా అధ్యక్షుడిగా నరీందర్ ఎన్నిక చెల్లదని ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి గెలిచారని ఆయనపై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ)కి పిర్యాదు చేశారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుండటంతో నరీందర్ పదవీకాలాన్ని గత నెలలో మరోసారి పెంచారు. ఇక ఆ తర్వాత ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగింది.

ఉత్తరాఖండ్‌లోనే వ్యాపారం చేసుకో

గత మే నెలలో అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా పదవీకాలం పెంచిన తర్వాత అతను రాసిన ఈ-మెయిల్ పెను దూమారాన్ని రేపింది. ఐవోఏలో ప్రధాన కార్యదర్శి బాధ్యతలను కొన్నింటిని ఇతరులకు కేటాయించనున్నట్లు ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ‘నేను, అసోసియేషన్‌లోని ఇతర సభ్యులం ఢిల్లీలో అందుబాటులో ఉంటాం. మీరు ఉత్తరాఖండ్‌లో ఉంటూ తరచూ ఢిల్లీ రావడం కష్టంగా ఉంటుంది. కాబట్టి మీ బాధ్యతల్లో కొన్నింటిని ఇతర సభ్యులకు కేటాయిస్తున్నాం. మీరు ఉత్తరాఖండ్‌లో కుటుంబంతో సంతోషంగా ఉంటూ మీ వ్యాపారాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ నరీందర్ లేఖ రాశారు. ఈ లేఖతో రాజీవ్ మెహతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోసియేషన్ సభ్యులందరూ ఢిల్లీలో ఉండాలనే రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఆనాటి నుంచి ఇద్దరి మధ్య లేఖల యుద్ధం నడుస్తున్నది.

పేర్లు మాయం

తాజాగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధికార వెబ్‌సైట్ నుంచి తొమ్మిది మంది ఉపాధ్యక్షులు, ఆరుగురు సంయుక్త కార్యదర్శులు, 10మంది ఈసీ మెంబర్ల పేర్లను తొలగించారు. ఈ విషయాన్ని గుర్తించిన సహదేవ్ యాదవ్ అనే సభ్యుడు ఐవోఏ అధ్యక్షుడికి లేఖ రాశారు. వెంటనే ఆ వెబ్‌సైట్ నిర్వహిస్తున్న ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతాకు సమాచారం ఇచ్చారు. వెబ్‌సైట్ నుంచి సభ్యుల పేర్లను ఎందుకు తొలగించారని, తగిన వివరాలు ఇవ్వాలని కోరారు. కాగా, అధికారిక వెబ్‌సైట్‌లో కేవలం ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు, ఈసీ సభ్యుల పేర్లు మాత్రమే ఉంటాయని, మిగిలిన పేర్లంన్నింటిని వేరే సెక్షన్‌లోకి మార్చామని వివరణ ఇచ్చారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసిన సహదేవ్ యాదవ్‌కు కూడా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు చెప్పారు. అయితే కావాలనే రాజీవ్ మెహతా తన వర్గం వారి పేర్లను తొలగించారని, ఎన్నికైనా, నామినేట్ అయినా అందరూ ఐవోఏ కోసమే పని చేస్తున్నప్పుడు ఎందుకు ఇలా వేర్వేరు సెక్షన్లలో పేర్లు ఉంచాలని నరీందర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కీలకమైన ఒలింపిక్స్ సమయంలో ఐవోఏలో ఇద్దరు పెద్దలు ఇలా ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణితో వ్యవహరించడం సరికాదని పలువురు అంటున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన క్రీడలను తిరిగి ఎలా ప్రారంభించాలో చర్చించకుండా వీళ్లిద్దరూ ఇలా అధికారం కోసం పోటీలు పడటం అంత మంచిది కాదనే వాదన వినిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా ఐవోఏ సభ్యులు, అసోసియేషన్లతో చర్చలు జరపడం లేదని, ఒలింపిక్స్ సన్నాహాలు, లాక్‌డౌన్ తర్వాత పరిస్థితులపై చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News